అన్నిరంగాల్లో సిద్దిపేట అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-27T05:08:42+05:30 IST

సిద్దిపేట ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్నిరంగాల్లో సిద్దిపేట అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

 సంపూర్ణ ఆరోగ్యానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ

 సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్‌కు వైద్యం

 మరో 650 పడకల ఆసుపత్రి ఏర్పాటు 

 మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట  క్రైం, జూన్‌ 26: సిద్దిపేట ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పట్టణంలోని 36వ వార్డులో రూ.25 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. సిద్దిపేటలో ప్రజల సంపూర్ణ  ఆరోగ్యానికే రూ.300 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టామన్నారు. సాగు, తాగు నీటిని అందించామన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో, ఆరోగ్య రక్షణలో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి చెప్పారు. సిద్దిపేట ఆసుపత్రిలో త్వరలోనే గుండె శస్త్రచికిత్సలు, కాన్సర్‌ రోగులకు వైద్య సేవలను అందిస్తామని వెల్లడించారు. మరో 650 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మోకాళ్ల చిప్ప మార్పిడి ఆపరేషన్‌లు, కంటి అపరేషన్‌లు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 


ప్రతీ ఇంటికి తాగునీరందిస్తున్న రాష్ట్రం తెలంగాణ


ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ ఫేక్‌ సోషల్‌ మీడియాను నిలదీయాలని సూచించారు. సిద్దిపేటలో టీఆర్‌ఎ్‌సవీ నాయకులతో సమావేశమయ్యారు. నూతన విద్యార్థులకు స్వాగతం పలికే పోస్టర్‌ను మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. పార్టీలో పని చేసిన ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని, ఉద్యమ సమయంలో యువకులు, విద్యార్థుల పాత్ర గొప్పది అని గుర్తు చేశారు. అదే పంథాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీపై ఉన్నదన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైద్య విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తుందన్నారు. జాతీయ పార్టీలు పరిపాలించిన సమైక్య రాష్ట్రంలో 70 ఏళ్లలో 4 మెడికల్‌ కాలేజీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 7 ఏళ్లలో 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


 


Updated Date - 2022-06-27T05:08:42+05:30 IST