Abn logo
Nov 9 2020 @ 00:00AM

ఆవిడే... శ్యామల

తల్లిని బట్టే పిల్లలు అంటారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్‌ విషయంలో ఇది నూటికి నూరు పాళ్లూ నిజం. 19 ఏళ్ల వయసులో అమెరికాలో అడుగుపెట్టిన కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌, ఉనికిని నిరూపించుకునే క్రమంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఓ పక్క కేన్సర్‌ పరిశోధకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క ఒంటిచేత్తో ఇద్దరు ఆడపిల్లలనూ తీర్చిదిద్దారు. నల్లజాతి సంతానంగా పిల్లలు ఆత్మన్యూనతకు లోనయ్యే ప్రతి సందర్భాన్నీ ఆమె ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. అదే ఆత్మవిశ్వాసాన్నీ, గుండెధైర్యాన్ని కమలా హ్యారిస్‌కూ నూరిపోశారు. ఈ విషయాలను  కమలా ఓ సందర్భంలో ఇలా గుర్తుచేసుకున్నారు...


రాజకీయ క్రియాశీలత, పౌర నాయకత్వం నడయాడే కుటుంబంలో పుట్టి పెరిగింది అమ్మ శ్యామలా గోపాలన్‌. మా అమ్మమ్మ, ఆమె అమ్మ రాజం గోపాలన్‌ హైస్కూల్‌ చదువులు చదవకపోయినా, సమాజ సేవలో నైపుణ్యం వాళ్లకు స్వతహాగా అబ్బింది. గృహహింసకు గురయ్యే మహిళలకు అండగా ఉంటూ, వారి భర్తలకు బుద్ధి చెబుతూ, కుటుంబనియంత్రణ పట్ల మహిళలను చైతన్యవంతులను చేస్తూ సమాజానికి చేతనైనంత సహాయపడేవారు. మా తాతయ్య పి.వి వేణుగోపాలన్‌ భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. జాంబియాకు స్వాతంత్య్రం వచ్చిన అప్పటి రోజుల్లో శరణార్థులు స్థిరపడడంలో అమ్మమ్మ, తాతయ్య తోడ్పడ్డారు. వాళ్ల నుంచి మా అమ్మ శ్యామలకూ అదే నైజం అలవడింది. జీవితానికి అర్థం, పరమార్థం సమాజసేవలోనే ఉందనే విషయం అమ్మ నుంచి నేనూ, చెల్లి మాయా గ్రహించాం. 


19వ ఏట అమెరికాకు...

అమ్మ జీవితం వేల మైళ్ల దూరాన, తూర్పు తీరంలో మొదలైంది. సైన్స్‌ పట్ల ఆమెకున్న ఇష్టానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం దన్నుగా మారింది. దాంతో 19 ఏళ్ల వయసులో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పుచ్చుకున్న తర్వాత, అప్పటివరకూ కనీ వినీ ఎరుగని అమెరికాలోని బెర్క్‌లీ యూనివర్శిటీలో అడుగుపెట్టింది అమ్మ. అలా 1958లో న్యూట్రిషన్‌ అండ్‌ ఎండోక్రైనాలజీలో డాక్టరేట్‌ చేయడం కోసం అమెరికా వచ్చిన అమ్మ, రొమ్ము కేన్సర్‌ పరిశోధకురాలిగా స్థిరపడింది. కానీ నిజానికి డిగ్రీ పూర్తయిన వెంటనే ఇండియా తిరిగి వచ్చేయాలనేది అప్పట్లో అమ్మమ్మ అమ్మకు పెట్టిన నియమం. అమ్మ తల్లితండ్రులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమ్మ కూడా అదే సంప్రదాయాన్ని అనుసరించాలి. కానీ పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొనే సమయంలో జమైకాకు చెందిన డొనాల్డ్‌ జె. హ్యారి్‌సతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తూ నా ఏడవ ఏట అమ్మా, నాన్నా విడిపోయారు.మనసుల్లో భారతీయం!

మాలో భారతీయ మూలాలు ఇప్పటికీ నిలిచి ఉండడానికి కారణం కూడా అమ్మే! భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల మాకున్న అపార అవగాహన, అంతులేని అభిమానాలకూ కారణం కూడా అమ్మే! ఆమె మా మీద ప్రేమను పంచినా, కోపాన్ని ప్రదర్శించినా అది భారతీయ ధోరణిలోనే సాగేది. కాబట్టే ఆ భావోద్వేగాల్లోని స్వచ్ఛత అమ్మను మా మనసులకు మరింత చేరువ చేయగలిగింది. మరీ ముఖ్యంగా సింగిల్‌ మదర్‌గా ఇద్దరు నల్లజాతి సంతానాన్ని పెంచి, పెద్ద చేయడం ఎంత కష్టమో మా అమ్మకు తెలుసు. నల్లజాతి సంతానమైన మా పిల్లలిద్దరి పట్ల అమెరికా ప్రవర్తన ఎలా ఉంటుందో అమ్మకు తెలుసు కాబట్టే, ఆత్మవిశ్వాసంతో నిండిన నల్లజాతి మహిళలుగా మమ్మల్ని తీర్చిదిద్దడం ఆమె ధ్యేయంగా పెట్టుకుంది.


సాంబార్‌, ఇడ్లీ!

వీలున్న ప్రతిసారీ అమ్మ నన్నూ, చెల్లినీ ఇండియాకు తీసుకువచ్చేది. చెన్నైలోని సముద్రపు ఒడ్డున తాతయ్య చేయి పట్టుకుని నడవడం, గుడిలో ప్రార్థనలు చేయడం నాకు గుర్తు. అమ్మ మాకెంతో ఇష్టమైన ఇడ్లీ, పప్పు, బెండకాయ కూర వండి, తినిపించేది. ఓక్‌ల్యాండ్‌, కాలిఫోర్నియాలోని కైసర్‌ హాస్పిటల్‌లో నాకు జన్మనిచ్చిన ఐదడుగుల ఎత్తుండే 25 ఏళ్ల ఆ భారతీయ మహిళను నేనెప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. ఈ రోజు ఇలా మీ ముందు నిలబడతానని ఆమె ఆ రోజున ఊహించి ఉండదు. కానీ నేడు ఆమె కూతురిగా అమెరికా రాజకీయాల్లో కీలక స్థానాన్ని అధిరోహించడం ద్వారా... తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనే సిద్ధాంతాన్ని అప్పటికే ఆమె ఊహించి ఉండవచ్చేమో అనిపిస్తుంది! 

ప్రత్యేకం మరిన్ని...