సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు ఊరట

ABN , First Publish Date - 2022-01-20T06:22:12+05:30 IST

గిరిజన ప్రాంత ప్రజల్లో ఎక్కువమందిని వేధించే సమస్య సికిల్‌సెల్‌ ఎనీమియా. దీనికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నా.. వీరిలోని రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ఐదేళ్లపాటు పరిశోధన చేశారు కేజీహెచ్‌ ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అశోక్‌కుమార్‌. పలు కీలక అంశాలను గుర్తించి సరికొత్త ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ను సూచించారు. ఇటీవల గోవా వేదికగా జరిగిన జాతీయ ఆర్థోపెడీషియన్స్‌ సదస్సులో ఈయన పరిశోధన చేసిన ‘బెస్ట్‌ సైంటిఫిక్‌ పేపర్‌ రీసెర్చ్‌ ఆఫ్‌ సికిల్‌సెల్‌ ఎనీమియా’ అంశానికి ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ కేటీ డొలాకియా గోల్డ్‌ మెడల్‌ లభించింది. ఈ సందర్భంగా పరిశోధనకు సంబంధించిన అంశాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు ఊరట
గోల్డ్‌మెడల్‌ అందుకుంటున్న డాక్టర్‌ అశోక్‌కుమార్‌

తుంటి మార్పిడి శస్త్ర చికిత్సకు సరికొత్త విధానం

డాక్టర్‌ అశోక్‌కుమార్‌ పరిశోధన ఫలితం 

12 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స

ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ కేటీ డొలాకియా గోల్డ్‌మెడల్‌ ప్రదానం

(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం) 

 గిరిజన ప్రాంత ప్రజల్లో ఎక్కువమందిని వేధించే సమస్య సికిల్‌సెల్‌ ఎనీమియా. దీనికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నా..  వీరిలోని రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ఐదేళ్లపాటు పరిశోధన చేశారు కేజీహెచ్‌ ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అశోక్‌కుమార్‌. పలు కీలక అంశాలను గుర్తించి సరికొత్త ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ను సూచించారు. ఇటీవల గోవా వేదికగా జరిగిన జాతీయ ఆర్థోపెడీషియన్స్‌ సదస్సులో ఈయన పరిశోధన చేసిన ‘బెస్ట్‌ సైంటిఫిక్‌ పేపర్‌ రీసెర్చ్‌ ఆఫ్‌ సికిల్‌సెల్‌ ఎనీమియా’ అంశానికి ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ కేటీ డొలాకియా గోల్డ్‌ మెడల్‌  లభించింది. ఈ సందర్భంగా పరిశోధనకు సంబంధించిన అంశాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.  


పెరుగుతున్న సమస్య..

 తుంటి (హిప్‌) అనేది పొత్తికడుపు (పెల్విస్‌) దగ్గర ఉండే తొడ ఎముక పైభాగం నుంచి ఏర్పడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువమందికి హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ (తుంటిమార్పిడి) చేయాలి.  అయితే శస్త్ర చికిత్స చేయడం..  ప్రాణాలకే ప్రమాదం. అనస్తీషియా ఇవ్వగానే చాలామంది మృతిచెందేవారు. దీనికి సరైన కారణాలు తెలియకపోవడంతో వైద్యులు పూర్తిగా శస్త్ర చికిత్సలను నిలిపేశారు. 


ఐదేళ్లపాటు పరిశోధన..

సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితుల్లో హిప్‌ రీ ప్లేస్‌మెంట్‌ సర్జరీపై డాక్టర్‌ అశోక్‌కుమార్‌ పరిశోధన ప్రారంభించారు.  ఐదేళ్ల పరిశోధనలో భాగంగా 12 మంది సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులను రెండేసి నెలలు చొప్పున అబ్జర్వేషన్‌లో ఉంచి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. 


పరిష్కార మార్గమిది..

సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితుల్లో రెండు హిప్‌ జాయింట్లు పూర్తిగా పాడవుతున్నాయి. బాధితుల్లో 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. శస్త్రచికిత్సకు ముందు, చేస్తున్న సమయం, తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చని గుర్తించారు. శస్త్ర చికిత్స జరుగుతున్నంతసేపు ఫ్లూయిడ్స్‌ అందివ్వడం, ప్రత్యేకమైన హైడ్రాక్సీ యూరియా  టాబ్లెట్‌ని  ముందుగా ఇవ్వడం, నిరంతర హై ఫ్లో ఆక్సిజన్‌ సరఫరాతో ఆపరేషన్‌ చేసి విజయం సాధించారు.  


వాస్కులర్‌ క్రైసిస్‌తో సమస్య.. 

సాధారణ రోగులతో పోలిస్తే సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితుల్లో తుంటి లోపల ఉండే ఎముక గట్టిపడి ఉంటుంది. దీన్ని వాస్కులర్‌ క్రైసిస్‌గా పేర్కొంటారు. దీని లోపలి నుంచి తుంటి పరికరాన్ని ఏర్పాటు చేయడం క్లిష్టం. పవర్‌ రీమర్స్‌ అనే మెషిన్‌తో కాలువ మాదిరిగా చేసి.. అందులో ఈ పరికరాన్ని అమర్చాలి. అయితే సాధారణ రోగుల్లో ఒక ఎర్రరక్త కణం 10 మిల్లీ గ్రాముల ఆక్సిజన్‌ను తీసుకుంటే..  ఈ బాధితుల్లో  ఒక మిల్లీ గ్రాము తీసుకెళుతుంది. ఈ సమస్యకు చెక్‌ చెప్పడానికే హై ఫ్లోతో ఆక్సిజన్‌ సరఫరా చేయాలంటారాయన. 


రెండు వేల మందిలో...

డాక్టర్‌ కేటీ డొలాకియా గోల్డ్‌మెడల్‌ను ఏటా వైద్య రంగంలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అందిస్తుంటారు. భవిష్యత్తుకు ఈ పరిశోధన ఉపయోగపడితేనే గుర్తిస్తారు. అశోక్‌కుమార్‌ రూపొందించిన విధానం బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ పేపర్‌ కావడంతో గోవాలో జరిగిన సదస్సులో అత్యుత్తమంగా నిలిచిన పరిశోధనకు అవార్డును అందించింది. ఇందులో దేశవ్యాప్తంగా రెండు వేల మంది పాల్గొన్నారు. 


గిరిజన సంక్షేమశాఖ నిధులతో.. 

 పరిశోధన అనంతరం అశోక్‌కుమార్‌ 12 మందికి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. వీరు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి, సాధారణ పనులు చేసుకోగలుగుతున్నారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్సకు అవసరమైన ఇంప్లాంట్స్‌ కొనుగోలుకు ఒకొక్కరికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని గిరిజన సంక్షేమశాఖ చెల్లించింది. 


పరిష్కారం సూచించడం ఆనందం 

పరిశోధనలో భాగంగా క్లిష్టమైన శస్త్ర చికిత్సకు పరిష్కార మార్గాన్ని సూచించడం ఆనందంగా ఉంది. అవార్డుకు ఎంపిక కావడం మరింత సంతోషం. ఏజెన్సీలోని గిరిజనుల్లో 30 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య కనిపిస్తోంది. తుంటి భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చి అక్కడ ఉండే రెండు బాల్స్‌ పూర్తిగా పాడవుతున్నాయి. ఎక్స్‌రేతో సమస్యను గుర్తించవచ్చు. కొంత మందికి ఎంఆర్‌ఐ చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్స చేయడానికి సాధారణ రోగులకు 90 నిమిషాలు పడితే.. వీరికి మూడు గంటలు పడుతుంది. అనస్తీషియా, ఆక్సిజన్‌, ప్లూయిడ్స్‌ నిర్వహణ జాగ్రత్తగా చూసుకోవాలి. 

- డాక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్థో విభాగాధిపతి, అవార్డు గ్రహీత


 

Updated Date - 2022-01-20T06:22:12+05:30 IST