Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 26 May 2022 02:48:56 IST

కాంగ్రెస్‌కు సిబ్బల్‌ షాక్‌!

twitter-iconwatsapp-iconfb-icon

ఆ పార్టీకి రాజీనామా

సమాజ్‌వాదీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్‌

చింతన్‌ శిబిర్‌ తర్వాత గుడ్‌బై చెప్పిన మూడో సీనియర్‌

ఐదు నెలల్లో ఐదుగురు అవుట్‌

ఫలితమివ్వని మేధోమథనం!


లఖ్‌నవూ/న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): చింతన్‌ శిబిర్‌లో మూడ్రోజుల పాటు మేధోమథనం జరిపి.. సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టినా కాంగ్రెస్‌ నుంచి నేతల వలసలు ఆగడం లేదు. ఆ పార్టీకి బుధవారం గట్టి షాక్‌ తగిలింది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబ్బల్‌(73) కాంగ్రె్‌సకు రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ కూడా వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్‌ శిబిర్‌ తర్వాత పార్టీ నుంచి నిష్క్రమించిన మూడో సీనియర్‌ నేత సిబల్‌. అలాగే గత 5 నెలల్లో కాంగ్రెస్‌కు రాజీనా మా చేసిన ఐదో సీనియర్‌ నాయకుడు. కాంగ్రెస్‌ అసమ్మతి నేతల గ్రూపు(జి-23)లో ప్రముఖుడు కూడా. 2014 నుంచి వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రె్‌సను పూర్తిగా ప్రక్షాళించాలని, పార్టీకి తిరిగి జవసత్వాలు రావాలంటే గాంధీ-నెహ్రూ కుటుంబం నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ తీరును తీవ్రంగా విమర్శించారు. దీనిపై పార్టీ నేతలు మండిపడ్డారు. దీంతో చింతన్‌ శిబిర్‌కు ఆయనను ఆహ్వానించలేదు.

పైగా రెండు దఫాలకు మించి ఎవరికీ రాజ్యసభ టికెట్‌ ఇవ్వకూడదని కాంగ్రెస్‌ నిర్ణయించడం.. సిబ్బల్‌ రాజ్యసభ పదవీకాలం బుధవారం ముగియడంతో ఆయన వేరేదారి చూసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16నే అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపానని సిబ్బల్‌ చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై అభిమానంతో కాంగ్రెస్‌లో చేరానని, 31 ఏళ్లు పార్టీలో కొనసాగానని తెలిపారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ఎస్పీ నేతలు అఖిలేశ్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌ కూడా హాజరయ్యారు. సిబ్బల్‌ రాజీనామాను కాంగ్రెస్‌ తేలిగ్గా తీసుకుంది. చాలా మంది పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. 

సిబల్‌ 1998లో ఆర్జేడీ మద్దతుతో బిహార్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004, 09 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని చాం దినీచౌక్‌ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున గెలిచా రు. 2016లో పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపింది.


మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సీనియర్‌ న్యాయవాదిగా కాంగ్రెస్‌ తరఫున.. ముఖ్యంగా గాంధీ కుటుంబ సభ్యుల కేసుల్లో వివిధ న్యాయస్థానాల్లో వాదనలు వినిపించారు. 1989లో కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌గానూ పనిచేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితుడు కూడా. మూడుసార్లు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేసన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అఖిలేశ్‌ యాదవ్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో చీలిక వ్యవహారం కోర్టుకు వెళ్లినప్పుడు అఖిలేశ్‌కు సిబ్బల్‌ అండగా నిలిచారు. ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన కేసునూ ఆయనే వాదించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.