ఇంగ్లండ్‌లో సిక్కు వ్యక్తిపై దాడి.. తాలిబన్ ఉగ్రవాదంటూ..

ABN , First Publish Date - 2020-09-22T19:50:12+05:30 IST

ఇంగ్లండ్‌లోని బెర్క్‌షైర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఇంగ్లండ్‌లో సిక్కు వ్యక్తిపై దాడి.. తాలిబన్ ఉగ్రవాదంటూ..

లండన్: ఇంగ్లండ్‌లోని బెర్క్‌షైర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన సిక్కు టాక్సీ డ్రైవర్‌పై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాగిన మైకంలో ఉన్న వారందరూ సిక్కు వ్యక్తి తలపాగాను చూసి తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తివా? అంటూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పంజాబ్‌కు చెందిన వనీత్ సింగ్(41) బెర్క్‌షైర్‌లోని రీడింగ్ టౌన్‌లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తూ.. టిలేహర్స్ట్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల బెర్క్‌షైర్‌లోని ఓ కాసినో వద్ద వనీత్ సింగ్ టాక్సీ ఎక్కిన నలుగురు బ్రిటన్ పౌరులు అమానుషంగా అతడిపై దాడికి పాల్పడ్డారు. అతని తలపాగాను చూసి తాలిబన్ మిలిటెంట్‌కు చెందిన వాడివంటూ వనీత్‌పై చేయి చేసుకున్నారు. తలపాగా తీసేయాలంటూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.


అంతటితో ఆగకుండా వారు సేవిస్తున్న మద్యాన్ని సింగ్‌ను కూడా తీసుకోవాలని ఫోర్స్ చేశారు. తాను తీసుకోనని చెప్పడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అలాగే అతని టాక్సీని కూడా ధ్వంసం చేశారు. అనంతరం బ్రాంలీలో ఆ నలుగురు టాక్సీ దిగి వెళ్లిపోయారు. దాంతో తనపై జరిగిన దాడి గురించి వనీత్ సింగ్... థేమ్స్ వ్యాలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది వందశాతం జాత్యహంకార దాడి అని అతను పోలీసులకు తెలిపాడు. వెంటనే ఆ నలుగురు దుండగులను అరెస్ట్ చేయాలని కోరాడు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న థేమ్స్ వ్యాలీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.             


Updated Date - 2020-09-22T19:50:12+05:30 IST