Abn logo
Mar 6 2021 @ 00:37AM

కల్లోల కాలంలో నవ శూద్ర జాగృతి

ఉత్పత్తి శ్రమ అంతా శూద్రులదేననడంలో సందేహం లేదు. దేశ సిరిసంపదలలో శూద్రులకు న్యాయబద్ధమైన వాటా ఇప్పటికీ లభించడం లేదు. భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన అనంతరం తమకు రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటుహక్కు తమ ఉనికిని చాటుకోవడానికి ఒక ప్రధాన ఆలంబన అనే విషయాన్ని శూద్రవర్గాలు గుర్తించాయి. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక అపూర్వ పరిణామం. ఇది భారతదేశపు నిశ్శబ్ద విప్లవమని పాశ్చాత్య మేధావి ఒకరు సహేతుకంగానే అభివర్ణించారు.


అంత్యజుల గురించిన అధునాతన దార్శనికత ఆవిష్కరణే ‘ది శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాథ్’. పది రోజుల క్రితం ప్రచురితమైన ఈ పుస్తకం ఆలోచనాపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కంచ ఐలయ్య షెపర్డ్, కార్తీక్ రాజా కరుప్పసామి సంపాదకత్వంలో, ప్రతిష్ఠాత్మక ప్రచురణ సంస్థ పెంగ్విన్ నుంచి వెలువడిన ఈ పుస్తకం శూద్ర సామాజిక శక్తుల జాగృతి గురించి ఘంటానాదం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆసేతు హిమాచలం నిరసనలు తెలుపుతున్న రైతులు ఆ చైతన్యశీల శూద్రులే. దేశ పాలకులలో అన్నదాతల పట్ల ఆదరణ భావం లోపించడం వారిని తీవ్ర ఆగ్రహావేశాలకు లోను చేస్తోంది. మట్టి మనుషుల తిరుగుబాటును కేంద్రప్రభుత్వం చవిచూస్తోంది. 


ఎడిటర్స్ ఐలయ్య, కరుప్పసామి తమ పుస్తకాన్ని మహోన్నత ఫూలేలు-–జ్యోతీరావు, సావిత్రీ బాయికి అంకితం చేశారు. భారతదేశ చరిత్రలో ప్రథమంగా సమాజంలోని అట్టడుగు, అణగారిన వర్గాలలో విద్యావ్యాసంగాలను వికసింపచేసి, చారిత్రక అన్యాయాలపై తిరుగుబాటుకు పురిగొల్పిన శూద్ర విప్లవోద్యమానికి అంకురార్పణ చేసిన వారు ఫూలే దంపతులు. క్రీస్తుశకం మొదటి శతాబ్దికి చెందిన మనుస్మృతి కానివ్వండి, 1780లలో బ్రిటిష్ వలసపాలకులు రూపొందించిన ‘ఎ కోడ్ ఆఫ్ జెంటూ లాస్’ కాన్వివండి, చరిత్ర పొడుగునా శూద్రులు వివక్షకు గురయ్యారనే సత్యానికి నిండు తార్కాణాలుగా నిలిచిపోయాయి. ఏ ధర్మశాస్త్రమూ ఆ అంత్యజులకు సముచిత గౌరవమివ్వలేదు. వారిని దూషించింది, అవమానపరిచింది. పుట్టుక నుంచి చావు వరకు వారి జీవితాలను హేతువిరుద్ధ, మానవతా లుప్త ఆదేశాలతో కట్టడి చేసింది. ప్రపంచవ్యాప్తంగా వలససమాజాలలో పాలితులకు ఒకే ఒక్క శత్రువు ఉండేవాడు. వలసకారులే ఆ శత్రువులు. శతాబ్దాల పాటు విదేశీయుల పాలనలో మగ్గిన భారతదేశం జనాభాలో అత్యధికులుగా ఉన్న శూద్రులు, అతి శూద్రులు, ఆదివాసీలకు బాహ్యశత్రువు- (వలసకారులు-) లతో పాటు అంతర్గత శత్రువులు- (అగ్రవర్ణాల వారు-) కూడా ఉండేవారు. ఈ ఇరువర్గాల అభిజాత్యంలో వారు నలిగిపోయారు. 


బాహ్య, అంతర్గత శత్రువులు ఇరువురిపై ఫూలేలు ‘సత్యశోధక్ సమాజ్’ ఉద్యమం ద్వారా పోరాడారు. శూద్రులు, అతి శూద్రులకు ఆధునిక విద్యను అందించారు. జ్యోతీరావు ఫూలే రచన ‘గులాంగిరీ’ బాహ్యశత్రువులు కాక అంతర్గత శత్రువులు విధించిన బానిసత్వం గురించి కావడం గమనార్హం. వలసపాలకులు సైతం వివిధ జీవనరంగాలలో ఆధునికతను ప్రవేశపెట్టారు. నవీన విద్యావసతులను అభివృద్ధి పరిచారు. అయినప్పటికీ ఆ సంప్రదాయ బానిసత్వం కొనసాగింది. వలసపాలనాయంత్రాంగం సమర్థంగా పని చేసేందుకు వీలుగా తమ స్వప్రయోజనాల కోసం వలసపాలకులు అందించిన ఆధునిక విద్యతో అధికంగా లబ్ధి పొందింది అగ్రవర్ణాలవారే గానీ, శూద్ర కులాలవారు కాదు. ఈ కఠోర వాస్తవాన్ని (క్యాస్ట్: ఇట్స్ ట్వంటీయత్ సెంచరీ అవతార్‘ అనే పుస్తకంలోని) ‘బ్యాక్‌వర్డ్ క్లాసెస్ మూవ్‌మెంట్స్ ఇన్ తమిళనాడు’ అన్న తన వ్యాసంలో పి.రాధాకృష్ణన్ సవివరంగా పేర్కొన్నారు. ‘1901-–17 సంవత్సరాల మధ్య మద్రాస్ ప్రెసిడెన్సీలోని మొత్తం జనాభాలో బ్రాహ్మిన్‌లు 3 శాతం మంది మాత్రమే కానీ మొత్తం పట్టభద్రులలో వారు 63 నుంచి 66 శాతం దాకా ఉన్నారు.


