సైడ్‌ బిజినెస్‌!

ABN , First Publish Date - 2020-06-02T08:19:21+05:30 IST

రాష్ట్రంలో మందుబాబులకు ‘షాక్‌’ కొట్టేలా మద్యం ధరలు పెంచడంతో.... చీప్‌ లిక్కర్‌ తాగేవారు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారు.

సైడ్‌ బిజినెస్‌!

మద్యం రవాణాలో పలువురు ఉద్యోగులు

ఏపీలో దొరకని ప్రముఖ బ్రాండ్ల మద్యం

తెలంగాణలో తక్కువ ధరకే లభ్యం

ఒక్క ‘ఫుల్‌’కు రూ.వెయ్యి దాకా లాభం

ఎస్‌ఈబీకి దొరుకుతున్న అక్రమార్కులు

పోలీసు కానిస్టేబుళ్లే ఎక్కువ మంది

ఎస్‌ఈబీకి దొరికిపోయిన ఎంపీడీవో

ఒంగోలులో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ ‘రవాణా’

అక్రమ మద్యం ముఠాలో ఐటీ అధికారి

కృష్ణాలో ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌


స్వయానా ఒక మంత్రి గన్‌మ్యాన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌, ఐటీ అధికారి, ఎంపీడీవో, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లు, ఇంకా అనేక మంది! ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? వీరంతా... ఇటీవలి కాలంలో మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికి పోయిన ప్రభుత్వ ఉద్యోగులు! ఇంకా చోటామోటా నేతలు ఎందరెందరో ఉన్నారు!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో మందుబాబులకు ‘షాక్‌’ కొట్టేలా మద్యం ధరలు పెంచడంతో.... చీప్‌ లిక్కర్‌ తాగేవారు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక... ‘డబ్బులు పోయినా సరే’ తమకు అలవాటైన మద్యం తాగాలనుకునే వారికి ఈ రాష్ట్రంలో తలుపులు మూసుకుపోయాయి. ఎందుకంటే... పేరున్న బ్రాండ్‌లేవీ ఇక్కడ కనిపించడంలేదు. కొత్త బ్రాండ్‌ల ధరలే ‘షాక్‌’ కొట్టేస్తున్నాయి. దీంతో... పొరుగు మద్యానికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. తెలంగాణ నుంచి ఒక్క ఫుల్‌ బాటిల్‌ను తెచ్చుకుని ఏపీలో విక్రయించుకోగలిగితే కనీసం రూ.వెయ్యి మిగిలినట్లే. బ్రాండ్‌ను బట్టి రెండు వేలూ మిగుల్చుకోవచ్చు.దీంతో... అట్నుంచి ఇటు మద్యం రవాణా చేయడాన్ని చాలామంది సైడ్‌ బిజినె్‌సగా మార్చుకున్నారు.


వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులూ ఉండటం విశేషం. మరీముఖ్యంగా... శరీరంపై ఖాకీ డ్రెస్‌ ఉందనే ‘కాన్ఫిడెన్స్‌’తో పలువురు కానిస్టేబుళ్లు మద్యం దారి పట్టారు. వివిధ స్థాయుల్లోని ఉద్యోగులూ అక్రమంగా మద్యం రవాణా చేస్తూ దొరికిపోవడం ఎక్సైజ్‌ అధికారులను విస్మయపరుస్తోంది. ‘‘ఉద్యోగులు 24 గంటలకు మించి రిమాండ్‌లో ఉంటేనే సస్పెన్షన్‌ వేటు పడుతుంది. కరోనా నేపథ్యంలో కోర్టులు ఎవరినీ రిమాండ్‌కు పంపడంలేదు. వెంటనే బెయిలు వచ్చేస్తుంది. అందుకే పలువురు ఉద్యోగులు భయం లేకుండా మద్యం రవాణా చేస్తున్నారు’’ అని ఒక అధికారి తెలిపారు. 


గతవారం రోజులుగా తెలంగాణకు సరిహద్దు జిల్లాలైన కృష్ణా, గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లోనూ మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉద్యోగులు పట్టుబడ్డారు. అధికారిక వాహనాల్లోనే ఎంచక్కా మద్యాన్ని తీసుకొస్తున్నారు. మద్యం అక్రమ రవాణా నియంత్రణకు కొత్తగా రంగంలోకి దిగిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)కు దొరికిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలూ మద్యం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన పల్నాడులో అనేక మంది గ్రామ, మండల స్థాయి నాయకులు అక్రమ మద్యం కేసుల్లో ఇప్పటికే పట్టుబడ్డారు. కొందరు బడా నేతలు భారీగా మద్యం తీసుకువచ్చి గుట్టుగా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 


ఇవిగో తార్కాణాలు

తెలంగాణ నుంచి దొడ్డిదారిన మద్యాన్ని తరలించేందుకు సహకరిస్తున్నారంటూ కృష్ణా జిల్లాలో ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లపై వేటు వేశారు.


కృష్ణా జిల్లా వీరులపాడు ఎంపీడీవో మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరులపాడులో వీఆర్వో ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ‘వీడ్కోలు’ విందు ఏర్పాటు చేశారు. దీనికోసం కారులో 27 బీరు బాటిళ్లు తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. వీరిలో ఎంపీడీవో కూడా ఉన్నారు.


తెలంగాణ నుంచి మంగళగిరికి వస్తున్న ఇద్దరు ఎన్డీఆర్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ తెలంగాణ నుంచి మద్యం తెస్తున్నారు.


గుంటూరు జిల్లాలో శనివారం తనిఖీల్లో  ఓ కానిస్టేబుల్‌ పట్టుబడ్డారు. ఈ గ్యాంగ్‌లో హోంగార్డు, ఐటీ అధికారి ఉన్నట్లు తేలింది. గుంటూరు నగరానికి చెందిన కఠారు శ్రీనివాసరావు కర్నూలు ఏపీఎ్‌సపీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై విజయవాడ ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉన్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఐటీ శాఖ అధికారితో కలసి తెలంగాణ నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.


ఈ నెల 24న విశాఖపట్నం జిల్లా అనంతగిరి చెక్‌పోస్టులో పనిచేస్తున్న సివిల్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు మద్యం బాటిళ్లు తరలిస్తూ విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం బొడ్డవర చెక్‌ పోస్టు వద్ద దొరికిపోయారు. 


ఈనెల 27న విజయనగరం చింతలవలసలోని ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ 90 మద్యం బాటిళ్లతో బొడ్డవర చెక్‌ పోస్టు వద్దే దొరికిపోయారు. 


ప్రకాశం జిల్లా గిద్దలూరులో అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న వైసీపీ ఎంపీపీ అభ్యర్థిపై అధికారులు కేసు నమోదు చేశారు.


ఒంగోలు సమీపంలో ఎస్‌ఈబీ దాడుల్లో ఒంగోలు నగర పాలక సంస్థలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి మద్యం బాటిళ్లతో దొరికారు.

Updated Date - 2020-06-02T08:19:21+05:30 IST