నిశ్శబ్ద మహమ్మారి!

ABN , First Publish Date - 2021-07-09T06:25:41+05:30 IST

మనం ఒక అసాధారణ కాలంలో నివశిస్తున్నాం. ఒక విషాణువు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసింది. మనుగడలను హరిస్తున్న విపత్తుల మధ్య...

నిశ్శబ్ద మహమ్మారి!

మనం ఒక అసాధారణ కాలంలో నివశిస్తున్నాం. ఒక విషాణువు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసింది. మనుగడలను హరిస్తున్న విపత్తుల మధ్య మనం మరొక మహమ్మారిపై దృష్టిని కేంద్రీకరించవలసి ఉంది. అది ఎటువంటి ముప్పో ఇప్పటికింకా స్పష్టం కానప్పటికీ మనం ఊహించలేని రీతుల్లో అది మన ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీస్తున్నది. ‘సూక్ష్మ జీవినాశకాలకు ఎదురవుతున్న ప్రతిఘటనే (యాన్టీమైక్రోబియల్ రెసిస్టన్స్–ఎఎమ్‌ఆర్) ఈ మహమ్మారి. ఇదొక నిశ్శబ్ద మహమ్మారి. కొవిడ్–19, వాతావరణ మార్పుల వలే ఎఎమ్‌ఆర్ మానవాళికి ఒక మహావిపత్కారి. ఔషధాలు పనిచేయకపోవడం, చికిత్సలకు లొంగని వ్యాధుల బారిన పడడం లాంటి పరిస్థితులు ఉత్పన్నమయినప్పుడు మానవజీవిత విషాదం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోండి. ఎఎమ్‌ఆర్ ఇప్పుడు మీకు, నాకు, ప్రతి ఒక్కరికీ అటువంటి దుస్థితిని తెచ్చి పెడుతోంది. 


కొవిడ్ సంక్షోభం మనకు కొన్ని పాఠాలు నేర్పింది. మొదటిది- ఆరోగ్య భద్రతకు ప్రపంచ ఎజెండాలో అగ్రస్థానం కల్పించింది. వాక్సిన్లు అన్ని దేశాల వారికీ అందుబాటులో ఉండాలన్న అంశంపై అందరూ ఏకీభవిస్తున్నారు. మన జీవితాలు పరస్పరాధారితాలు. ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా లేకపోతే ప్రతి ఒక్కరూ నష్టపోతారు. మహమ్మారుల నుంచి పేదలకు రక్షణ కొరవడితే వాటి నుంచి సంపన్నులకూ భద్రత కొరవడుతుందన్న సత్యం అందరికీ తెలిసివచ్చింది. సమ్మిళిత, సమరీతి ఆరోగ్య భద్రతా సదుపాయాలు ప్రతి ఒక్కరికీ సమకూర్చడం చాలా ముఖ్యం.


రెండోది- వ్యాధి నివారక వైద్యం విలువను మనం మునుపటి కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాం. వ్యాధి నిరోధక చర్యల్లో మంచినీటి పాత్ర ఎంత ముఖ్యమైనదో కొవిడ్ మహమ్మారి స్పష్టం చేసింది. కనుకనే ప్రభుత్వం ఆరోగ్యరంగంలో చేసే వ్యయాలలో ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటి లభ్యతను, పారిశుద్ధ్యాన్ని కూడా చేర్చారు. ప్రస్తుత, భావి మహమ్మారుల కట్టడిలో వ్యాధి నిరోధక చర్యలే కీలకం. వ్యవసాయరంగంలో అధికోత్పత్తికై రసాయనాలను మితిమీరిన స్థాయిలో వినియోగించి పర్యావరణాన్ని విషపూరితం చేయడం జరుగుతోంది. తత్ఫలితంగా ఉత్పన్నమవుతున్న దుష్ఫలితాలను నివారించడం కోసం పర్యావరణ ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు మహా ప్రయాస పడవలసివస్తోంది. అసలు పర్యావరణ రసాయినీకరణే సరికాదని, ప్రకృతిని కాలుష్యం కోరల నుంచి విముక్తం చేయడమనేది భరించలేని వ్యయాలు, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని పేదదేశాలు గ్రహించి తీరాలి. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. సంపన్న దేశాలు ఇప్పటికే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరికీ విద్య వైద్యాలను సమకూర్చేందుకు ప్రపంచదేశాలు పలు సమస్యల నెదుర్కొంటున్న తరుణంలో పర్యావరణ సమస్యలు విషమించకుండా జాగ్రత్తపడడం చాలా ముఖ్యం. కనుక పర్యావరణ కాలుష్య నివారణకు మనం కొత్త పద్ధతులను అనుసరించాలి. నూతన మార్గాలలో ముందుకు పోనప్పుడు సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతాయి. 


