ఇకపై అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నా: శ్రియ

శ్రియ హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టి 20 వసంతాలు పూర్తయింది. పోటీ ప్రపంచంలో హీరోయిన్‌గా ఇంతకాలం కొనసాగడం సాధారణ విషయం కాదంటోంది ఆమె. అభిమానుల ఆశీసులే అందుకు కారణం అని శ్రియ చెబుతున్నారు. ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్రియ ‘గమనం’ సినిమాతో మళ్లీ వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న ఈ చిత్రం గురించి శ్రియ విలేకర్లతో మాట్లాడారు. 


హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి ఇరవై ఏళ్లు అవుతోంది. ఈ పోటీ ప్రపంచంలో ఓ నాయిక  రెండు దశాబ్దాలు హీరోయిన్‌గా కొనసాగడం సాధారణ విషయం కాదు. అందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. దేవుడు, అభిమానుల ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైంది. దానితో నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను. ఈ జర్నీలో నేను నటించిన కొన్ని సినిమాలు హిట్‌ అయ్యాయి. కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. కానీ ప్రేక్షకుల అభిమానం మాత్రం నాపై నిలకడగా ఉంది. అందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదే అభిమానం కొనసాగి  ఇంకో 20 ఏళ్లు నటించాలనుంది. బతికున్నంత వరకూ నాకు నటించాలనే ఉంది.  ఏఎన్నార్‌ గారు చివరి క్షణం వరకు నటించారు. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ‘ఒకవేళ నేను చనిపోతే.. ఈ సినిమా చేేస చనిపోతాను’ అని అనేవారు. నేను కూడా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉంటాను. 


కళ్లల్లో నీళ్లు తిరిగాయి...

సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడాలనుకుంటున్నా. నా మనసుకు నచ్చిన పాత్రలే చేయాలనుకుంటున్నా. అలా ఎంచుకున్న కథే ‘గమనం’. ఈ కథ వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తా. వినిపించదు కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్‌ కోసం క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని మనం అధిగమించేస్తాం. నా డెలివరీ సమయంలోనూ నాకు ఇలాంటి భయం ఉండేది. కానీ ఏం కాదు అన్న ధైర్యం తెచ్చుకున్నాను. లైఫ్‌లో అందరికీ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. దాన్నుంచి ఎలా బయటకు వస్తామని చెప్పేదే గమనం. గతంలో లేడీ డైరెక్టర్స్‌తో పని చేసిన అనుభవం ఉంది. అయితే తెలుగులో ఇదే మొదటిసారి. వ్యక్తిగత సమస్యలున్నా లేడీ డైరెక్టర్స్‌కి ఓపెన్‌గా చెప్పొచ్చు. నా కూతురు ప్రశ్నించేలా ఉండకూడదు.. 

ఇకపై ఛాలెంజింగ్‌ పాత్రలే చేయాలనుకుంటున్నా. నా కూతురు నా సినిమాలు చూసి ‘ఇలాంటివి ఎందుకు చేశావ్‌ మమ్మీ’ అని ప్రశ్నించకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నా ఫ్రెండ్‌ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. ఆ బాధలోనే షూటింగ్‌ చేశాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. 


పిల్లలు పుట్టాక చాలా మారుతుంది...

ప్రెగ్నెన్సీ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. అయినా వర్కవుట్లు చేసి, కథక్‌ డ్యాన్స్‌ చేస్తూ ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టాను. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్‌ నెస్‌ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకెళ్తున్నాం. 


Advertisement