సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌లో ట్రైఏజ్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-10T16:16:21+05:30 IST

విజయవాడలోని ట్రైఏజ్‌ కేంద్రాన్ని..

సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌లో ట్రైఏజ్‌ సెంటర్‌

రెండురోజుల్లో అందుబాటులోకి..

కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడి


విజయవాడ: విజయవాడలోని ట్రైఏజ్‌ కేంద్రాన్ని విస్తరించి సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో ట్రైఏజ్‌ కేంద్రం ఏర్పాటు పనులను అధికారులతో కలిసి కలెక్టర్‌ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ డెంటల్‌ కాలేజీ ప్రాంగణంలో ట్రైఏజ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈకేంద్రం ద్వారా కరోనా బాధితులకు సంరక్షణ కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ డాక్టర్లు తగిన సూచనలు ఇస్తారన్నారు. కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడేవారు ఈ కేంద్రం ద్వారా తగిన మార్గదర్శకాలను పొందాలన్నారు. ట్రైఏజ్‌ కేంద్రంలోని వైద్యులు రోగి ఆరోగ్య స్థితిని అంచనా వేసి తగిన సూచనలు చేస్తారన్నారు. వారికి వైద్యం ఆసుపత్రిలో.. తేదా హోం ఐసోలేషన్‌లో.. లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోనా అనేది నిర్ణయిస్తారన్నారు.


ఈ కేంద్రంలో 30 బెడ్లను ఏర్పాటుచేసి తక్షణ వైద్య సహాయం అందించడంతోపాటు మెరుగైన వైద్య చికిత్సకు సిఫార్సు చేస్తున్నామన్నారు. మానసిన స్థైర్యంతో కరోనా నుంచి బయటపడవచ్చన్నారు. జిల్లాలోని  గూడవల్లి, జేఎన్‌ఎంయూఆర్‌ఎం, ఏడీఎంటిల్‌ కేంద్రాల్లో 3036 కొవిడ్‌ బెడ్లను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలు కలిగి  హోం ఐసోలేషన్‌లో అవకాశం లేనివారికి ఈ కేంద్రాల్లో బెడ్లు కేటాయిస్తామన్నారు. ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా సమీపంలోని వెన్యూ కన్వెక్షన్‌ సెంటర్‌లో 100ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


3.66 లక్షల మందికి  తొలిడోసు,లక్షా 11 వేల మందికి 2వ డోసు వ్యాక్సిన్‌

ఇప్పటివరకు 3.66 లక్షలమందికి తొలిడోసు, లక్షా11వేల మందికి రెండోడోసు వ్యాక్సిన్‌ వేశామన్నారు. హోంఐసోలేషన్‌లో ఉండేవారికి 25వేల మెడికల్‌కిట్‌లు అందుబాటులో ఉంచగా వీటిలో  18,500 పంపిణీ చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. జేసీ ఎల్‌.శివశంకర్‌, సబ్‌కలెక్టర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర, జీజీహెచ్‌ పర్యవేక్షకుడు డాక్టర్‌ శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T16:16:21+05:30 IST