శిథిల భవనాలపై శీతకన్ను

ABN , First Publish Date - 2022-05-16T05:28:08+05:30 IST

చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రం ప్రభుత్వ భవనాలు శిథిలమై దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

శిథిల భవనాలపై శీతకన్ను
ఎస్‌ఎంఐ భవనం

- దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాలు నిరుపయోగం

- చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు ఆక్రమణలపాలు

- భూముల పరిరక్షణకు చర్యలు శూన్యం

- చోద్యం చూస్తున్న అధికారులు


చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ప్రభుత్వ శిథిల భవనాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ భవనాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారుల్లో చలనమే లేదు. కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడడంతో చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రానికి ప్రాధాన్యం పెరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాలు చింతపల్లికి అధికంగా రానున్నాయి. ప్రభుత్వ శిథిల భవనాలను తొలగించి నూతన కార్యాలయాలు నిర్మించాల్సి వుంది. అయితే ఈ భూములు, భవనాలను పరిరక్షించడంలో సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


చింతపల్లి, మే 15: చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రం ప్రభుత్వ భవనాలు శిథిలమై దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడానికి చర్యలు చేపట్టడం లేదు. అవి ఆక్రమణకు గురవుతున్నా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్‌కలెక్టర్‌  ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

శిథిల భవనాల పరిస్థితి ఇదీ.. 

ఎస్‌ఎంఐ కార్యాలయం: 18 ఏళ్ల కిందట చిన్ననీటిపారుదల శాఖ(ఎస్‌ఎంఐ) పరిధిలోనున్న ఈ భవనాన్ని కొంత కాలం గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ కార్యాలయంగా ఉపయోగించారు. 12 ఏళ్లగా ఈ భవనాన్ని ఉపయోగించకపోవడం వల్ల శిథిలావస్థ చేరింది. కార్యాలయం చుట్టూ 20 సెంట్ల స్థలం వుంది. ఆక్రమణదారులు పెంకులు, రాళ్లు, ఇనుప ఊచలను ఒక్కొక్కటిగా తరలించుకుపోతున్నారు. ఈ స్థలాన్ని కొంత మంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఉపయోగించుకుంటున్నారు. 

ఈపీడీసీఎల్‌ బిల్‌ సేకరణ భవనం: ఈపీడీసీఎల్‌కి చెందిన కరెంట్‌ బిల్‌ సేకరణ భవనం పదేళ్లుగా నిరుపయోగంగా  వుంది. దీనిని పట్టించుకోకపోవడం వల్ల శిథిలావస్థకు చేరింది.  

పట్టుపరిశ్రమ భవనాలు: నాలుగు పట్టుపరిశ్రమ భవనాలు పదేళ్ల కిందట శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ భవనాలను ఆనుకుని కొంత మంది దుకాణాలు ఏర్పాటు చేశారు. దాదాపు అరెకరం భూమి ఆక్రమణకు గురైంది. 

వీటీసీ భవనం: వీటీసీ భవనం పదేళ్లుగా నిరుపయోగంగా వుంది. ఈ భవనం చుట్టూ దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలం ఉంది. ఈ భూమి మొత్తాన్ని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా గత ఏడాది రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తాజాగా ఈ స్థలం వారపు సంతకు కేటాయించారు. అయితే ఆక్రమదారులు అరెకరం స్థలం స్వాధీనం చేసుకున్నారు. 

డైరీఫారం భవనాలు: 15 ఏళ్ల కిందట డైరీఫారం ఎత్తివేయడంతో దాదాపు 20 భవనాలు వినియోగానికి నోచుకోలేదు. ప్రస్తుతం భవనాలన్నీ శిథిలమైపోయాయి. డైరీఫారంకి 400 ఎకరాలకి పైబడి భూమి వున్నప్పటికీ 20 ఎకరాల్లో భవనాలు నిర్మించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల దాదాపు ఆరు ఎకరాలకుపైగా డైరీఫారం భూములు ఆక్రమణకు గురయ్యాయి. 


Updated Date - 2022-05-16T05:28:08+05:30 IST