Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 26 Jun 2022 00:19:32 IST

నామ్‌కేవాస్తే!

twitter-iconwatsapp-iconfb-icon
నామ్‌కేవాస్తే!విపంచి కళానిలయంలో నిర్వహించిన జడ్పీ సమావేశంలో సభ్యులు లేక ఖాళీగా కనిపిస్తున్న దృశ్యం

తూతూ మంత్రంగా ముగిసిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

జడ్పీ సమావేశంలో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు

ఎజెండాలోని 44 అంశాల్లో చర్చించినవి తొమ్మిదే

రెండు అంశాలపైనే సుదీర్ఘంగా కొనసాగిన చర్చ


మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈసారీ నామమాత్రంగానే ముగిసింది. మంత్రి హరీశ్‌రావు గైర్హాజరు కావడంతో అధికార పార్టీకి చెందిన సగం మంది జడ్పీ సభ్యులు సమావేశం వైపు తొంగి చూడలేదు. మెజార్టీ సభ్యులు రాకపోవడంతో జడ్పీ సమావేశం నిర్వహించిన సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయం ఖాళీగా కనిపించింది. ఎజెండాలో 44 అంశాలు ఉండగా  అంతకుముందు సమావేశాల మాదిరే పదింటిపై కూడా చర్చ జరగలేదు. ముందుగా వ్యవసాయశాఖతో ప్రారంభమై తొమ్మిది అంశాలపైన చర్చించారు. ఎప్పటిలాగే విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి సమస్యలపై తమ గళమెత్తారు.


సిద్దిపేట అర్బన్‌, జూన్‌ 25 : పట్టణంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఉదయం 10.30కి  ప్రారంభించాల్సి ఉండగా 45 నిమిషాల ఆలస్యంగా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అధ్యక్షతన ప్రారంభమైంది. సమావేశం ప్రారంభంలో 11 మంది జడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు మాత్రమే కనిపించడం గమనార్హం. ఈ సమావేశానికి నూతన కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎజెండాలో 44 అంశాలను ప్రతిపాదించగా అందులో కేవలం 9 శాఖలపైన చర్చించి సమావేశాన్ని ముగించారు. వ్యవసాయ శాఖతో ప్రారంభమై విద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, సోషల్‌ వెల్ఫేర్‌, ఇరిగేషన్‌ శాఖపైన చర్చ కొనసాగింది. ఆయా శాఖల పైన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ అధికారులు సభకు సమాధానం వివరించారు. విద్య శాఖ చర్చ జరుగుతున్నప్పుడు ముంపు గ్రామాల టీచర్లు ఎక్కడా అని డీఈవోను సభ్యులు నిలదీశారు. కనీసం ఆ టీచర్‌ ఎక్కడ ఏ స్కూల్‌లో పనిచేస్తున్నారో వివరాలు కూడా ఇవ్వడం లేదని సభ్యులు ప్రశ్నించారు. ఈ వివరాలను సభ్యులకు అందజేయాలని డీఈవోకు జిల్లా కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున విద్యా వలంటీర్లు నియమించాలని, లేదంటే విద్యార్థులు నష్టపోతారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.


వివిధ సమస్యలను లేవనెత్తిన సభ్యులు

మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి మాట్లాడుతూ ఏఈవోలు రైతులకు పంటల సాగులో అవగాహన కల్పించడం లేదని, గ్రామాల్లోకి ఏఈవోలు ఎప్పుడు వస్తారో కూడా తెలియడం లేదని మండిపడ్డారు. జిల్లాలో నూతనంగా అధిక సాంద్రత పత్తిని సాగు చేయడం మంచిదే కానీ పంట దిగుబడి రాకపోతే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. వానాకాలం పంటల సాగు ప్రారంభమైనా నేటికీ రైతుబంధు అందించడం లేదని అన్నారు. చెక్‌డ్యాంల మరమ్మతులు చేపట్టాలని కోరారు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తక్కువ పరిమాణంలో ఉన్న గుడ్లను, నాణ్యతలేని కూరగాయలతో వండిన భోజనాన్ని విద్యార్థులకు పెడుతున్నారని గిరికొండల్‌రెడ్డి ప్రశ్నించారు. కోతులు, అడవి పందుల బెడద నుంచి రక్షణకు సోలార్‌ ఫెన్సింగ్‌ను సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. ఇప్పటివరకు 13 జడ్పీ సమావేశాలు జరిగితే తమకు కేవలం ఒక సమావేశానికి మాత్రమే ప్రోగ్రెసివ్‌ రూపంలో వివరాలను అధికారులు అందించారని, మిగతావి ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందజేయ లేదని, విద్యార్థుల సమయానుసారం ఆర్టీసీ బస్సులను నడపాలని ఆయన కోరారు.  వర్గల్‌ జడ్పీటీసీ బాలమల్లు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో అప్పులు తడిసిమోపెడు అవుతున్నాయని, రైతులకు వేసిన రైతుబంధు నగదు అప్పు కింద బ్యాంకర్ల తీసుకుంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కల్యాణ లక్ష్మి కోసం గెజిటెడ్‌ సంతకానికి అధికారులు డబ్బు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని తెలిపారు. మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు మాట్లాడుతూ కనీసం ఫోన్‌ చేసినా స్పందించని పరిస్థితుల్లో ఉద్యానశాఖలోని కిందిస్థాయి అధికారులు ఉన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. సంక్షేమ హాస్టల్‌లో నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టడం లేదని పేర్కొన్నారు. జడ్పీటీసీ మల్లేశ్‌ మాట్లాడుతూ ముంపు గ్రామాల టీచర్‌ ఎక్కడున్నారని వారిని ఉపాధ్యాయ కొరత ఉన్న పాఠశాలల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, లేని చోట విద్యా వలంటరీ నియమించాలని కోరారు.  


పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం  

- జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 18 వరకు నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి  కార్యక్రమాల ద్వారా జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులను జిల్లా సొంతం చేసుకుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అని ఆమె అన్నారు. గ్రామాలు, పట్టణ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని.. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ భాగస్వాములై జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు. త్వరలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిల్లో అన్ని వసతులను సమకూర్చడంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయని, జిల్లా ఆరోగ్య సిద్దిపేటగా మారిందని తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి తర్వాత ఉచితంగా కీళ్ల మార్పిడి చికిత్సలు సిద్దిపేట, గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని ఆమె తెలియజేశారు. ప్రసవాలలో 72 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. సభ్యులు అడిగిన సమస్యల పరిష్కారం చూపించడంలో మరో సమావేశం వరకు ప్రోగ్రెసివ్‌ కనిపించాలని, మళ్లీ ఇవే సమస్యలు పునరావృతం కావద్దని ఆమె అధికారులు సూచించారు. 


పునరావాస కాలనీలో పాఠశాలలను ప్రారంభించాలి 

- కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలను జూలై 1 నుంచి ప్రారంభించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో ముంపు గ్రామాల టీచర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, మిగిలిన ఉపాధ్యాయుల సేవలను  జిల్లాలో అవసరమైన వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపయోగించాలి కలెక్టర్‌ సూచించారు. జడ్పీటీసీలకు, ఎంపీపీలకు సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాల నివేదికను వారం రోజులు ముందుగానే ఇవ్వాలని జడ్పీ సీఈవోకు తెలిపారు. మండల, గ్రామస్థాయిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం స్థానిక ప్రజలకు అందించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


ఐదేళ్లయినా రోడ్డు పూర్తి చేయలేదు

- దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లా మంత్రి ఐదు సంవత్సరాల క్రితం కొబ్బరికాయ కొట్టి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఇంతవరకు పూర్తి చేయలేదని రోడ్డు భవనాల శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు దుబ్బాకపైన చిన్న చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. దుబ్బాకలో రూ.10 కోట్లతో నిర్మించిన పాఠశాలను నేటికీ ప్రారంభించక పోవడంతో ఆ పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా మారిందని పేర్కొన్నారు. జూలై 30 లోపు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించి ప్రారంభించేందుకు జడ్పీ చైర్‌పర్సన్‌ చొరవ తీసుకోవాలని, లేదా జిల్లా మంత్రివర్యులు అయినా ప్రారంభించాలని కోరారు. లేదంటే తానే ఆ పాఠశాల హెడ్మాస్టర్‌తో ప్రారంభిస్తానన్నారు. బీజేపీ సర్పంచులకు ఈజీఎస్‌ నిధులు మంజూరు చేయడం లేదని తెలిపారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల సేవలను పునరావాస కాలనీలు ఏర్పాటు చేసిన బడుల్లోనూ ఉపయోగించి అదనంగా ఉన్న ఉపాధ్యాయులను దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలకు పంపించాలన్నారు. దుబ్బాకలోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, ఐటీఐ కాలేజ్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. 


రోడ్డుకిరువైపులా మొక్కలు నాటాలి

- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి   

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  మాట్లాడుతూ హైదరాబాద్‌ - కరీంనగర్‌ రహదారి లాగా దుద్దెడ - జనగామ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటి సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి గ్రామంలో రోడ్డుకిరువైపులా దాదాపుగా ఆరు ఫీట్ల దూరంలోనే మొక్కలను నాటాలని ఆయన సూచించారు.

నామ్‌కేవాస్తే!సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ, వేదికపై ఎమ్మెల్యే రఘనందన్‌రావు, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్‌, యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితరులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.