అమెరికా యూనివర్శిటీలో సిక్కు విద్యార్థికి షాకింగ్ అనుభవం..!

ABN , First Publish Date - 2022-09-26T03:37:33+05:30 IST

అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూనివర్శిటీలో కత్తి(కిర్పన్) తీసుకొచ్చిన సిక్కు విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికా యూనివర్శిటీలో సిక్కు విద్యార్థికి షాకింగ్ అనుభవం..!

ఎన్నారై డెస్క్: అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూనివర్శిటీలో కత్తి(కిర్పన్) తీసుకొచ్చిన సిక్కు విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కెరొలీనాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. సిక్కుమతస్తులు కచ్చితంగా తమ వద్ద కిర్పన్ ఉంచుకోవాలన్న విషయం తెలిసిందే. ఇది వారి మత సంప్రదాయం. కాగా.. అతడి వద్ద కిర్పన్ ఉన్న విషయాన్ని గమనించిన కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యూనివర్శిటీకి చేరుకున్నారు. అతడి వద్ద నుంచి కిర్పన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు ఆ విద్యార్థి అంగీకరించకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఘటన తాలూకు వీడియోను బాధిత విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘మొదట ఈ వీడియోను పోస్ట్ చేయద్దనుకున్నా. యూనివర్శిటీ వారు నాకు మద్దతుగా నిలవరన్న విషయం అర్థమైపోయింది’’ అంటూ అతడు ట్వీట్ చేశాడు. 


ఈ వీడియో తెగ వైరల్ అవడంతో.. ప్రపంచవ్యాప్తంగా సిక్కు మతస్థులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థితో పోలీసులు వ్యవహరించిన తీరును ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వివిధ రకాల మతాలు, ఆచారాలపై అవగాహన ఉండాలని చెబుతున్నారు. చాలా మంది అమెరికన్లు తమ వద్ద చిన్న చిన్న తుపాకీలు పెట్టుకుంటారు. వారినెవరూ అరెస్టు చేయరు. ఈ విద్యార్థిపై ఉన్న కంప్లెయింట్ కూడా రద్దైపోవాలని కోరుకుంటున్నా అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు. కాగా.. అమెరికాలోని భారత చట్టసభ సభ్యులు కూడా ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థికి యూనివర్శిటీ అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 



Updated Date - 2022-09-26T03:37:33+05:30 IST