సీలేరు కాంప్లెక్స్‌లో భద్రత ఎంత..?

ABN , First Publish Date - 2020-08-24T19:18:14+05:30 IST

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంతో జిల్లాలోని జలవిద్యుత్‌ కేంద్రాల్లో రక్షణ చర్యలు ఏలా వున్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో

సీలేరు కాంప్లెక్స్‌లో భద్రత ఎంత..?

120 కిలోమీటర్ల దూరంలోని నర్సీపట్నంలో అగ్నిమాపక కేంద్రం 

అక్కడి నుంచి ఫైర్‌ ఇంజన్‌  రావడానికి ఆరేడు గంటల సమయం

శ్రీశైలం తరహా ప్రమాదాలు సంభవిస్తే చేతులెత్తేయాల్సిన పరిస్థితి

ఐదు దశాబ్దాలుగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయని జెన్‌కో అధికారులు


సీలేరు (విశాఖపట్టణం): శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంతో జిల్లాలోని జలవిద్యుత్‌ కేంద్రాల్లో రక్షణ చర్యలు ఏలా వున్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులను బయటకు తీసుకురావడానికి అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు 16 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీలేరు కాంప్లెక్సులో పొరపాటున ఈ తరహా ప్రమాదం జరిగితే.... తక్షణమే నివారణ చర్యలు చేపట్టడానికి అవసరమైన అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది అంతం తమాత్రంగానే వున్నారు. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో నాలుగు చోట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు వుండగా, ఒక్కచోట కూడా అగ్నిమాపక కేంద్రం లేదు. ఇవన్నీ ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటైనవి కావడం, తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతూ విధులు నిర్వహిస్తున్నారు.


సీలేరు కాంప్లెక్సులో మాచ్‌ఖండ్‌, సీలేరు, డొంకరాయి, పొల్లూరులో జలవిద్యుత్‌ కేంద్రాలు వున్నాయి. మాచ్‌ఖండ్‌ కేంద్రం ఏపీ, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో వుండగా, మిగిలిన మూడూ ఏపీ జెన్‌కో ఆధీనంలో వున్నాయి. మొత్తం మీద 845 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం వుంది. వీటిల్లో ఏదైనా ప్రమాదం జరిగితే నివారణ చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక యంత్రాలు నామమాత్రంగానే ఉన్నాయి. శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం తరహాలో సీలేరు కాంప్లెక్స్‌లో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే, సిబ్బంది చేతులెత్తేయాల్సిందే. తక్కువ ఖర్చుతో విద్యుత్‌ అందిస్తున్న ఈ కేంద్రాల భద్రతపై జెన్‌కో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతున్నదన్న విమర్శలు ఉద్యోగ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్‌ కేంద్రాలకు ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బంది, ఫైర్‌ ఇంజన్లను సమకూర్చడానికి జెన్‌కో ఉన్నతాధికారులు కనీస చర్యలు చేపట్టడంలేదు. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోని జనరేటర్‌ విభాగంలో సాంకేతిక లోపాలు తలెత్తి పలుమార్లు స్టాటర్‌ కాయిల్స్‌లో కాలిపోవడం, మంటలు రేగడం వంటివి సంభవించాయి. అయితే అలారమ్‌ మోగడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యేవారు. 


120 కి.మీ.దూరంలో అగ్నిమాపక కేంద్రం

సీలేరు జలవిద్యుత్‌ కేంద్రానికి అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ ఇంజన్‌ రప్పించాలంటే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నుంచి రావాల్సి ఉంటుంది. దీనిలో 100 కి.మీ. వరకు ఘాట్‌ రోడ్డే! సీలేరు చేరాలంటే ఆరు గంటలకుపైగా సమయం పడుతుంది. అలాగే పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి నుంచి ఫైర్‌ ఇంజన్‌ రావాల్సి ఉంటుంది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సీవో2(కార్బన్‌డయాక్సైడ్‌) లైన్లు జనరేటర్‌, టర్బయిన్‌ ఫ్లోర్‌ కంట్రోల్‌ రూమ్‌, స్విచ్‌యార్డులకు ఉన్నాయి. దీంతో చిన్నపాటి అగ్ని ప్రమాదాలను మాత్రమే నివారించవచ్చు. శ్రీశైలం తరహా ప్రమాదం జరిగితే ఇవేమీ పనిచేయవు.


ఫైర్‌ ఇంజన్‌ కోసం రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు

సీలేరు కాంప్లెక్సులో కూడా అగ్నిమాపక సిబ్బంది, ఫైర్‌ ఇంజన్‌ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు చేశామని, కానీ కార్యరూపం దాల్చలేదని ఇటీవల ఇక్కడి నుంచి బదిలీ అయిన ఈఈ మల్లేశ్వరప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. శ్రీశైలం తరహాలో సీలేరు కాంప్లెక్సుల్లో ప్రమాదం జరిగే అవకాశం లేదని, ఒకవేళ ఇక్కడ ప్రమాదం జరిగినా... ప్రాణ నష్టం జరిగే అవకాశం వుందని అభిప్రాయపడ్డారు. సీలేరు కాంప్లెక్సులోని విద్యుత్‌ కేంద్రాలు భూమి ఉపరితలానికి 100 నుంచి 150 అడుగుల లోతున మాత్రమే వున్నాయని చెప్పారు. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం భూగర్భంలో ఒకటిన్నర కిలోమీటర్ల లోతున ఉండడం వల్ల  పొగ బయటకు వెళ్లక,  ప్రాణ నష్టం జరిగిందన్నారు.


మాచ్‌ఖండ్‌లో తరచూ ప్రమాదాలు

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంపై ఇరు ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినవస్తున్నాయి. దీనిని నిర్మించి సుమారు 70 ఏళ్లు కావస్తున్నది. ఇంతవరకు ఆధునికీకరణకు నోచుకోలేదు. దీంతో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తి, ప్రమాదాలు జరుగుతున్నాయి. గత పదేళ్లలో సుమారు ఆరుసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదాలు సంభవించి, ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది. గతంలో ఒకసారి  జరిగిన ప్రమాదంలో జేఈ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. పదేళ్ల క్రితం షార్ట్‌ షర్క్యూట్‌ కారణంగా జరిగిన ప్రమాదంలో భారీ నష్టంతోపాటు సుమారు 28 రోజులు విద్యుత్‌ ఉత్పాదన నిలిచిపోయింది. కాలం చెల్లిన జనరేటర్లు, యంత్రసామగ్రి కారణగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 95 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో అగ్రిమాపక కేంద్రం వుంది. ఇక్కడి నుంచి వాహనం రావడానికి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. 


ముందస్తు చర్యలు చేపడుతున్నాం

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు ఎస్‌ఈ కె.వి.నాగేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. శ్రీశైలం విద్యుత్‌ ప్రాజెక్టులో ప్రమాదం జరిగినట్టు తెలిసిన వెంటనే ఇక్కడి ప్రాజెక్టు సిబ్బంది, అధికారులతో సమావేశమై తగు సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా మంటలను అదుపుచేసేందుకు సీవో2 గ్యాస్‌ సిలెండర్లు, ఫోమ్‌ అందుబాటులో వున్నాయని చెప్పారు.

Updated Date - 2020-08-24T19:18:14+05:30 IST