అదే ప్రెసిడెన్సీ జనాభాలో 86 శాతం మేరకు ఉన్న శూద్రులు, దళితులు, ఆదివాసీల వర్గాల నుంచి విద్యావంతులు అయినవారు మొత్తం పట్టభద్రులలో కేవలం 23 నుంచి 24 శాతం మేరకు మాత్రమే ఉన్నారు. ఈ కారణంగానే ‘పెరియార్’ ఇ వి రామస్వామినాయకర్ మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మిన్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. శూద్రులు, అతిశూద్రులకు విద్యావసతులు, ఉద్యోగావకాశాలను పెంపొందించాలని, వారికి అన్ని పౌరహక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 1917లో జస్టిస్ పార్టీ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర వహించారు. దక్షిణాది రాష్ట్రాలలో శూద్రుల హక్కుల పరిరక్షణకు ఈ పార్టీ తోడ్పడింది. 


డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన ఆధునిక రాజ్యాంగం అమలులోకి రావడంతో 1950 జనవరి 26న భారతదేశం ప్రజాస్వామిక గణతంత్రరాజ్యంగా ఆవిర్భవించింది. సకల భారతీయులు ఎటువంటి తరతమ బేధాలు లేకుండా భారత గణతంత్రరాజ్య పౌరులు అయ్యారు. ఏ ఆధునిక ప్రజాస్వామిక గణతంత్రరాజ్య పౌరులయినా వివిధ రకాల సంప్రదాయక, ఆధునిక వృత్తులను ఆచరించడం కద్దు. భారతదేశంలో వ్యవసాయం, పశుపాలన, హస్తకళలు మొదలైన కార్యకలాపాలలో పాల్గొనేవారు, వడ్రంగం, నేత, మట్టిపాత్రల తయారీ మొదలైన సంప్రదాయ వృత్తులను ఆచరించేవారు. అందరూ జన్మతః ఏదో ఒక నిర్దిష్ట కులం లేదా ఒక ఉప కులానికి చెందిన వారై ఉంటారు. వివిధ ఉత్పత్తి కార్యకలాపాలలో విభిన్న కులాలు వారు, సామాజిక సముదాయాలు అన్నిటినీ కలిపి భారతీయ సామాజిక సంప్రదాయంలో ‘శూద్రులు’గా పరిగణన పొందుతున్నారు. విషాదమేమిటంటే ఈ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనే శ్రామికులు అందరూ తమ తాతముత్తాతలు, వారి ముందటి తరాల వారు ఏ వృత్తులనయితే ఆచరించారో అదే వృత్తులను వీరూ ఆచరించడం జరుగుతోంది. కులం అనేది ఇండో-ఆర్యన్ సమాజంలో ఒక సువ్యవస్థిత సామాజిక శ్రేణి అని కొందరు వాదిస్తారు. అయితే అది ఈ 21వ శతాబ్దిలో కూడా పూర్తిగా అమలులో ఉంది. శూద్రులు, అతి శూద్రులుగా జ్యోతీరావు ఫూలే పిలిచిన సామాజికవర్గాల వారు నేటి రాజ్యాంగ వ్యవహారంలో జాట్లు, గుజ్జర్లు, యాదవ్‌లు, కుర్మీలు, మరాఠాలు మొదలైనవారు, ఇంకా ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), షెడ్యూల్డు కులాలుగా పిలవబడుతున్నారు. 


ఉత్పత్తి శ్రమ అంతా శూద్రులదేననడంలో సందేహం లేదు. వారి శ్రమతోనే భారతదేశం పురాతన కాలం నుంచి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంది. అయితే ఆ సిరిసంపదలలో శూద్రులకు న్యాయబద్ధమైన వాటా ఇప్పటికీ లభించడం లేదు. భారత్ గణతంత్రరాజ్యంగా ఆవిర్భవించిన అనంతరం తమకు రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటుహక్కు తమ ఉనికిని చాటుకోవడానికి ఒక ప్రధాన ఆలంబన అనే విషయాన్ని శూద్రవర్గాలు గుర్తించాయి. పార్లమెంటు, శాసనసభలలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకున్నాయి. ఎన్నికలలో రాజకీయపార్టీల జయాపజయాలలో తమ కీలక ప్రాధాన్యతను శూద్రులు గుర్తించారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక అపూర్వ పరిణామం. ఇది భారతదేశపు నిశ్శబ్ద విప్లవమని పాశ్చాత్య మేధావి ఒకరు సహేతుకంగానే అభివర్ణించారు. భారతీయ రైతులు బీజేపీ ప్రభుత్వంతో తీవ్రంగా ఘర్షిస్తున్న కల్లోల సందర్భంలో ఐలయ్య, కరుప్పుసామి పుస్తకం వెలువడింది. కొత్త సాగుచట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులలో అత్యధికులు శూద్రవర్గంలోని వివిధ ఉపకులాలకు చెందినవారే అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. వివిధ ప్రాంతాలలో వివిధ స్థానిక నామధేయాలతో ఆయా ఉపకులాలు వర్థిల్లుతున్నాయి. శూద్రులు చరిత్ర విజేతలుగా భాసిల్లే సమయం ఆసన్నమయిందని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది. 


-అరవింద కుమార్

జమియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ

Advertisement
Advertisement
Advertisement