బీజేపీతో పొత్తు ఉండదని దేవెగౌడపై ప్రమాణం చేస్తారా..?

ABN , First Publish Date - 2022-04-21T17:44:01+05:30 IST

రెండేళ్లుగా రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య, జేడీఎస్‌ నేత కుమారస్వామి మధ్య మాటల తూటాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం సిద్దరామయ్య సరికొత్త సవాల్‌కు

బీజేపీతో పొత్తు ఉండదని దేవెగౌడపై ప్రమాణం చేస్తారా..?

                  - కుమారస్వామికి సిద్దరామయ్య సవాల్‌


బెంగళూరు: రెండేళ్లుగా రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య, జేడీఎస్‌ నేత కుమారస్వామి మధ్య మాటల తూటాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం సిద్దరామయ్య సరికొత్త సవాల్‌కు తెరలేపారు. జేడీఎస్‌ పార్టీ బీజేపీకి బీ - టీంగా పనిచేస్తోందంటూ ట్వీట్‌ చేశారు. మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడపై ప్రమాణం చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. మాటలు దాటేసే మీ చరిత్ర అందరికీ తెలిసిందేనని, ప్రజలు మిమ్ములను నమ్మరంటూ పేర్కొన్నారు. దేశంలో సెక్యులరిజం, మతతత్వం మధ్య నిర్ణయాత్మకమైన పోరాటం సాగుతోందన్నారు. తాము సెక్యులరిజం వైపు ఉన్నామని ప్రజలకు చెపాల్సి ఉందని నిత్యం తనను విమర్శించడం కాదు మీరు ఎటువైపో స్పష్టం చేయాలన్నారు. బీజేపీతో ఎప్పటికీ మైత్రి ఉండదని బహిరంగ ప్రకటన చేస్తే మీరు బీ టీం అనే అవకాశం కూడా ఉండదన్నారు. మీ అసలు స్వరూపం గురించి ప్రజలకు వివరించాలన్నారు. అన్నింటినీ వీడి తనపై వ్యక్తిగత విమర్శలు, అసత్యాలు చెప్పడమే మీ లక్ష్యమైతే ప్రజలే నిర్ణయిస్తారంటూ సిద్దరామయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఉపదేశాలు కాదు.. నా ప్రశ్నలకు జవాబు చెప్పు: కుమారస్వామి 

‘అసత్యాల రామయ్యా.. తొలుత నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. నీ ఉపదేశాలు నాకెందుకు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హాసన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ను దేశమంతటా తిరస్కరించారని, కర్ణాటకలో మాత్రమే కొంత ఊపిరాడుతోందన్నారు. వీరి పార్టీనే డీజేహళ్లి తరహాలో హుబ్బళ్లిలో నిప్పుపెట్టారని, వీరా సెక్యులరిజం గురించి మాట్లాడేదంటూ నిలదీశారు. కల్లప్ప హండీబాగ్‌ గురించి ఎందుకు మాట్లాడరన్నారు. ఆర్కావతి నోటిఫికేషన్‌లో వందలకోట్ల లూటీపై సమాధానం చెప్పాలన్నారు. 2009లో ఆపరేషన్‌ కమల తర్వాత ఖర్గేను రాజకీయంగా ముగించే ప్రయత్నంపై సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు మావే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కదా నమ్మకం లేదా అన్నారు. వీరి యోగ్యతకు 50-60 సీట్లు గొప్ప అంటూ ఎద్దేవా చేశారు. దేవెగౌడపై ప్రమాణం చేసేందుకు ఈ దాసయ్య ఎవరంటూ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-21T17:44:01+05:30 IST