ఇద్దరు సలహాదారులకు నోటీసులు ఇచ్చిన సిద్దూ

ABN , First Publish Date - 2021-08-23T21:24:27+05:30 IST

విమర్శలు తీవ్రం కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు సిద్దూ. ఇద్దరు సలహాదారుల్ని తన ఇంటికి పిలిపించుకుని నోటీసులు ఇచ్చారు. అయితే సిద్దూతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వీరిద్దరూ..

ఇద్దరు సలహాదారులకు నోటీసులు ఇచ్చిన సిద్దూ

చండీగఢ్: కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అభ్యంతకర కార్టూన్ షేర్ చేసిన తన ఇద్దరు సలహాదారులకు పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్దూ నోటీసులు జారీ చేశారు. పాటియాలాలోని తన నివాసానికి ఇద్దరినీ సోమవారం పిలిపించుకున్న ఆయన.. వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, సిద్దూతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఇద్దరు సలహాదారులు.. నోటీసుల ప్రస్తావన తీయకుండా ఇతర అంశాలను మాత్రమే ప్రస్తావించారు.


మాల్విందర్ సింగ్ మాలి, డాక్టర్ పైరీ లాల్ జార్జ్ అనే వ్యక్తులు నవజ్యోత్ సింగ్ సిద్దూకి సలహాదారులుగా ఉన్నారు. వీరు తాజాగా కశ్మీర్ ప్రత్యేక దేశం అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తుపాకీ పట్టుకున్న ఉన్న ఒక స్కెచ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, వీటిపై ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా తెలుసుకోకుండా అవాగాహనారాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు.


విమర్శలు తీవ్రం కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు సిద్దూ. ఇద్దరు సలహాదారుల్ని తన ఇంటికి పిలిపించుకుని నోటీసులు ఇచ్చారు. అయితే సిద్దూతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వీరిద్దరూ నోటీసుల గురించి ప్రస్తావించలేదు. పంజాబ్ అభివృద్ధిపై సిద్దూతో చర్చించినట్లు చెప్పుకురావడం గమనార్హం.

Updated Date - 2021-08-23T21:24:27+05:30 IST