కేజ్రీ నివాసం బయట సిద్ధూ నిరసన

ABN , First Publish Date - 2021-12-05T22:30:59+05:30 IST

తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ ప్రభుత్వ గెస్ట్ టీచర్లు ముఖ్యమంత్రి..

కేజ్రీ నివాసం బయట సిద్ధూ నిరసన

న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ ప్రభుత్వ గెస్ట్ టీచర్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల ఆదివారంనాడు నిరసనకు దిగారు. ఈ నిరనసల్లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గొన్నారు. ''ఢిల్లీ టీచర్లు ఇక్కడున్నారు, కేజ్రీవాల్ ఎక్కడున్నారు?'' అంటూ సిద్ధూ నినాదాలు చేశారు.


దీనికి ముందు సిద్ధూ పలు ట్వీట్వలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమైపోయాయని నిలదీశారు. ''2015 మేనిఫెస్టోలో మీరు 8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 20 కొత్త కాలేజీలు తెస్తామని హామీ ఇచ్చారు. ఆ ఉద్యోగాలు, కాలేజీలు ఎక్కడ? ఢిల్లీలో మీరు కల్పించన ఉద్యోగాలు కేవలం 440. మీ హామీలన్నీ నీటిమూటలయ్యాయి. గత ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగితా రేటు 5 రెట్లు పెరిగింది'' అని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్‌లోని మొహలిలో గత నెలలలో కాంట్రాక్ట్ టీచర్లు చేపట్టిన నిరసనల్లో కేజ్రీవాల్ పాల్గొనడానికి ఈ సందర్భంగా సిద్ధూ ప్రస్తావిస్తూ, పంజాబ్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడానికి ముందు మీరు మీ రాష్ట్రంలో (ఢిల్లీ) అంశాలు పరిష్కరించుకోండి'' అని ఘాటుగా ట్వీట్ చేశారు.

Updated Date - 2021-12-05T22:30:59+05:30 IST