Silicon Andhra: ఉత్తరకాలిఫోర్నియాలో ఘనంగా సిలికానాంధ్ర 21 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-16T03:22:24+05:30 IST

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో శనివారం సాయంత్రం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి.

Silicon Andhra: ఉత్తరకాలిఫోర్నియాలో ఘనంగా సిలికానాంధ్ర 21 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఎన్నారై డెస్క్: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో శనివారం సాయంత్రం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం ప్రకారం, ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయింది. శ్రీ చమర్తి రాజుగారు ప్రారంభోపన్యాసం చేస్తూ గత రెండు దశాబ్దాలుగా చేసిన ప్రయాణాన్ని, సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆహూతులతో పంచుకున్నారు. హాజరైన వందలాది తెలుగు కుటుంబాలు తెలుగు సాహితీసాంస్కృతికసంప్రదాయ స్ఫూర్తిని తరువాతి తరాలకు కూడా అందించేట్టుగా సంస్థ చేస్తున్న ప్రయాణం నిరాఘాటంగా కొనసాగాలని తమ మద్దతును ప్రకటించారు.

ఈ సాయంత్రం తొలి సాంస్కృతిక కార్యక్రమం ప్రముఖ వైణికులు శ్రీ ఫణి నారాయణ గారి వీణానాద కచ్చేరితో మొదలయింది. భారతీయ సనాతన సంప్రదాయ వీణావాద్యాన్ని నేటితరం వారిలో ఆసక్తిని, అనురక్తినీ కలిగించే విధంగా వారు స్వయంగా స్వరపరచి వినిపించిన గీతాలు, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. అవేకాక, తాను చరణాలను వాయిస్తూ, ప్రేక్షకులను పల్లవులు కనిపెట్టమంటూ వినిపించిన అన్నమయ్య కీర్తనలకు శ్రోతలు ఉత్సాహంతో ప్రతిస్పందించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కూచిభొట్ల ఆనంద్ కచేరి అనంతరం ఫణి నారాయణను సభికుల హర్షధ్వానాల మధ్య ఘనంగా సత్కరించారు. కచేరి ముగియడానికి ముందు కూచిభొట్ల ఆనంద్ అభ్యర్ధన మేరకు ఫణి నారాయణ వీణ మీద భారతీయ జాతీయగీతాన్ని మీటగా, సభికులంతా లేచి నిలుచుని తమ గళం కలిపి జాతీయగీతాన్ని ఆలపిస్తూ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న మాతృదేశంపై, ప్రవాస భారతీయులు తమ అభిమానాన్ని ప్రేమను చాటడం విశేషం. 


ఆ తరువాత, అమెరికా దేశంలో తొలిసారిగా నాట్యకళాకారులు వేదాంతం రాఘవ, వేదాంతం వెంకటాచలపతి నిర్దేశకత్వంలో కూచిపూడి యక్షగాన కార్యక్రమం, “ఉషాపరిణయం ” ప్రదర్శించారు. భారతదేశంలో కనుమరుగుపైపోతున్న ఈ కళారూపాన్ని అమెరికాలో పునరుద్దీపన చేసిన ఘనత సిలికానాంధ్రకు దక్కింది. వేదాంతం సోదరుల శిక్షణలో, అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలతో చేయించిన ఈ యక్షగానం 2 గంటల సేపు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమానంతరం అందరూ లేచి నిలబడి వినిపించిన కరతాళధ్వనులు మిన్నంటిపోయాయి. వేదాంతం వెంకటాచలపతి మాట్లాడుతూ తమ గురువుల, గతించిన తమ తల్లిదండ్రుల ఆశీర్వాద బలం వల్లే ఈ కార్యక్రమం రక్తికట్టిందని చెప్పారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రద్ధతో సాధన చేసిన విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, వారికి అమెరికాలో నాట్యవిద్యను నేర్పిస్తున్న గురువులకు అభినందనలు, పిల్లలకు ఆశీస్సులు తెలియజేసారు. ఈ యక్షగానం సాకల్యం కావడానికి పట్టుదలతో కృషిచేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యురాలు చింతలపూడి జ్యోతికి ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. దీనికి వేదాంతం సోదరులతో పాటు భారతదేశంనుంచి వచ్చిన గాత్ర, వాద్య కళాకారులకు కూచిభొట్ల ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేసారు.


ఉర్రూతలూగించిన ఈ కార్యక్రమాన్ని అచ్చ తెలుగు భోజనంతో ముగించారు. ప్రత్యేకంగా తెప్పించిన అరటి ఆకుల్లో కార్యకర్తలు కొసరి కొసరి వడ్డిస్తుంటే అలా పంక్తిలో కూర్చుని భోజనం చెయ్యడం పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చిదంటూ ప్రవాస భారతీయలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెప్పించి వడ్డించిన మామిడిపళ్ళు భోజనంలో మరో ఆకర్షణ.  గత రెండు దశాబ్దాల్లో సంస్థలో కీలక పాత్రలు పోషించిన నాయకులు దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, మాడభూషి విజయసారధి, తనుగుల సంజీవ్ ప్రభృతులను, ప్రస్తుత నాయకత్వ జట్టును కూచిభొట్ల ఆనంద్ సభికులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరై, సంస్థకు సంస్థాపనదినోత్సవ శుభాకాంక్షలను, శుభాస్సీసులను అందజేశారు. భారత కాన్సులేట్ జనరల్ టి. నాగేంద్రప్రసాద్, అమెరికా పర్యటనలో ఉన్న బైలూరు రామకృష్ణ మఠం అధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ వినాయకానంద గారు, సిలికానాంధ్ర శ్రేయోభిలాషి, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర భవనానికి తొలిదాత విశ్రాంత వైద్యులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభృతులు హాజరైన వారిలో ఉన్నారు. 











Updated Date - 2022-08-16T03:22:24+05:30 IST