Abn logo
Jul 5 2020 @ 03:26AM

ముగిసిన డాన్‌శకం

దిగ్గజ షట్లర్‌ లిన్‌ వీడ్కోలు

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు.. ఐదుసార్లు ప్రపంచ విజేత.. ఆరు ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిళ్లు.. ఇదీ బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో చైనా సూపర్‌ స్టార్‌ లిన్‌ డాన్‌ సాధించిన ఘనతలు. ప్రతీ మేజర్‌ టైటిల్‌ను గెలిచిన డాన్‌తో మ్యాచ్‌ అంటేనే ప్రత్యర్థులు తమ విజయంపై ఆశలు వదులుకునే పరిస్థితి. ఇలా సుదీర్ఘకాలం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈ మాజీ నెంబర్‌వన్‌ ఇక తన రాకెట్‌ను దించేస్తున్నట్టు ప్రకటించాడు. తన చిరకాల ప్రత్యర్థి, స్నేహితుడు లీ చోంగ్‌ వీ బ్యాడ్మింటన్‌ నుంచి వైదొలిగిన ఏడాదికే డాన్‌ కూడా వీడ్కోలు

పలకడం అభిమానులను నిరాశపరిచే విషయమే.


లిన్‌ డాన్‌ ఘనతలు

ఒలింపిక్స్‌ స్వర్ణాలు (2)

2008, 2012

ప్రపంచ చాంపియన్‌షి్‌ప స్వర్ణాలు (5)

 2006, 2007, 2009, 2011, 2013

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిళ్లు (6)

 2004, 2006, 2007, 2009, 2012, 2016

ఆసియా గేమ్స్‌ స్వర్ణాలు (5)

2006, 2010 (2), 2014, 2018 


బీజింగ్‌: చైనా బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ లిన్‌ డాన్‌ తన కెరీర్‌కు ముగింపు పలికాడు. సుదీర్ఘకాలంగా బాధపెడుతున్న గాయాలే దీనికి కారణంగా 36 ఏళ్ల డాన్‌ ప్రకటించాడు. దీంతో ఈ ఆటతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధానికి అతను తెర దించినట్టయింది. ‘నేనెంతగానో ఇష్టపడిన బ్యాడ్మింటన్‌ కోసం అంతా ధారపోశా. నా సంతోష, కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, అభిమానులు అండగా నిలిచారు. ఇప్పుడు వయస్సు పెరుగుతోంది. నా ఫిట్‌నెస్‌ లోపాలు, గాయాలతో సహచరులను ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకే 2000 నుంచి 2020 వరకు సాగిన నా ఆటకు గుడ్‌బై చెబుతున్నా. మిగిలిన జీవితం కుటుంబంతో గడపాలనుకుంటున్నా’ అని చైనా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ వీబోలో ప్రకటించాడు.


సూపర్‌ డాన్‌గా..

ఆటకు వన్నె తెచ్చే ఆటగాళ్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో లిన్‌ డాన్‌ ఒకడు. చిన్నప్పుడు బ్యాడ్‌ బాయ్‌గా ముద్ర వేయించుకున్న లిన్‌.. పెద్దయ్యాక తానెంచుకున్న క్రీడలో అతి పెద్ద స్టార్‌గా మారడం అతని అంకితభావం, అకుంఠిత దీక్షను చాటి చెబుతుంది. లిన్‌ తల్లి కొడుకును పియాని్‌స్టగా చూడాలనుకుంది. కానీ డాన్‌ మాత్రం ఐదేళ్ల వయస్సులోనే షట్లర్‌ కావాలని నిర్ణయించుకున్నాడు. 2001లో ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మారాక 2004 నుంచి 2013 వరకు బ్యాడ్మింటన్‌ కోర్టును శాసించాడు. ఒకటా.. రెండా అతడు సింగిల్స్‌లో ఐదు ప్రపంచ చాంపియన్‌షి్‌ప టైటిళ్లతో పాటు వరుసగా రెండు ఒలింపిక్‌ స్వర్ణాలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు.. ఆసియా గేమ్స్‌, ఆసియన్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణాలు, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌షి్‌ప టైటిళ్లు ఖాతాలో వేసుకోగలిగాడు. 2017లో మలేసియా ఓపెన్‌ గెలిచాక అన్ని మేజర్‌ టైటిళ్లు అందుకున్న షట్లర్‌గా ఘనత సాధించాడు. అందుకే అంతా నిస్సందేహంగా అతడిని ‘సూపర్‌ డాన్‌’గా పిలుచుకున్నారు. ఓవరాల్‌గా 66 సింగిల్స్‌ టైటిళ్లు అందుకున్న డాన్‌.. కెరీర్‌లో 666 విజయాలు సాధించాడు. కేవలం 128 మ్యాచ్‌ల్లోనే ఓటమి చవిచూశాడు.


‘టోక్యో’తో ముగిద్దామనుకున్నా..

బ్యాడ్మింటన్‌ చరిత్రలో అతి గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్న లిన్‌ డాన్‌ నిజానికి టోక్యో ఒలింపిక్స్‌తో కెరీర్‌ను ముగిద్దామనుకున్నాడు. బీజింగ్‌ (2008), లండన్‌ (2012) విశ్వక్రీడల్లో స్వర్ణాలు సాధించిన అతడు మూడోసారి ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరాడు. కానీ కరోనా కారణంగా ఈ గేమ్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడం అతడికి నిరాశను కలిగించింది. దీనికి తోడు ఇటీవల వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్‌లో (19వ స్థానం)నూ వెనకబడడంతో టోక్యో బెర్త్‌ దక్కించుకోవడం ఈ ఎడమచేతి షట్లర్‌కు కష్టంగా మారింది. దీంతో 2021 వరకు వేచిచూడడం అనవసరమనే ఆలోచనతో గుడ్‌బై చెప్పేశాడు.


చోంగ్‌పైనా ఆధిపత్యమే..

గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన మలేసియా దిగ్గజం లీ చోంగ్‌ వీ, లిన్‌ డాన్‌ బ్యాడ్మింటన్‌లో దశాబ్దం పాటు తమదైన ఆటతీరుతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఇక.. ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్ష పోరును తిలకించేందుకు అంతా ఆత్రుతగా ఎదురుచూసేవారు. 15 ఏళ్ల క్రితం తొలిసారిగా తలపడిన వీరి మధ్య.. మొత్తం 40 మ్యాచ్‌లు జరగాయి. ఇందులోనూ లిన్‌ డాన్‌ 28-12 రికార్డుతో తన ఆధిపత్యం చాటుకున్నాడు.


ఈ సమయం వస్తుందని మనకు తెలుసు. మన జీవితాలకు ఇది చాలా కష్ట సమయమే. అయినా నీవు అద్భుతంగా వీడ్కోలు పలికావు. మనిద్దరం తలపడిన మ్యాచ్‌ల్లో రాజులా పోరాడావు. - లీ చోంగ్‌ వీ

Advertisement
Advertisement
Advertisement