మోగిన నగారా

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. నేడు అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈనెల 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, మే నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. గురువారం ఉదయమే 43 వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులంతా నామినేషన్ల సమర్పణపై దృష్టి పెట్టారు.

మోగిన నగారా
సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను డ్రా తీస్తున్న అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, కమిషనర్‌ రమణాచారి

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

నేటి నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ 

ఈ నెల 30న ఎన్నికలు.. మే3 న కౌంటింగ్‌

43 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు 

గజ్వేల్‌లోనూ ఓ వార్డుకు ఉప ఎన్నిక 

అమలులోకి ఎలక్షన్‌ కోడ్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 15 : సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. నేడు అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈనెల 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, మే నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. గురువారం ఉదయమే 43 వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులంతా నామినేషన్ల సమర్పణపై దృష్టి పెట్టారు.


బీఫాంల కోసం పోటాపోటీ

రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు బీఫాంల కోసం పోటీపడుతున్నారు. స్వతంత్రులుగా బరిలోకి దిగడం కంటే ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. ఒక్కో వార్డు నుంచి ఐదారుగురు పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని మంత్రి హరీశ్‌రావు, ఇతర ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ సైతం అన్ని వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవేళ ఏ పార్టీ టిక్కెట్‌ ఖరారు కాకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నామినేషన్ల స్వీకరణకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో ఆశావహుల ఆరాటం ఎక్కువైంది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద అన్ని రకాల పన్నులు చెల్లించడంతోపాటు నామినేషన్‌ పత్రాలను తీసుకోవడంపై దృష్టి పెట్టారు. 


సిద్దిపేట, గజ్వేల్‌లో ఎన్నికల కోడ్‌

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు గజ్వేల్‌లోనూ 12వ వార్డుకు ఉప ఎన్నిక జరగనున్నది. ఈ వార్డు నుంచి గెలిచిన కొద్దిరోజులకే వంటేరు నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం రెండు పట్టణాల్లోనూ వచ్చే నెల 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో ప్రారంభాలు, శంకుస్థాపన చేయడాకి నిషేధం. రాజకీయ కార్యకలాపాలకూ ఎన్నికల అధికారులు అనుమతి తీసుకోవాలి. 


ఆరు రోజులే ప్రచారం

తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు. 18 వరకు నామినేషన్లు సమర్పిస్తే 22వ తేదీన ఉపసంహరణలు పూర్తయి తుది అభ్యర్థుల జాబితా ఖరారవుతుంది. ఇక 23 నుంచి 28 వరకే అధికారికంగా ప్రచారం చేసుకోవచ్చు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. నడుమ ఒకరోజు మినహాయిస్తే 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. దీంతో పార్టీ టిక్కెట్లపై భరోసా ఉన్న అభ్యర్థులు తమకు అనుకూల రిజర్వేషన్లు రావడంతోనే ప్రచారంలోకి దిగారు. 


ఎన్నికల షెడ్యూల్‌

16-04-2021     నోటిఫికేషన్‌ జారీ

16-04-2021 నుంచి 

18-04-2021 వరకు     నామినేషన్ల స్వీకరణ

19-04-2021     నామినేషన్ల పరిశీలన

20-04-2021     నామినేషన్ల తిరస్కరణ

21-04-2021     అభ్యంతరాల స్వీకరణ

22-04-2021     నామినేషన్ల ఉపసంహరణ

30-04-2021     ఎన్నికల నిర్వహణ

03-05-2021     ఎన్నికల ఫలితాల ప్రకటన


వార్డుల రిజర్వేషన్లు ఇవే

జనరల్‌ వార్డులు : 1, 5, 6, 22, 23, 25, 27, 38, 39, 41

జనరల్‌ మహిళా : 3, 4, 7, 8, 14, 15, 17, 21, 34, 35, 36, 42

బీసీ : 9, 13, 16, 20, 24, 28, 29, 31, 40

బీసీ మహిళా : 10, 11, 12, 18, 30, 32, 33, 43

ఎస్సీ జనరల్‌ వార్డులు : 2, 19

ఎస్సీ మహిళా : 37

ఎస్టీ వార్డు: 26

చైర్‌పర్సన్‌ : జనరల్‌ మహిళ


నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 15 : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానున్నదని, సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి తెలిపారు. గురువారం సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సిద్దిపేట ఏసీపీ పరమేశ్వర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో నామినేషన్‌ వేసేందుకు మున్సిపల్‌ కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు ఒక్కరినే అనుమతిస్తామని తెలియజేశారు. కార్యాలయం నుంచి 200 మీటర్ల వరకు ఎవరిని లోనికి అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థుల ర్యాలీలను 200 మీటర్ల బయటే నిలిపివేస్తామన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్‌ కోసం 14 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియమించామని తెలియజేశారు. ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


మున్సిపల్‌ కమిషనర్‌గా ముజామిల్‌ ఖాన్‌కు బాధ్యతలు

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌కు సిద్దిపేట మున్సిపల్‌ కమీషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిద్దిపేటలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి ఇదే వరకే ఉన్న సుడా వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతారు.


గజ్వేల్‌లో 12వ వార్డుకు నామినేషన్ల స్వీకరణ

గజ్వేల్‌, ఏప్రిల్‌ 15: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించి నేటి నుంచి నామినేషన్‌లను స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి వెంకటగోపాల్‌ తెలిపారు. గురువారం గజ్వేల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10:30 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. కొవిడ్‌ దృష్ట్యా నామినేషన్‌ దాఖలు చేయు వ్యక్తితో పాటు బలపరిచే వ్యక్తి, మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.



Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST