మౌనమే ప్రబోధం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

మౌనంతో బోధ చేస్తున్న శ్రీ దక్షిణామూర్తి ప్రాచీన మూర్తులు ఆలయాల గోడల మీద కనిపిస్తూ ఉంటాయి.

మౌనమే ప్రబోధం

మౌనంతో బోధ చేస్తున్న శ్రీ దక్షిణామూర్తి ప్రాచీన   మూర్తులు ఆలయాల గోడల మీద కనిపిస్తూ ఉంటాయి. 


చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా

గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః 


‘‘వట వృక్షం కింద ఒక అద్భుతం జరుగుతోంది. బోధించేవాడు యువకుడు. శిష్యులంతా వృద్ధులు. గురువు నోరు విప్పలేదు. కానీ శిష్యుల సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి’’ అని అర్థం.


మౌనం ద్వారా ఒక గురువు ఎలా బోధించగలడనే ఆశ్చర్యం కలగవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ కంచి కామకోటి పీఠం పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. ఇది నిరూపితమైన, అనుభవంలోకి వచ్చిన వాస్తవం. ‘పరమాచార్య దివ్య ప్రభావం’ అనే సూర్యకిరణ కాంతిలో తడిసినవారు సాధారణ జీవితంలోని బాధలకూ, ఒత్తిళ్ళకూ అతీతులవుతారు. ఆయన దివ్య ప్రభావం ఎంత గొప్పదనేది తెలుసుకోగలుగుతారు. ఆయన పూర్తి మౌనంగా ఉన్న రోజుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా పని చేసేది. ఇదెలా సాధ్యం? మనుషులు తమ ఆలోచనల్లోని శూన్యతను ఆకర్షణీయమైన పదజాలం ముసుగులో దాచిపెడుతూ ఉంటారు. జ్ఞానం, సత్యం తెలిసిన వారు మాటలను గొప్ప జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇతరులు ఆలోచించడానికి ముందు మాట్లాడతారు. తెలివైన వాళ్ళు మాట్లాడడానికి ముందు ఆలోచిస్తారు. చెబుతున్న వ్యక్తి తను చెప్పదలచుకున్న విషయాన్ని కచ్చితంగా అర్థం చేసుకున్నప్పుడు, వింటున్న వ్యక్తికి అది సరిగ్గా చేరినప్పుడు మాత్రమే అది సంతృప్తికరమైన సంభాషణ అవుతుంది.


స్వామీజీ దగ్గరకు ఉపశాంతికోసం వెళ్ళేవారికి, ఆయన సమక్షమే ఓదార్పును ఇచ్చేది, దానికి ఆయన మాటలు అవసరం అయ్యేవి కావు. అదే సమయంలో తెలివైన పండితుల దృష్టి కొన్ని సందర్భాల్లో పక్కకు మళ్ళేది.


మౌనం ద్వారా చేసే ఈ బోధన ‘అనేకత్వంలో ఏకత్వం’ అనే అద్వైత సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది. అది అంతిమమైన వాస్తవికత. దానికి కాల, స్థల, పదార్థ పరిమితులేవీ లేవు, అదే సర్వం. దానికి పైన కానీ, కింద కానీ ఏదీ లేదు. దాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్న వ్యక్తులు దాని సహజమైన, స్వాభావికమైన శాంతిని అనుభూతి చెందుతారు. అన్ని ఒత్తిడులు, సందేహాలూ సమసిపోతాయి, ఎందుకంటే వాటి విషయంలో క్షణిక దృష్టి మాత్రమే ఉంటుంది, అక్కడ సందేహాలకి తావుండదు.


సత్యాన్ని చేరుకున్నవారు దానిలో జీవిస్తారు. దానికి మించినదేదీ లేదు. ‘ఉండడం’ అనేదానికి సహజసిద్ధమైన స్థితి కేవలం నిశ్శబ్దమే. ప్రపంచంలో సత్యాన్ని చేరుకోవడం కష్టమైన పని, కానీ దాన్ని తెలిసిన వ్యక్తిని ఆరాధించడం సులువైన పని. సత్యం స్వభావాన్ని నిర్ధారించలేం, 

ఎందుకంటే తెలియనిదాన్ని నిర్వచించడం వ్యర్థం. అందుకే నిర్వాణం స్వభావం గురించి ఒక వ్యక్తి తనను ప్రశ్నించినప్పుడు బుద్ధుడు మౌనం పాటించాడు. అందుకనే సత్యం స్వభావం గురించి తనను పోంటియస్‌ పిలేట్‌ ప్రశ్నించినప్పుడు ఏసు క్రీస్తు అదే విధమైన మౌనం వహించాడు.


కానీ అంతులేని కరుణతో మన మధ్య ఒక శరీరంగా జీవించే మార్గాన్ని ఎంచుకున్న జగద్గురువు మన శ్రేయస్సు కోసం... ఒక అంతుపట్టని ప్రదేశంలో అన్వేషకుల్లా వెతుకులాడేవారి కదలికలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన చైతన్యవంతమైన, శక్తిమంతమైన మౌనం.. అది దిక్సూచిలో కదిలే ముల్లులా అన్వేషకుల్ని అప్రమత్తం చేస్తుంది.


