బొమ్మలతో ఆడించేస్తాడు

ABN , First Publish Date - 2020-11-25T06:18:27+05:30 IST

‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో’... పాట గుర్తొస్తుంది ఇరవై ఆరేళ్ల గాజుల శ్యాం నవీన్‌ను చూస్తుంటే! డ్యాన్స్‌ చేసేవారు లెక్కకు మించే ఉన్నారు. వారి దారిలోనే నడిస్తే ప్రత్యేకతేముంటుంది? నలుగురిలో ఒకడిగా మిగిలిపోతే గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నాట్యంలోనే విభిన్నమైన దారి వెతుక్కున్నాడు...

బొమ్మలతో ఆడించేస్తాడు

‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో’... పాట గుర్తొస్తుంది ఇరవై ఆరేళ్ల గాజుల శ్యాం నవీన్‌ను చూస్తుంటే! డ్యాన్స్‌ చేసేవారు లెక్కకు మించే ఉన్నారు. వారి దారిలోనే నడిస్తే ప్రత్యేకతేముంటుంది? నలుగురిలో ఒకడిగా మిగిలిపోతే గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నాట్యంలోనే విభిన్నమైన దారి వెతుక్కున్నాడు. అరుదైన ‘డాల్‌ డ్యాన్స్‌’ను అభిరుచిగా మలుచుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఓ రోజు కూలీ కొడుకు నేడు దేశవిదేశాల్లో ప్రదర్శనలతో దుమ్ము రేపుతున్నాడు. వైవిధ్యమే తనకీ గుర్తింపు తెచ్చిందంటున్న శ్యాం నవీన్‌ జర్నీ అతడి మాటల్లోనే... 



పదేళ్ల కిందట నేనస్సలు అనుకోలేదు... ఇలాంటి డ్యాన్స్‌ ఒకటి చేస్తానని! అందులో ఇంత పేరు తెచ్చుకొంటానని! నాట్యంలో నా ప్రయాణం మొదలైంది బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా. ఈవెంట్లు జరిగినప్పుడు పిలిచేవారు. ఓ పది పదిహేను మంది బృందంలో నేనూ ఒకడిని. షోకు 150 రూపాయలు ఇచ్చేవారు. ఐదేళ్లు అలానే సాగింది. వేరే దారి లేదు. ఎందుకంటే మాది నిరుపేద కుటుంబం. మా నాన్న త్రినాథరావు రోజు కూలీ. అమ్మ సత్య గృహిణి. నాన్న సంపాదించిన దాంట్లోనే ఇల్లు గడవాలి. ఆర్థిక ఇబ్బందులతో నేను ఇంటర్‌తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. అయితే నాకు మొదటి నుంచి డ్యాన్స్‌ అంటే విపరీతమైన పిచ్చి. ఇష్టంతోనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ గారి దగ్గర చేరాను. ఆయన టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు కూడా పనిచేశారు. ప్రస్తుతం చైనాలో శిక్షణ ఇస్తున్నారు. విజయ్‌ గారిది కూడా మా ఊరే! అనకాపల్లి! ఇంటికి దగ్గర్లోనే ఉండేవారు. దాంతో రోజూ ఆయన ఇంటికి వెళ్లి డ్యాన్స్‌ సాధన చేసేవాడిని. 


కొత్తగా ప్రయత్నించాలని... 

శిక్షణ తరువాత 2010లో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాను. అయితే రోజూ అదే డ్యాన్స్‌. చేసి చేసి బోర్‌ కొట్టింది. అందరూ అదే చేస్తున్నారు. వారితో పాటు నేనూ ఒకడిని... అంతేగా! ఇది కాదు నేను కోరుకొనేది. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. పేరు చెప్పగానే నాలోని ప్రతిభ గుర్తుకురావాలి. ఈ ఆలోచనలతోనే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాను. ఆ క్రమంలోనే యూట్యూబ్‌లో ‘డాల్‌ డ్యాన్స్‌’ చూశా. చాలా వైవిధ్యంగా ఉంది. ఆ క్షణమే నేనేం కావాలనుకొంటున్నానో... నాకేం కావాలో ఒక స్పష్టతకు వచ్చేశాను. 




మలుపు తిప్పిన షో...  

అనుకున్నదే తడవుగా డాల్‌ డ్యాన్స్‌ కోసం ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించాను. భారత్‌లో ఈ డ్యాన్స్‌ చేసేవారు చాలా తక్కువమందే ఉన్నారని తెలిసింది. మరి నేర్చుకోవడం ఎలా? దానికీ యూట్యూబ్‌నే ఆశ్రయించాను. విదేశీ కళాకారుల వీడియోలు వెతికి పట్టుకున్నా. వాటిని చూస్తూ, వాళ్ల మూమెంట్స్‌, ఆహార్యాలు అనుకరిస్తూ వచ్చాను. కొంత అవగాహన వచ్చాక, నేనే సొంతంగా కొన్ని కంపోజ్‌ చేసుకున్నాను. పూర్తి రిహార్సల్స్‌ తరువాత తొలి షోకు సిద్ధమయ్యాను. అది 2015. విశాఖపట్టణం. జనంతో కళకళలాడుతున్న ఓ వేదిక. ఆ వేదికపై నా ప్రదర్శన. అప్పటి వరకు చూడని ఒక వినూత్న నాట్య రీతిని అక్కడ ఆడి చూపించాను. బొమ్మలతో డ్యాన్స్‌ భలేగుందంటూ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. నా జీవితాన్ని మలుపు తిప్పిన షో అది. 


