లక్నో: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలంటూ చేపట్టిన నిరాహార దీక్షను పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారంనాడు విరమించారు. ఆశిష్ మిశ్రా లఖింపూర్ ఖేరి క్రైం బ్రాంచ్ కార్యాలయంలో పోలీసు విచారణకు హాజరైన కొద్ది సేపటికే ఆయన తన దీక్షను విరమించారు. ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసేంత వరకూ నిరాహార దీక్ష కొనసాగిస్తానంటూ గత శుక్రవారంనాడు లఖింపూర్ ఖేరిలో సిద్ధూ దీక్షకు దిగారు. కాగా, దీక్ష విరమణ అనంతరం సిద్ధూ ఓ ట్వీట్ చేస్తూ, దర్యాప్తునకు సహకరించేందుకు ఆశిష్ మిశ్రా సరెండర్ కావడంతో రమణ్ కశ్యప్ కుటుంబంతో కలిసి దీక్షను విరమించినట్టు పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడే శక్తిని ఆ భగవంతుడు తనకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని, సత్యానికే ఎప్పుడూ విజయం లభిస్తుందని అన్నారు. హింసాత్మక ఘటనల్లో మరణించిన కుటుంబాలను గత శుక్రవారం పరామర్శించిన సిద్ధూ, ఇదే ఘటనలో మృతి చెందిన 26 ఏళ్ల పాత్రికేయుడు రమణ్ కశ్యప్ కుటుంబాన్ని కలిసి నిరాహార దీక్షకు దిగారు.