మౌనమే గురువు!

ABN , First Publish Date - 2020-10-02T06:51:44+05:30 IST

మౌనమే గురువు!

మౌనమే గురువు!

శిష్యులకు సద్గురువులు చేసే బోధలు కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. కొందరు అనుగ్రహభాషణాలతో, మరికొందరు ఆచరణాత్మకమైన పద్ధతుల్లో బోధిస్తారు. దక్షిణామూర్తిగా మౌనంగానే ఉపదేశించి శిష్యులలో జ్ఞానజ్యోతి వెలిగించిన పరమ శివుడి కథ సుప్రసిద్ధం. సూఫీ గురువు జునైద్‌ది కూడా అదే మార్గం.


జునైద్‌ సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వలేదు. చెవిలో ఏదో మంత్రాన్ని చెప్పలేదు. మౌనంగానే శిష్యుడిలోని దుర్గుణాలను తొలగించాడు. ఒక మహనీయుడిగా తీర్చిదిద్దాడు. 


జునైద్‌ ప్రఖ్యాతి చెందిన ఒక సూఫీ గురువు. ఆయన గొప్పతనం విన్న అల్‌ హిలాజ్‌ అనే వ్యక్తి ఆయనను కలవాలనుకున్నాడు. ఎంతో శ్రమపడి  వెతుకుతూ, వెతుకుతూ చివరకు జునైద్‌ ఉన్న చోటును చేరుకున్నాడు.


అల్‌ హిలాజ్‌ను చూసిన జునైద్‌ ‘అక్కడే కూర్చో!’ అని సైగ చేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొంతసేపటి తరువాత ‘వెళ్ళిపో!’ అన్నట్టు సైగచేసి, ఇంటి లోపలకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. ఇది రోజులో, వారాలో, నెలలో కాదు, రెండు సంవత్సరాల పాటు ఇదే తంతు కొనసాగింది. అయితే అల్‌ హిలాజ్‌ పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు.


రెండేళ్ళ తరువాత, జునైద్‌ అతణ్ణి చూసి నవ్వి, దగ్గరకు వచ్చి ‘కూర్చో!’ అన్నట్టు సైగ చేశాడు. అలా మరో రెండేళ్ళు గడిచాయి. మొత్తం ఆ నాలుగేళ్ళలో ఒక్క మాట కూడా అతనితో జునైద్‌ మాట్లాడలేదు. నాలుగేళ్ళ తరువాత, తన పాదాల వద్ద కూర్చున్న అల్‌ హిలాజ్‌ తల మీద తన చేతిని ఉంచాడు. మళ్ళీ మౌనమే. ఇంకో రెండేళ్ళు గడిచాయి. 


ఆరు సంవత్సరాలు పూర్తయ్యాక, అల్‌ హిలాజ్‌ కళ్ళలోకి జునైద్‌ సూటిగా చూస్తూ ‘‘నీకు ఇవ్వదలచుకున్న బోధనూ, శిక్షణనూ ఇచ్చాను. ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు’’ అన్నాడు. 


అల్‌ హిలాజ్‌ కృతజ్ఞతా బాష్పాలతో ఆయన పాదాలను కడిగి అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోయాడు. 


ఆ ఆరేళ్ళ కాలంలో వారి మధ్య ఏం జరిగింది? ఆయన కానీ, ఈయన కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఆయన ఏం బోధించినట్టు? ఈయన ఏం నేర్చుకున్నట్టు?


ఆ తరువాత అల్‌ హిలాజ్‌ పేరుపొందిన గురువయ్యాడు. అతనికి వేల మంది శిష్యులయ్యారు. ఒక రోజు తన అనుభవాన్ని అతను వివరిస్తూ..


‘‘నా గురువు జునైద్‌ మొదటి రోజు నాతో మాట్లాడకుండా కేవలం సైగ చేసినందుకు నాకు చాలా కోపం వచ్చింది. క్రమ క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ఆయన మీద ఉన్న కోపం రెండేళ్ళకు పూర్తిగా నశించింది. అప్పుడు ఆయన నన్ను దగ్గరకు రమ్మన్నారు. కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు నాలో కోపం లేదు కానీ దుఃఖం ప్రారంభమయింది. రెండు సంవత్సరాలు బాధపడ్డాను. ఆ బాధ కూడా క్రమంగా తగ్గింది. చివరకు అది అంతరించి, తెలియని మౌనం నన్ను ఆవరించింది. ఆ మౌనంతో రెండేళ్ళు గడిచిపోయాయి. అలా ఆరేళ్ళు గడచిన తరువాత నా గురువు నా వైపు సూటిగా చూస్తూ, నా తలపై తన దివ్య హస్తాన్ని ఉంచి ‘బోధ అయిపోయింది. శిక్షణ అయిపోయింది- పొమ్మన్నా’రు’’ అని చెప్పాడు. 


జునైద్‌ సుదీర్ఘమైన ఉపన్యాసాలను ఇవ్వలేదు. చెవిలో ఏదో మంత్రాన్ని చెప్పలేదు. మౌనంగానే శిష్యునిలోని దుర్గుణాలను తొలగించాడు. ఒక మహనీయుడిగా తీర్చిదిద్దాడు. అలాగే శిష్యుడైన అల్‌ హిలాజ్‌ తన ఆశయాన్ని వదలుకోలేదు. లక్ష్యాన్ని మరువలేదు. కోపాన్ని దిగమింగాడు. దుఃఖాన్ని అధిగమించాడు. మౌనాన్ని అనుభవించాడు. నిశ్చల ధ్యాన ఫలితాన్ని అందుకున్నాడు. 

- రాచమడుగు శ్రీనివాసులు 

Updated Date - 2020-10-02T06:51:44+05:30 IST