ఇంటర్‌లో జిల్లా ర్యాంకు 6

ABN , First Publish Date - 2022-06-29T05:46:04+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండియర్‌లో 6వ స్థానం, ఫస్టియర్‌లో 8వ స్థానం దక్కించుకున్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలను మరిపించేలా గురుకులాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచారు. సిద్దిపేట జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 33 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, 34 ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.

ఇంటర్‌లో జిల్లా ర్యాంకు 6
విజయ సంకేతం చూపుతున్న సిద్దిపేట బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థినులు

సెకండియర్‌ ఫలితాల్లో విద్యార్థుల హవా

స్టేట్‌ టాపర్లుగా గురుకుల విద్యార్థినులు

జిల్లావ్యాప్తంగా 68 శాతం ఉత్తీర్ణత

ఫస్టియర్‌లో 63 శాతం పాస్‌.. రాష్ట్రంలో 8వ స్థానం

సత్తా చాటిన బాలికలు

సెకండియర్‌లో  74, ఫస్టియర్‌లో 71 శాతం పాస్‌

బాలురు ఫస్టియర్‌లో 53 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 60 శాతమే ఉత్తీర్ణత


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 28: ఇంటర్‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండియర్‌లో 6వ స్థానం, ఫస్టియర్‌లో 8వ స్థానం దక్కించుకున్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలను మరిపించేలా గురుకులాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచారు. సిద్దిపేట జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 33 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, 34 ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 8,517 మంది, సెకండియర్‌ పరీక్షలకు 8,297 మంది హాజరయ్యారు. జిల్లాలో 8,297 మంది విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా.. 5,682 మంది పాసయ్యారు. 68 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6వ స్థానం దక్కింది. 3,689 మంది బాలురకు 2,245 మంది, 4,608 బాలికలకు 3,437 మంది ఉత్తీర్ణత సాధించారు. 74 శాతం బాలికలు, 60 శాతం బాలురు పాసయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో 3,395 మందికి 1,612 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 


ఫస్టియర్‌లో 63 శాతం 

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో జిల్లాకు 8వ స్థానం దక్కింది. నూటికి 63 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 4,634 మంది బాలికలకు 3,302 మంది పాస్‌ అయ్యారు. 3,883 మంది బాలురకు 2,065 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికల్లో 71 శాతం ఉత్తీర్ణులుకాగా, బాలురు మాత్రం 53 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇక ఫస్టియర్‌ ఒకేషనల్‌ విభాగంలో 3,431 మందికి కేవలం 1,417 మంది మాత్రమే పాసయ్యారు. రాష్ట్రంలో 21వ స్థానం దక్కింది. 


సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. నంగునూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. 74 మందికి 74 మంది పాసయ్యారు. ములుగులో 89 శాతం, మిరుదొడ్డిలో 81 శాతం, దౌల్తాబాద్‌లో 85 శాతం, హుస్నాబాద్‌లో 95 శాతం, చిన్నకోడూరులో 97 శాతం, కోహెడలో 91 శాతం, తొగుటలో 98 శాతం విద్యార్థులు పాస్‌ కావడం విశేషం. ఇక 4 కస్తూర్బా పాఠశాలలకు సంబంధించి 212 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరు కాగా 169 మంది పాసయ్యారు.


గురుకులాలకు ర్యాంకుల పంట

సిద్దిపేట జిల్లాలోని గురుకులాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారు. స్టేట్‌ టాపర్లుగా నిలిచారు. ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాలలోని సాయిశ్రీకి ఎంపీసీ ఫస్టియర్‌లో 467 మార్కులు, స్ఫూర్తికి 466 మార్కులు వచ్చాయి.  బైపీసీలో సాయిస్రవంతి 434, అనూష 434 మార్కులు సాధించారు. ఫస్టియర్‌ బైపీసీ విభాగంలో సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి ఎస్సీ గురుకుల విద్యార్థిని శృతి 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించింది. సౌజన్య 434 మార్కులు, రాజేశ్వరి 433, కరుణదీప్తి 433, సుస్మిత 432 మార్కులు సాధించారు. ఇదే గురుకులానికి చెందిన గంగోత్రికి ఎంపీసీలో 470 మార్కుల గాను 466 మార్కులు వచ్చాయి. సిద్దిపేట పట్టణ శివారులోని బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ఎంపీసీ విభాగంలో బింగి మేఘన 466 మార్కులు సాధించింది. జిల్లాలోని ఐదు బీసీ గురుకులాల్లో 99.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆరు ఎస్సీ గురుకులాల్లో 63 శాతం  ఉత్తీర్ణత నమోదైంది. 

Updated Date - 2022-06-29T05:46:04+05:30 IST