షటిల్‌ కాక్స్‌ కొరత..సాధనకు దెబ్బ

ABN , First Publish Date - 2020-09-16T09:33:41+05:30 IST

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో దేశంలో క్రీడారంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. అయితే బ్యాడ్మింటన్‌ మాత్రం కొత్త ...

షటిల్‌ కాక్స్‌ కొరత..సాధనకు దెబ్బ

చైనా దిగుమతుల నిషేధమే కారణం

బెంగళూరు: లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో దేశంలో క్రీడారంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. అయితే బ్యాడ్మింటన్‌ మాత్రం కొత్త సమస్య ఎదుర్కొంటోంది. అది షటిల్స్‌ కొరత. జాతీయ శిబిరంలోని ఆటగాళ్లు సహా దేశంలోని పెద్ద సంఖ్యలో షట్లర్లు యోనెక్స్‌ కాక్స్‌ను ఉపయోగిస్తారు. నెల రోజులుగా షటిల్స్‌ సరఫరాలో కొరత ఏర్పడినట్టు దేశంలోని పలువురు డీలర్లు చెబుతున్నారు. తమవద్ద చాలా తక్కువ సంఖ్యలో నిల్వలున్నట్టు తెలిపారు. చైనా నుంచి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడమే కాక్స్‌ కొరతకు కారణమని వారు వివరించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే కాక్స్‌లో 90 శాతానికిపైగా చైనా తయారు చేస్తోంది. షటిల్స్‌ తయారీలో ఉపయోగించే బాతు ఈకల ఉత్పత్తిలో కూడా సింహభాగం చైనాదే. ఒకవిధంగా కాక్స్‌ తయారీలో చైనాది గుత్తాధిపత్యం. చైనా వస్తువులను కేంద్రం నిషేధించడంతో ఇప్పట్లో షటిల్స్‌ దిగుమతి సాధ్యంకాదు’ అని ఓ డీలర్‌ వివరించాడు. కాక్స్‌ కొరతతో జాతీయ శిబిరంలో ఆటగాళ్ల సాధనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా అంగీకరించాడు. షటిల్స్‌ కనుక రాకపోతే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుందని అతడు ఆందోళన వ్యక్తంజేశాడు. 

Updated Date - 2020-09-16T09:33:41+05:30 IST