బాంబు దాడులు దాటుకొని.. పతకం గెలిచి..

ABN , First Publish Date - 2022-07-21T09:49:15+05:30 IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ మహిళల హైజం్‌పలో ఆస్ట్రేలియాకు చెందిన పాటర్సన్‌ 2.04 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌ అథ్లెట్‌ యరోస్లావా

బాంబు దాడులు దాటుకొని.. పతకం గెలిచి..

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఉక్రెయిన్‌ అథ్లెట్‌కు రజతం


ఓవైపు సొంత దేశం ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం.. మరోవైపు ఆ మెగా టోర్నీలో పాల్గొనాలన్న సంకల్పం.. వెరసి ప్రాణాలకు సైతం లెక్కచేయని ధైర్యంతో ప్రత్యర్థి సైన్యాలను తప్పించుకొని మూడు రోజులు కార్లలో ప్రయాణించి దేశం వీడింది. సెర్బియా, జర్మనీ, టర్కీ మీదుగా అమెరికా చేరి శిక్షణ పొందింది. అత్యున్నత వేదికపై పోటీపడి అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి తన దేశవాసులకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో హైజంప్‌లో రజతం నెగ్గినా.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో లభించిన ఈ పతకం తనకు బంగారంతో సమానమని ఉప్పొంగిపోతున్న ఆమె పేరు యరోస్లావా మహుచిఖ్‌. 


యూజీన్‌ (అమెరికా): ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ మహిళల హైజం్‌పలో ఆస్ట్రేలియాకు చెందిన పాటర్సన్‌ 2.04 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచింది.  ఉక్రెయిన్‌ అథ్లెట్‌ యరోస్లావా మహుచిఖ్‌ కూడా అంతే దూరం దూకినా.. తొలి ప్రయత్నంలోనే ఆ దూరాన్ని లంఘించడంతో పాటర్సన్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో యరోస్లావా రెండోస్థానానికి పరిమితమై రజతంతో సరిపెట్టుకుంది. ఇటలీకి చెందిన ఎలెనా 2 మీటర్లతో కాంస్యం సాధించింది. అయితే, రజత పతకం నెగ్గిన ఉక్రెయిన్‌కు చెందిన యరోస్లావాకు ఇది స్వర్ణంతో సమానమని ఉద్వేగంగా వ్యాఖ్యానించింది. అందుకు కారణం లేకపోలేదు. ఆరు నెలలుగా రష్యాపై ఉక్రెయిన్‌ భీకర యుద్ధం చేస్తోంది. నాలుగు నెలల కిందటి పరిస్థితి గమనిస్తే యరోస్లావా అసలు వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొంటుందని  ఎవరూ ఊహించలేదు. 20 ఏళ్ల యరో స్లోవాది ఉక్రెయిన్‌ తూర్పుప్రాంతంలోని డ్నిప్రోపెట్రోవ్‌స్కీ నగరం.



తన దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రత్యర్థి సైన్యాలను తప్పించుకొని మూడురోజులు కార్లలో ప్రయాణించి అమెరికా చేరింది. అక్కడే శిక్షణ పొంది ప్రపంచ అథ్లెటిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న నగరం యూజీన్‌లో అడుగుపెట్టింది. చివరకు పతకాన్ని దక్కించుకొని తన దేశవాసులకు గర్వకారణంగా నిలిచింది. యరోస్లావా సహచరి ఇరీనా హైజం్‌పలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 22 మంది ఉక్రెయిన్‌ అథ్లెట్లు బరిలో నిలిచారు. వీరంతా భీతావహ పరిస్థితుల నడుమ దేశాన్ని వీడి పోర్చుగల్‌, స్పెయిన్‌, పోలెండ్‌ చేరుకొని అక్కడ ట్రెయినింగ్‌ తీసుకున్నారు. పురుషుల హైజంప్‌లో ఆండ్రీ ప్రొటెస్కో కాంస్యం నెగ్గడంతో చాంపియన్‌షి్‌పలో ఉక్రెయిన్‌ రెండు పతకాలు అందుకుంది. ‘మా దేశ స్వాతంత్య్రం కోసం బలంగా పోరాడుతున్నాం. విజయం సాధిస్తాం’ అని  మహుచిఖ్‌ ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

Updated Date - 2022-07-21T09:49:15+05:30 IST