ఎమ్మెల్యేలతో సిద్ధూ బల ప్రదర్శన... స్వర్ణ దేవాలయానికి బస్సు యాత్ర...

ABN , First Publish Date - 2021-07-21T19:52:58+05:30 IST

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్

ఎమ్మెల్యేలతో సిద్ధూ బల ప్రదర్శన... స్వర్ణ దేవాలయానికి బస్సు యాత్ర...

అమృత్‌సర్‌ : పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను లగ్జరీ బస్సుల్లో తీసుకెళ్ళారు. అంతకుముందు వీరంతా అమృత్‌సర్‌లోని సిద్ధూ నివాసంలో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ పదవిని సిద్ధూ ఆదివారం చేపట్టిన సంగతి తెలిసిందే. 


సిద్ధూ మంగళవారం అమృత్‌సర్‌లోని తన నివాసానికి వచ్చారు. ఒకటో నెంబరు జాతీయ రహదారి నుంచి అమృత్‌సర్ ప్రధాన ప్రవేశ ద్వారం గోల్డెన్ గేట్ వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పూలమాలలు, బ్యానర్లు, జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై సిద్ధూకు స్వాగతం పలికారు. 


సిద్ధూ  అమృత్‌సర్ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


ఇదిలావుండగా, విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రవీన్ ఠుక్రాల్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కలిసేందుకు సిద్ధూ సమయాన్ని కోరినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు అని తెలిపారు. తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. కెప్టెన్ సింగ్‌ను వ్యక్తిగతంగా అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు సిద్ధూను ముఖ్యమంత్రి కలవబోరని తెలిపారు. 


Updated Date - 2021-07-21T19:52:58+05:30 IST