మూడోది– ప్రకృతిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాలన్న మానవ ఆరాటమే కొవిడ్–19, ఎఎమ్‌ఆర్ వైపరీత్యాలకు కారణమయింది. ఈ వాస్తవం వెలుగులో మనం మన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటున్న, పర్యావరణాన్ని నిర్వహించుకుంటున్న తీరుతెన్నులను పునఃపరిశీలించుకోవల్సిన అవసరముంది. ఆహారోత్పత్తి- పంటలు, పశుగణాభివృద్ధి, చేపల పెంపకం-లో సూక్ష్మజీవి నాశకాలను భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నాం. రైతుల జీవనాధారాలను కాపాడేందుకు సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం అనివార్యమనే వాదన ఒకటి ఉంది. అయితే పశుగణాభివృద్ధిలో సూక్ష్మజీవి నాశకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం జరుగుతోందన్న వాస్తవాన్ని ఆ వాదన చేస్తున్నవారు విస్మరిస్తున్నారు. 

యాన్టీబయోటిక్స్ (వ్యాధిజనక క్రిమి నాశకాలు) వినియోగం, దుర్వినియోగమనేది మన ఆహారవ్యవస్థతో ముడివడివున్న అంశం. పశువులను ఎలా పెంచుతున్నారు, వాటికి పచ్చికబయళ్లు అందుబాటులో ఉంటున్నాయా? ఒక్కో కొట్టంలో ఎన్ని పశువులను ఉంచుతున్నారు? ఆహారజగత్తులో అంతరిస్తున్న జీవవైవిధ్యం మొదలైన అంశాలపై మనం పూర్తి శ్రద్ధ చూపవలసి ఉంది. ఎఎమ్‌ఆర్ విపత్తు నెదుర్కోవడంలో తొలుత ఈ ఆహార, పర్యావరణ సమస్యలను పరిష్కరించుకోవాలి.

మన ప్రజలకు ఆరోగ్యభద్రతా సదుపాయాలను పెంపొందించాలి. ప్రాణరక్షణ ఔషధాలను అందరికీ అందుబాటులో ఉంచాలి. ఆహారోత్పత్తిని పెంపొందించాలి. అదే సమయంలో రైతులకు జీవనాధారాల భద్రత కల్పించాలి. అయితే ఈ క్రమంలో పర్యావరణానికి నష్టం జరిగితే అందుకు మనం భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. కనుక మానవ ఆరోగ్యభద్రతకు అతి ముఖ్యమైన యాన్టీ మైక్రోబియల్స్ (సూక్ష్మజీవినాశకాలు)ను జంతువులకు, మొక్కలకు ఉపయోగించకూడదు. ఇది ‘సంరక్షణ ఎజెండా’. తరువాతది ‘అభివృద్ధి ఎజెండా’. సూక్ష్మజీవి నాశకాలను విచక్షణారహితంగా ఉపయోగించకుండా ఆహారోత్పత్తిని అధికం చేసుకోవడమే ఈ ఎజెండా లక్ష్యం. చివరిది ‘పర్యావరణ ఎజెండా’. ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు మొదలైన వాటి నుంచి వెలువడే వ్యర్థాల జాడ తెలుసుకుని వాటిని నిరోధించాలి. 


మన పంటపొలాలలో కోతలు, నూర్పిళ్ళ అనంతరం మిగిలిపోయే వ్యర్థాలు నిజానికి వ్యర్థాలు కావు. అవి పంటభూములకు నిజమైన పోషకాలు. సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని నివారించవలసిన అవసరమున్నందున వాటిని ఎరువులుగా పునరుపయోగించుకోవచ్చు. మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సూక్ష్మజీవి నాశకాల వినియోగాన్ని నియంత్రించడం అన్ని విధాల శ్రేయస్కరం. మనకు మనం మేలు చేసుకోవడమో లేక హాని చేసుకోవడమో అనేది మన చేతుల్లోనే ఉంది.


సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ 

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Updated Date - 2021-07-09T06:25:41+05:30 IST