ష్‌.. గ ప్‌చుప్‌

ABN , First Publish Date - 2022-09-23T06:24:04+05:30 IST

సీఎం వస్తున్నారని ప్రతిపక్ష నేతలను బైండోవర్‌ చేశారు. దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్దకు హాజరు కావాలని నోటీసులిచ్చారు.

ష్‌.. గ ప్‌చుప్‌
నగరి తహసీల్దారు కార్యాలయం వద్ద రామకుప్పం టీడీపీ నేతలు

సీఎం వస్తున్నారని టీడీపీ నేతల బైండోవర్‌ 

కుప్పంలో నాయకుల ఇళ్ల వద్ద పోలీసు కాపలా 

‘చేయూత’ లబ్ధిదారులంతా రావాలంటూ ఆదేశాలు 

జన సమీకరణకు టార్గెట్లు 

స్కూలు బస్సుల నిర్బంధ సమీకరణ.. కాదంటే సీజ్‌

చిత్తూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సీఎం వస్తున్నారని ప్రతిపక్ష నేతలను బైండోవర్‌ చేశారు. దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్దకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. కుప్పంలో టీడీపీ నేతల ఇళ్ల వద్ద కానిస్టేబుళ్లను కాపలా కూడా ఉంచారు. ఎప్పుడూ లేని విధంగా.. ప్రతిపక్షాలు బయటకు రాకూడదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలా కుప్పంలో శుక్రవారం నాటి సీఎం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ‘చేయూత’ లబ్ధిదారులకు మూడో విడత నగదు జమచేసేందుకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కనున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్య నియోజకవర్గమైన కుప్పంలో జరిగే సీఎం సభ నేపథ్యంలో టీడీపీ నేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడ నిరసన తెలుపుతారోనని కొందరిని ఇళ్లవద్దే హౌస్‌ అరెస్టులు చేశారు. మరికొందరిని బైండోవర్‌ చేసి నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం వంటి దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్ద హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో కుప్పంలో బంద్‌ వాతావరణం నెలకొంది. మరోవైపు ఎటు చూసినా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు, చెట్లకూ పార్టీ రంగులేశారు. 

‘నిర్బంధ’ సమీకరణ 

జిల్లా నలుమూలల నుంచీ జనాల్ని తరలించడానికి సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు టార్గెట్లను విధించారు. సభ జరిగే సమయంలో జనంలో నుంచి ఎవరు అభివృద్ధి జరగకపోవడంపై ప్రశ్నించినా సంబంధిత నేతలపై చర్యలు ఉంటాయని జిల్లా నేతల హెచ్చరికలున్నాయి. చిత్తూరు నగరంలో 680 మంది వార్డు వలంటీర్లు పనిచేస్తుండగా, పసి బిడ్డలున్న మహిళా వలంటీర్లు మినహా మిగిలిన వారంతా హాజరు కావాలంటూ ఓ ఉన్నతాధికారి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. వీరి కోసం శుక్రవారం ఉదయం 6 గంటలకే బస్సులు బయలుదేరనున్నాయి. తమ పరిధిలోని వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులను కూడా వలంటీర్లే పిలుచుకుని రావాలని మరో ఆదేశాలున్నాయి. దీని పర్యవేక్షణను వెలుగు కార్యాలయాల రీసోర్స్‌ పర్సన్లకు అప్పగించారు. మూడో విడత లబ్ధిదారులు జిల్లాలో సుమారు లక్ష మంది, కుప్పం నియోజకవర్గంలో 15,307 మంది ఉన్నారు. ఈ సభకు రాకుంటే మరో విడత లబ్ధి అందకుండా చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. జనాన్ని తరలించేందుకు స్కూల్‌ బస్సులనూ గురువారమే నిర్బంధంగా సమీకరించారు. దీంతో పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు బస్సులనూ బలవంతంగా తీసుకున్నారు. ఇక, జిల్లాలోని 5 ఆర్టీసీ డిపోల నుంచి 140 బస్సులను అధికారికంగా సిద్ధం చేశారు. ఆయా మండలాల్లో సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు వారి ప్రాంతాల నుంచి జనాల్ని తరలించే బాధ్యతను అప్పగించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచీ జన సమీకరణ చేపట్టారు. 

నేటి సీఎం కార్యక్రమం ఇలా...

ఉదయం 10.05 గంటలు: రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 

10.15 : విమానాశ్రయం నుంచి కుప్పానికి హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. 

11.15: నేతాజీరోడ్డు మీదుగా సభావేదిక చేరుకుంటారు. 

12.45 గంటల వరకు: ‘చేయూత’ మూడో విడత నిధులు విడుదల చేస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాఫ్టర్‌లో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు బయలుదేరతారు. 

Updated Date - 2022-09-23T06:24:04+05:30 IST