నా వ్యక్తిగతమైన అనుభవం ఒకటి చెబుతాను. నాకు చాలాకాలం ఒక సందేహం ఉండేది. ధ్యానంలోని శాంతి, ప్రశాంతత అనేవి కేవలం భావోద్వేగపరమైన ఉన్నత స్థితి లేదా భ్రాంతి అయినట్టయితే దానికి అర్థం లేదనిపించేది. అసలైన సత్యాన్ని తెలుసుకోవడానికీ, నిర్ధారించుకొని అనుభూతి చెందడానికీ సంతృప్తికరమైన పరీక్ష ఏదీ లేదనీ  అనిపించేది. అలాంటి పరీక్ష ఏదీ లేకపోతే... స్వీయ భ్రాంతినే ‘బ్రహ్మానుభవం’గా పొరపాటుపడే ప్రమాదం లేకపోలేదు. అందుకే, పరమాచార్య మార్గదర్శకత్వాన్ని కోరాను. 


ఆయన ఏ సమస్యనయినా తార్కికంగా విశ్లేషించేవారు, సంభావ్యమైన ఒక సమాధానం సూచించేవారు, ఆదేశించేవారు కాదు. అది సంతృప్తి కలిగించకపోయినా, ప్రభావం చూపించేది. నా సమస్య గురించి తన సహజసిద్ధమైన స్పష్టతతో ఆయన మాట్లాడుతూ ‘‘సత్యాన్ని సత్యంగా గుర్తించడం ఎలా? ఎందుకంటే మనసు మారువేషాలు వేయిస్తున్నప్పుడు... వాటినుంచి సత్యాన్ని వేరుచేసి ఎలా చూడాలి? ఇదే కదా నీ సందేహం?’’ అని అడిగారు. ‘‘నువ్వు మనసు గురించి భయపడుతున్నావా? మనసనేది భగవంతుడు ఇచ్చిన చాలా శక్తిమంతమైన సాధనం కదా! ఒకవేళ అది సత్యానికి సంబంధించిన భ్రాంతిని సృష్టించినట్టయితే, దాన్ని ఎందుకు అనుసరించకూడదు? ఒక చిన్న పిల్లవాడు నడబండితో నడక నేర్చుకుంటాడు. తరువాత దాన్ని వదిలేస్తాడు. మరి ‘మనసును ఎప్పుడు పక్కన పెట్టాలి?’ అనే సందేహం వస్తుంది. దీనికి జవాబు ఏమిటంటే... ఒక మనిషి సైకిల్‌ తొక్కడం నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు... తను నేర్చుకుంటున్న దశ నుంచి నేర్చుకున్నవాడిగా ఎప్పుడు మారతాననేది కచ్చితంగా ఎన్నడూ గుర్తించలేడు. సాధారణంగా, ఒక శుభోదయాన, ఎటువంటి తర్కం అవసరం లేకుండా, తనకు సైకిల్‌ తొక్కడం వచ్చేసిందని అతను తెలుసుకుంటాడు’’ అన్నారు. ఆయన వివరణ నాకు పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినా, కాస్త సమాధానపడేలా చేసింది. నా సమస్య ఇంకా నాతోనే ఉంది. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు... స్వామి వారు సంపూర్ణ మౌనంలో ఉన్నప్పుడు... ఆయన సమక్షంలో ఉన్న నాకు... ఆ క్షణం రానే వచ్చింది.


నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. సత్యాన్ని సత్యంతోనే పరీక్షించాలి. సత్యం అంతిమం. అంతిమమైనదాన్ని మనసులోని ఏ తార్కికమైన విభాగాలతోనూ పరీక్షించలేం. ఈ ఆలోచనతోపాటు, నాలో అత్యున్నతమైన, అపారమైన దృఢ నిశ్చయం పెరిగింది. అది జ్ఞానానుభవం, అది జ్ఞానం... కేవలం మనసు చేస్తున్న మాయ కాదు. హఠాత్తుగా మనసు చెర నుంచి నేను విముక్తి పొందాను, ఒక శిశువులా స్వీయానందం పొందాను. జీవించడం ఎలాగో మనిషి నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనసు నుంచి తనను తాను విముక్తి చేసుకోగలడు. మనసు ద్వారా ఈ విషయాన్ని ఎలా నేర్చుకోగలం?తనను తాను జీవన్ముక్తుడినని తెలుసుకున్న పరమాచార్య జీవితంలోని ఏ దశకూ, లక్షణానికీ భయపడలేదు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా... తన అంతర్గత ప్రశాంతతను చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావానికి గురికానివ్వలేదు.

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే

తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః


‘‘బావులు, చిన్న చెరువులు లాంటి వాటివల్ల కలిగే ప్రయోజనాలన్నీ నీటితో నిండిన తటాకం వల్ల ఎలా 

నెరవేరుతాయో, సమస్త వేదాలలో ప్రతిపాదితాలైన 

కర్మ ఫలాలన్నీ ఆత్మానుభవం పొందిన బ్రహ్మజ్ఞానికి కలుగుతాయి’’ అన్నది భగవద్గీత. దానికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీ పరమాచార్య.


ఎన్‌.రమేశన్‌, దివంగత ఐఎఎస్‌ 

(శ్రీ పరమాచార్య ప్రధాన శిష్యులలో ఒకరు)

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST