Punjab: సీఎం భగవంత్‌మాన్‌ను కలిసిన సిద్ధూ.. ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2022-05-10T02:28:14+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌‌మాన్‌( Bhagwant Mann)పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu)

Punjab: సీఎం భగవంత్‌మాన్‌ను కలిసిన సిద్ధూ.. ప్రశంసల జల్లు

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌‌మాన్‌( Bhagwant Mann)పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ప్రశంసలు కురిపించారు. నేడు ముఖ్యమంత్రిని కలిసిన సిద్ధూ అనంతరం ట్వీట్ చేస్తూ.. తనకు ముఖ్యమంత్రిని కలిసిన భావన రాలేదని, ఆయన ఎంతో ఒదిగి ఉంటారని కొనియాడారు.


50 నిమిషాలపాటు తమ భేటీ జరిగిందని, చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని అన్నారు. పంజాబ్ అనుకూల అజెండా గురించి ఆయనతో చర్చించానని, ఆదాయాన్ని ఆర్జించే మార్గాల గురించి మాట్లాడానని తెలిపారు. పంజాబ్ ఎందుర్కొన్న సమస్యలకు ముగింపు పలికేందుకు సీఎం భగవంత్ మాన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారని సిద్ధూ పేర్కొన్నారు. 


శాంతి భద్రతలు, ఆర్థిక అత్యవసర పరిస్థితి, మాదక ద్రవ్యాలు, డ్రగ్ స్మగ్లర్లు- పోలీసులకు మధ్య అనుబంధం వంటి వాటిపై ఇరువురం చర్చించినట్టు సిద్ధూ తెలిపారు. సమావేశం సానుకూలంగా జరిగినట్టు వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నందుకు మాన్‌ను సిద్ధూ ప్రశంసించారు.


అలాగే, సీఎంకు పలు సలహాలు కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్ల ద్వారా మద్యాన్ని విక్రయించకపోవడం, పెట్రోలు, డీజిల్, ఇసుక, లిక్కర్‌ను నియంత్రించడం, ఎక్సైజ్ ఆదాయ దోపిడీని ఆపడం, ప్రజలు చౌకగా విద్యుత్‌ను పొందేందుకు వీలుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం, కేబుల్‌పై గుత్తాధిపత్యాన్ని నివారించడం వంటి సలహాలు సిద్ధూ ఇచ్చారు. కేబుల్‌పై గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయాలన్న సిద్ధు ప్రతిపాదన వెనక బాదల్ వారి కేబుల్ వ్యాపారంపై పరోక్ష దాడిగా కనిపిస్తోంది. 

Read more