వారిద్దరి భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

ABN , First Publish Date - 2022-06-04T17:34:17+05:30 IST

వారివురూ రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతలు. రోజూ అన్ని కార్యక్రమాల్లోనూ కలిసే పాల్గొంటారు. కానీ అంతర్గతంగా ఎవరికివారే అనేలా అనుచరులతో

వారిద్దరి భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

బెంగళూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): వారివురూ రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతలు. రోజూ అన్ని కార్యక్రమాల్లోనూ కలిసే పాల్గొంటారు. కానీ అంతర్గతంగా ఎవరికివారే అనేలా అనుచరులతో గ్రూపులు సాగిస్తారు. అవకాశం వస్తే ఎదుటివారిని తక్కువ చేసేందుకు వెనుకాడరు. ఇదేమీ నిన్నమొన్నటిది కాదు. ఏడాదిన్నర క్రితం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందు నుంచి సాగుతున్న తంతు. వారే ప్రతిపక్షనేత సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో కాంగ్రెస్‌ అన్నింటా ముందంజలో ఉందనడంలో తేడా లేదు. అందుకు డీకే శివకుమార్‌ వ్యవహరిస్తున్న తీరు, పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు కారణాలు. మరో పది నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇరువురి ఆప్తులు మా నేత సీఎం అంటూ నినాదాలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే అనూ హ్యంగా వారిరువురూ రహస్య భేటీ అయ్యారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ చింతన్‌ తరహాలో రాష్ట్ర ముఖ్యనాయకులతో దేవనహళ్ళిలోని ఓ రిసార్టులో రెండు రోజుల నవసంకల్ప్‌ సదస్సు కొనసాగుతోంది. తొలిరోజైన గురువారం సదస్సు ముగిసేవేళ సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. ఇరువురూ ఒకే కారులో వెళ్లినా చర్చలు డ్రైవర్‌ ద్వారా బహిరంగం కావచ్చుననే పకడ్బందీగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఎన్ని కలకు ముందు వీరిరువురి భేటీపై కాంగ్రెస్‌ వర్గాలే కాకుండా బీజేపీ, జేడీఎస్‌లు కుతూహలం అనిపించేలా వ్యాఖ్యానిచాయి. వీరి భేటీ వెనుక మరిన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌సింగ్‌ సుర్జే వాలా అధిష్ఠానం ఆదేశాలను వివరించిన మేరకు వీరు కలసినట్టు తెలుస్తోంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వరాదని ఇరువురూ ఒకే నిర్ణయంపై ఉన్నారు. అయితే జేడీఎస్‌ జాతీయనేత దేవేగౌడ వీరిని కాదని కాంగ్రెస్‌ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ద్వారా ఢిల్లీ పెద్దల చెంతకు పంపడం గమనార్హం. ఇదే పరిస్థితి ఎన్నికల తర్వాత కొనసాగితే... అసలుకే మోసం కావచ్చుననే కలసినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-04T17:34:17+05:30 IST