షట్లర్ల ట్రిపుల్‌ ధమాకా

ABN , First Publish Date - 2022-08-08T10:24:43+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడల బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది.

షట్లర్ల ట్రిపుల్‌ ధమాకా

సింగిల్స్‌లో సింధు, లక్ష్య.. డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ ఫైనల్స్‌కు

శ్రీకాంత్‌కు కాంస్యం 

కామన్వెల్త్‌ క్రీడల బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో సింధు 21-19, 21-17తో సింగపూర్‌ షట్లర్‌ యే జియా మిన్‌ను చిత్తుచేసి ఫైనల్‌ చేరింది. గత క్రీడల్లోనూ ఫైనల్‌ చేరిన సింధు.. సైనా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు 2014లో కాంస్యం నెగ్గిన సింధు.. ఈసారి స్వర్ణాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. సోమవారం జరిగే ఫైనల్లో మిచెల్లి లీ (కెనడా)తో సింధు తలపడనుంది.


పురుషుల సింగిల్స్‌ సెమీ్‌సలో లక్ష్యసేన్‌ 21-10, 18-21, 21-16తో జియా హెంగ్‌ తె (సింగపూర్‌)పై గెలిచి తొలిసారి ఈ క్రీడల్లో ఫైనల్‌ చేరాడు. మలేసియా షట్లర్‌ జి యంగ్‌ నాంగ్‌తో లక్ష్య ఫైనల్‌ ఆడనున్నాడు.  కాగా, మరో సెమీ్‌సలో గత క్రీడల రన్నరప్‌ కిడాంబి శ్రీకాంత్‌ 13-21, 21-19, 10-21తో జి యంగ్‌ నాంగ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన కాంస్య పతక పోరులో శ్రీకాంత్‌ 21-15, 21-18తో జియా హెంగ్‌ తెపై గెలిచి కాంస్య పతకం దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్‌ సెమీ్‌సలో సాత్విక్‌ /చిరాగ్‌ శెట్టి జోడీ 21-6, 21-15తో మలేసియా జంట చెన్‌ పెంగ్‌/తియాన్‌ కియాన్‌పై గెలిచి తుదిపోరుకు చేరింది. 

Updated Date - 2022-08-08T10:24:43+05:30 IST