పీఎం భద్రతా లోపంపై ఖలిస్థానీ నేత హర్షం

ABN , First Publish Date - 2022-01-06T20:07:34+05:30 IST

సిక్కులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పంజాబ్ నుంచి

పీఎం భద్రతా లోపంపై ఖలిస్థానీ నేత హర్షం

న్యూఢిల్లీ : సిక్కులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పంజాబ్ నుంచి తరిమికొట్టారని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ  Sikhs for Justice (SFJ) వ్యవస్థాపకుడు గుర్‌పత్వంత్ సింగ్ పన్ను హర్షం వ్యక్తం చేశారు. ఖలిస్థాన్ స్వాతంత్ర్యానికి ఇది నాంది అని తెలిపారు. రానున్న శాసన సభ ఎన్నికలు ఖలిస్థాన్ రిఫరెండంపై తీర్పునిస్తాయన్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వద్ద రైతులు రోడ్లను దిగ్బంధించడంతో మోదీ పర్యటన రద్దయిన సంగతి తెలిసిందే. 


గుర్‌పత్వంత్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో రెచ్చగొట్టే వీడియోలను తరచూ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. భారత దేశాన్ని వ్యతిరేకించాలని సిక్కులను రెచ్చగొడుతూ ఈ వీడియోలు ఉంటాయి. ఈసారి ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో పంజాబ్ ప్రజలు స్వాతంత్ర్యాన్ని సాధించే దిశగా కదులుతున్నారన్నారు. మోదీని అడ్డుకున్న రైతులను ప్రశంసించారు. రానున్న శాసన సభ ఎన్నికలు ఖలిస్థాన్ రిఫరెండంపై తీర్పునిస్తాయని చెప్పారు. ఖలిస్థాన్ రిఫరెండానికి ప్రచారం జనవరి 5 నుంచి ప్రారంభమైందని, దీనిని మోదీ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. త్రివర్ణ పతాకాన్ని ధరించినవారు ఢిల్లీకి వెనుదిరగవలసి వచ్చిందన్నారు. రైతులు మోదీని చెప్పుల్లేకుండా పంజాబ్ నుంచి తరిమికొట్టారన్నారు. స్వాతంత్ర్యం పొందాలని పంజాబ్ నేడు నిర్ణయించుకుందని తెలిపారు. 


మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పంజాబ్‌కు ఆయుధాలతో వచ్చారని, ఆమెకు సమాధానం ఆయుధాలతో లభించిందని చెప్పారు. ‘‘మీరు (మోదీ) పంజాబ్‌లో అలజడి సృష్టిస్తున్నారు. అయితే మేం శాంతియుతంగా ఓట్ల ద్వారా సమాధానం చెబుతాం, ఓట్లతో ఖలిస్థాన్ రిఫరెండాన్ని నిర్వహించడం ద్వారా సమాధానం చెబుతాం. శాసన సభ ఎన్నికలతోపాటు ఖలిస్థాన్ రివరెండాన్ని నిర్వహించాలని పంజాబ్ నిర్ణయించుకుంది. కాంగ్రెస్-ఛన్నీ, నవజోత్ సింగ్ సిద్ధూ, బీజేపీ, ఏఏపీ, ఇలా ఏ పార్టీ అయినా  దీనికి వ్యతిరేకంగా ఉంటే, సిక్కుల ఆగ్రహాన్ని ఎదుర్కొనక తప్పద’’ని హెచ్చరించారు. 


రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ వెళ్ళారు. అదేవిధంగా ఆయన బీజేపీ-పీఎల్‌సీ-ఎస్ఏడీ(డీ) నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనవలసి ఉంది. అయితే ఫిరోజ్‌పూర్ వద్ద రైతులు రోడ్లను దిగ్బంధించడంతో ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. 


Updated Date - 2022-01-06T20:07:34+05:30 IST