స్ఫూర్తి ఆయనే...   

మొట్టమొదటి సోలో ప్రదర్శన విజయవంతమవ్వడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏదో కొత్త ఉత్సాహం శరీరమంతా ఆవహించిన అనుభూతి. అది మొదలు ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దేశంలోని అన్ని నగరాలూ తిరిగాను. ఇప్పటి వరకు 1,500కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాల్లో కూడా చాలా షోలు చేశాను. నావన్నీ సోలో ప్రదర్శనలే. డాల్‌ డ్యాన్స్‌ కళాకారులు భారత్‌లో చాలామందే ఉన్నారు. కానీ కొందరే దాన్ని తరువాతి స్థాయికి తీసుకువెళ్లగలిగారు. అలాంటివారిలో చెన్నైకి చెందిన రోబో గణేశ్‌ ఒకరు. తమిళ సినిమాల్లో ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్నారు. విభిన్నమైన షోలు చేయడంలో దిట్ట. నాకు స్ఫూర్తి ఆయనే! ‘కాకినాడ బీచ్‌ ఫెస్ట్‌’లో ఆయనతో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ రోజు ఎప్పటికీ మరిచిపోలేను. నేను ఈ డ్యాన్స్‌ మొదలుపెట్టే సరికి రోబో గణేశ్‌లా పేరున్న వారు దేశంలో ఇద్దరు ముగ్గురు మాత్రమే. మా ఈవెంట్స్‌ వల్ల ఇప్పుడు చాలామంది యువత ఆకర్షితులవుతున్నారు. ఆస్వాదించే ప్రేక్షకులూ అధికమవుతున్నారు. 


కష్టానికి గుర్తింపు...  

రాను రాను డాల్‌ డ్యాన్స్‌ నా జీవితంలో భాగమైపోయింది. అదే లోకమైపోయింది. సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రిరిలీజ్‌ వేడుకుల్లో ప్రదర్శనలివ్వమని ఆహ్వానాలందాయి. వాటివల్ల ఈ విభిన్న నృత్యరీతికి మరింత ఆదరణ పెరిగింది. ఇప్పటివరకు 25 ఈవెంట్స్‌ చేశాను. గోదావరి పుష్కరాలప్పుడు ఇచ్చిన ప్రదర్శన చూసి నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ‘నీది ప్రత్యేకమైన ప్రతిభ’ అంటూ ప్రశంసించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ముందు ఓ షో నిర్వహించాను. అలాగే నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సమక్షంలో చేశాను. ‘విభిన్నంగా చేశావు’ అంటూ ఆయన మెచ్చుకున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర గారైతే బెంగళూరులో తన సినిమా ప్రిరిలీజ్‌ వేడుకకు నన్ను పిలిపించి ప్రదర్శన ఇప్పించారు. ఇదంతా నా కష్టానికి దక్కిన గుర్తింపు. 


అన్నయ్యే లేకపోతే... 

అభిరుచి అందరికీ ఉంటుంది. కానీ దాన్ని నెరవేర్చుకొనే దారులు లేక చాలామంది వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. మా అన్నయ్య కమల్‌ కుమార్‌ నాకు అన్నీ అయ్యాడు. తను వెల్డర్‌గా సింగపూర్‌లో ఉద్యోగానికి వెళ్లాక మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. నేను డ్యాన్స్‌ నేర్చుకొంటానంటే ఏది కావాలంటే అది కొనిచ్చాడు. భుజం తట్టి ప్రోత్సహించాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు అన్నయ్యే కారణం. 



ఇదీ ప్రత్యేకత... 


‘డాల్‌ డ్యాన్స్‌’ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఇందులో ప్రధానంగా డబుల్‌ హెడ్‌, స్ర్పింగ్‌ డ్యాన్స్‌, ఫోర్‌ డాల్స్‌, హెడ్‌లెస్‌ డ్యాన్స్‌, టు డాల్స్‌ పపెట్‌ షో అనే వెరైటీలుంటాయి. ఈ వెరైటీలన్నీ నేను చేస్తాను. నా ప్రదర్శనలన్నీ సోలోనే. ఉదాహరణకు ఫోర్‌ డాల్స్‌ డ్యాన్స్‌ అంటే నాలానే నాలుగు బొమ్మలుంటాయి. వాటిని పట్టుకుని నేను డ్యాన్స్‌ చేస్తాను. ఆ బొమ్మలు కూడా నాతోపాటే మూమెంట్స్‌ ఇస్తుంటాయి. అదేవిధంగా మిగిలిన రీతులు కూడా. రకరకాల డాల్స్‌తో చేస్తుంటాం. థీమ్‌ ఆధారంగా వాటిని ఎంచుకొంటాను. ఈవెంట్‌ను బట్టి ఆ బొమ్మల డ్రెస్‌లు కుట్టడం, స్టయిలింగ్‌ అన్నీ నేనే చేస్తాను. నిజానికి ఈ డ్యాన్స్‌ ఎంతో క్లిష్టమైనది. మనతోపాటు బొమ్మలు కూడా రిథమిక్‌గా ఆడించగలిగితేనే షో రక్తి కడుతుంది. నా లక్ష్యమల్లా డాల్‌ డ్యాన్స్‌ను సాధ్యమైనంతమందికి చేరువ చేయడం. దాని కోసం ‘గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పేరిట ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాను. దీని కింద వివిధ విభాగాలకు చెందిన నలభై మంది సిబ్బంది పని చేస్తున్నారు. 


Updated Date - 2020-11-25T06:18:27+05:30 IST