టీడీపీ ఎదుగుదలకు మౌనసాక్షి.. తెలుగు విజయ కుటీరం

ABN , First Publish Date - 2022-05-28T05:21:17+05:30 IST

టీడీపీ ఎదుగుదలకు మౌనసాక్షి.. తెలుగు విజయ కుటీరం

టీడీపీ ఎదుగుదలకు మౌనసాక్షి.. తెలుగు విజయ కుటీరం
నాటి రాష్ట్ర పార్టీ కార్యాలయ భవనం


  • నేడు  మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు శతజయంతి

మొయినాబాద్‌, మే 27: తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్రారంభమే ఓ చరిత్ర. అయితే ఆ పార్టీ ఏర్పాటైన 9నెలలకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మరో చరిత్ర!. నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగు ప్రజల జీవితాల్లో చిరస్థానాన్ని సంపాదించుకుంది. 1982 మార్చి 29న ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా దేశంలో ఎన్నడూ లేని సంక్షేమ పథకాలను అమలు చేశారు. అప్పట్లో పార్టీ కోసం హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగువిజయం ప్రాంగణం ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావం మొదలు మహానాడులు, అనేక ఇతర కార్యక్రమాలు, సంఘటనలు, పార్టీ సమావేశాలు తెలుగువిజయం వేదికైంది. నేడది మౌన సాక్షీభూతంగా నిలిచింది. శనివారం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

ఎన్టీఆర్‌ కుటీరం.. పార్టీ ప్రస్థానం 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో గండిపేట చెరువు ఒడ్డున ఎన్టీఆర్‌ కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిలోనే పార్టీ ప్రస్థానం, కార్యాలయాన్నీ నిర్మించారు. ఎన్టీఆర్‌ కుటీరానికే శాంతికుటీరం అని నామకరణం చేశారు. కాగా టీడీపీ కార్యాలయానికి తెలుగువిజయం అని పేరు పెట్టారు. 1983లో 2-30 ఎకరాలు కుటీరం కోసం, 4-30ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి కొన్నారు. ముందు కుటీరాన్ని ప్రారంభించారు. 1985లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కుటీరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ముందు కొన్నాళ్లు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పార్టీ కార్యాలయం ఉండేది. ఎన్టీఆర్‌ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు సైతం ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అనేకసార్లు మహానాడులను ఇక్కడ నిర్వహించారు.

 వేలాది మందికి విద్యాబుద్ధులు

1996లో ఎన్టీఆర్‌ మరణానంతరం హిమాయత్‌నగర్‌లోని తెలుగువిజయం ప్రాంగణంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పేరుతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ స్కూల్‌, ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల, ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీ నడుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాఠశాలలో 500 మంది బాలికలు, కాలేజీల్లో 900 మందిమహిళలు చదువుతున్నారు. అదనంగా మరో 8 ఎకరాలు కొని కళాశాలలు నిర్మించారు. 

52ఏళ్లుగా  కుటుంబంతోనే..

ప్రస్తుత ఎన్టీఆర్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎన్‌ఎ్‌స.ప్రసాద్‌ 52ఏళ్లుగా ఎన్టీఆర్‌ కుటుంబంతోనే ఉన్నారు. ఎన్టీఆర్‌ సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేసిన ప్రసాద్‌.. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక పీఏగా పనిచేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటీరంలో ఉంటూ ట్రస్ట్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ విధులు నిర్వహిస్తున్నారు.  కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో శనివారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రెండు రోజులపాటు జరిగే మహానాడుతోపాటు 28న ప్రారంభం కానున్న ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో పార్టీ శ్రేణులు పాలుపంచుకుంటాయి. 

Updated Date - 2022-05-28T05:21:17+05:30 IST