May 11 2021 @ 12:45PM

నాకూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి: శ్రుతీహాసన్‌

శ్రుతీహాసన్‌.. మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ నట వారసురాలు అయినప్పటికీ తండ్రి బ్యాగ్రౌండ్‌ని ఉపయోగించకుండా స్వశక్తితో ఎదుగుతున్న నటి. మొదటి నుంచి ఆమె ఇండిపెడెంట్‌గానే ముందుకెళ్తున్నారు. మంగళవారం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు సహాయం చేయడానికి అమ్మానాన్న లేరు. అంటే నేను వారి మీద ఆధారపడలేదని అర్ధం. నా కళ్ల మీద నిలబడటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తా. నా ఖర్చులకి నేనే సంపాదించుకుంటా. నా కుటుంబ సభ్యుల నుంచి ఏమీ ఆశించను, అడగను. నా బిల్లులు చెల్లించుకోవాలంటే నేను పని చేయాల్సిందే! లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాలి. గతంలో కూడా నాకు ఇవన్నీ అనుభవమే! కరోనాకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందనే దానికోసం నేను వెయిట్‌ చేయను. నేను పని చేస్తున్న ప్రాజెక్ట్‌ల నుంచి ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు నేను షూటింగ్‌కి  వెళ్లాల్సిందే!  అందరిలాగే నాకు ఇబ్బందులున్నాయి. అందుకే పని చేసి తీరాలి. నా వ్యక్తిగత, వృతి పరమన నిర్ణయాలు నేను తీసుకుంటా. ఎవరి సలహాలు తీసుకోను.  కరోనా కారణంగా నష్టాల్లో ఉన్నామంటూ స్మార్ట్‌ పీపుల్‌ చాలామంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు. నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతా’’ అని శ్రుతీ తెలిపారు. అయితే ఉన్నట్టుండి శ్రుతీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇటీవల సక్సెస్‌ అయిన ‘వకీల్‌ సాబ్‌’లో పవన్‌కు భార్యగా నటించిన ఆమె ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌, ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రంలో నటిస్తోంది.