ఎస్‌ఐ ప్రేమకు యువతి బలి

ABN , First Publish Date - 2022-05-07T06:34:29+05:30 IST

ప్రేమ పేరిట పోలీసాయన మోసగించడంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల పరిధిలోని జీఏ కొట్టాలలో శుక్రవారం జరిగింది.

ఎస్‌ఐ ప్రేమకు యువతి బలి

ఆత్మహత్య చేసుకున్న సరస్వతి

తాడిపత్రి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

చంద్రగిరి ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ నాయక్‌పై కేసు


అనంతపురం/పామిడి: ప్రేమ పేరిట పోలీసాయన మోసగించడంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల పరిధిలోని జీఏ కొట్టాలలో శుక్రవారం జరిగింది. మూడు రోజుల క్రితం విష రసాయనం తాగిన యువతి, రెండు రోజులపాటు ఆ విషయాన్ని దాచింది. చివరికి పరిస్థితి విషమించడంతో, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పి కన్నుమూసింది. తన చావుకు ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ నాయక్‌ కారణమని తల్లిదండ్రులకు చెప్పి, తుదిశ్వాస విడిచింది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.


పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు, పామిడి మండలంలోని జీఏ కొట్టాలకు చెందిన భీమ్లానాయక్‌, లాలెమ్మ దంపతుల కుమారుడు విజయ కుమార్‌ నాయక్‌ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న అదే గ్రామానికి చెందిన సరస్వతితోనూ, మరో యువతితో ఏకకాలంలో ప్రేమాయణం నడిపాడు. ఈ వ్యవహారం ఇద్దరు యువతులకు తెలియడంతో ఎస్‌ఐ వ్యవహారం బెడిసికొట్టింది. న్యాయం కోసం మరో యువతి దిశ పోలీసులను ఆశ్రయించిందని, దీంతో ఆమెను ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ పెళ్లి చేసుకున్నాడని సరస్వతి సోదరుడు తెలియజేశాడు. దీంతో తన సోదరి సరస్వతి తీవ్ర మనస్తాపానికి గురైందని అన్నాడు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి మూడు నెలల క్రితం సరస్వతి సొంతూరుకు వచ్చింది.


దేవర ఉండటంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పంపనూరు తండాకు మంగళవారం వెళ్లారు. ఇంట్లో ఉన్న సరస్వతి బుధవారం తెల్లవారు జామున విష రసాయనం తాగింది. ఆ విషయాన్ని తమ వద్ద రెండు రోజులపాటు దాచిపెట్టిందని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎంపీఆర్‌ డ్యాం, పామిడి ఆస్పత్రులలో చికిత్స చేయించామని తల్లిదండ్రులు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ, శుక్రవారం సాయంత్రం చనిపోయిందని కన్నీటిపర్యంతం అయ్యారు. ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ నాయక్‌ సరస్వతిని ప్రేమ పేరిట మోసగించాడని, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. తమ కూతురు చావుకు కారణమైన ఎస్‌ఐపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పామిడి పోలీస్‌ స్టేషనలో శుక్రవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. తాడిపత్రి డీఎస్పీ వీఎనకే చైతన్య బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ నాయక్‌ చంద్రగిరి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Read more