జో బైడెన్‌కు అదర్ పూనావాలా ట్వీట్

ABN , First Publish Date - 2021-04-16T21:59:48+05:30 IST

కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ల తయారీకి చాలా ముఖ్యమైన

జో బైడెన్‌కు అదర్ పూనావాలా ట్వీట్

ముంబై : కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ల తయారీకి చాలా ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధాన్ని అమెరికా ఉపసంహరించాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఈ ముడి పదార్థాలు అందుబాటులోకి వస్తే వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచవచ్చునని చెప్పారు. 


ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉండటంతో వ్యాక్సిన్లు భారీగా అవసరమవుతున్నాయి. కానీ ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తికి చాలా ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతులపై  అమెరికా, జర్మనీ నిషేధం విధించాయి. దీంతో మన దేశానికి ఈ పదార్థాలు అందుబాటులో లేవు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో ఉపయోగించడంతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో అదర్ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఓ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా అమెరికా నుంచి ఇతర దేశాలకు రా మెటీరియల్ ఎగుమతిపై నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. ఈ వైరస్‌ను ఓడించడానికి నిజంగా ఏకం కావాలంటే ఈ పదార్థాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. తాను అమెరికా వెలుపలగల వ్యాక్సిన్ ఇండస్ట్రీ తరపున ఈ విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను @POTUSకు ట్యాగ్ చేశారు.


Updated Date - 2021-04-16T21:59:48+05:30 IST