మోరల్‌ సపోర్ట్‌ చాలా ముఖ్యం

ABN , First Publish Date - 2020-02-23T06:13:28+05:30 IST

మాటలతో మాయ చేస్తే మాటల మాంత్రికుడు అంటారు! పాటలతో మ్యాజిక్‌ చేస్తే... శ్రేయాఘోషాల్‌ అంటారు.. అంతటి మధురమైన గానం ఆమెది.

మోరల్‌ సపోర్ట్‌ చాలా ముఖ్యం

మాటలతో మాయ చేస్తే మాటల మాంత్రికుడు అంటారు! పాటలతో మ్యాజిక్‌ చేస్తే... శ్రేయాఘోషాల్‌ అంటారు.. అంతటి మధురమైన గానం ఆమెది. మాతృభాష బెంగాలీ అయినా.. తెలుగులో పాట పాడారు అంటే అచ్చు తెలుగమ్మాయి పాడినట్టే ఉంటుంది. ‘నువ్వేం మాయ చేశావో కానీ’.. అంటూ ప్రారంభించిన ఆమె 18 ఏళ్లుగా హిట్స్‌ సాంగ్స్‌తో తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’(ఫిమేల్‌ వెర్షన్‌)తో మెప్పించిన శ్రేయా తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చారు. 


సింగర్‌గా తెలుగు ఎంట్రీ ఇళయరాజాగారి సంగీతంలో జరిగింది. ఆ అవకాశం రావడానికి ఆయన కుమారుడు కార్తీక్‌ రాజా కారణం. ఓ తమిళ పాట పాడడానికి చెన్నై వెళ్తే కార్తీక్‌ నన్ను ఇళయరాజాగారికి పరిచయం చేశారు ‘నిను చూడక నేనుండలేను’ సినిమాలో ‘సరి సరి’ నా తొలి తెలుగు పాట. కానీ గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘ఒక్కడు’ సినిమాలో ‘నువ్వేం మాయ చేసావో కానీ’ పాట. హైదరాబాద్‌లో అనే కాదు ప్రపంచంలో ఎక్కడ షోలు చేసినా ఈ పాట తప్పకుండా పాడతాను. తెలుగువారున్న ప్రతి చోటా నాకు ఫాలోయింగ్‌ ఉంది. మణిశర్మగారు ఇచ్చిన అవకాశం వల్లే తెలుగులో నాకు మంచి క్రేజ్‌ వచ్చింది. 


సంగీతానికే మొదటి ప్రాధాన్యం...

చదువు, సేవా కార్యక్రమాలు.. ఇంకా ఎన్ని రకాల పనులున్నా మొదటి ప్రయారిటీ మాత్రం సంగీతం, గానమే! నేను చదివిన సెంట్రల్‌ స్కూల్లో ఫైన్‌ ఆర్ట్స్‌, సంగీత రంగాల్లో ప్రోత్సాహం తక్కువ. జనరల్‌గా ఇంట్లో అమ్మాయి ఉందంటే డాక్టర్‌ చదివించాలనో, ఇంజనీర్‌ని చేయాలనో పేరెంట్స్‌ అనుకుంటారు. నా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని తెలుసుకుని స్వేచ్ఛనిచ్చారు. ‘జీ సరిగమప’ షోలో అవకాశం రావడం, గాయనిగా నిరూపించుకోవడం, మంచి వ్యక్తుల పరిచయం పెరగడం వల్ల సింగర్‌గా ఈ స్థాయిలో ఉన్నా. ఇప్పటి వరకూ 11 భాషల్లో పాటలు పాడాను. 


మోరల్‌ సపోర్ట్‌ ముఖ్యం..

పది, పన్నెందేళ్ల వయసున్నప్పుడు నాకు సిగ్గు ఎక్కువ. స్టేజ్‌ మీద పాడాలంటే టెన్షన్‌ పడేదాన్ని. అమ్మానాన్న ఇచ్చిన సపోర్ట్‌తో ధైర్యంగా ముందుకెళ్లేదాన్ని. నేను కెరీర్‌ ప్రారంభించిన సమయంలో పోటీ ఉంటుందనీ, ఓ అమ్మాయి తను ఎంచుకున్న రంగంలో గెలుచుకురావడానికి ఎంతో కృషి చేయాలనీ, స్ట్రగుల్స్‌ ఉంటాయని అప్పట్లో నాకు తెలీదు. ఆ పెయిన్‌ అంతా నా తల్లిదండ్రులే తీసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ వద్దన్న వారిని కన్విన్స్‌ చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఆ సమయంలో నాకేమీ తెలియదు. చేసే పనిని ఎంజాయ్‌ చేస్తూ ముందుకెళ్లానంతే!  మోరల్‌ సపోర్ట్‌ అనేది మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లగలదు అని అప్పుడే అర్థమైంది. 


హగ్‌ చేసుకోవాలనుంది...

ఫలానా పాట మీద నాకు క్రష్‌ అని చెప్పలేను. కానీ స్కూల్‌, కాలేజ్‌ డేస్‌లో తరచు వినబడిన పాటల తాలూకు  జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. ఎప్పుడూ ఆ పాటలే మదిలో మెదులుతుండేవి. అలా నా మధుర జ్ఞాపకాల్లో ‘రహ్‌నా హై తేరే దిల్‌ మే’ సినిమాలో బొంబాయి జయశ్రీగారు పాడిన ‘జరా జరా బెహెక్తా హై’ పాట ఇప్పటికీ నన్ను వెంటాడుతుంటుంది. ఆ పాటకు, జయశ్రీగారి వాయి్‌సకు నేను పెద్ద అభిమానిని. ఆమెను కలిసే ఛాన్స్‌ ఇప్పటి వరకూ రాలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం ఆవిడను హగ్‌ చేసుకోవాలనుంది. 


సలహా ఇవ్వను... తీసుకుంటా..

ఈ జనరేషన్‌లో సింగర్‌ కావడం పెద్ద కష్టం కాదు. ఇంటర్‌నెట్‌ వసతులు, డిజిటల్‌ మీడియా పెరగడంతో ఈ జనరేషన్‌ సింగర్స్‌ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి వేదికైంది. సింగిల్స్‌, కవర్‌ సాంగ్‌ ఇలా ఎన్ని ప్రయోగాలైనా ‘యు ట్యూబ్‌’ వేదికగా చేయొచ్చు. సింగర్‌ కావడం ఎంత ఈజీ అయినా ఫౌండేషన్‌ బలంగా ఉండాలని నమ్ముతా. మ్యూజిక్‌ ప్రొఫెషన్‌ ప్రతి రోజూ కొత్తగానే ఉంటుంది. సాధన, మన పెర్‌ఫార్మెన్స్‌కు గురువులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ చాలా అవసరం. ఈ డిజిటల్‌ యుగంలో నేనైతే ఎవరికీ ఏ సలహా ఇవ్వను, తీసుకుంటానంతే! 


ఆ జ్ఞాపకాలు  చాలు...

హైదరాబాద్‌లో దిగగానే నాకు మొదట గుర్తుకు వచ్చేది బిర్యానీ. అయితే  దాని కన్నా ముందు నా వృత్తికి సంబంధించిన జ్ఞాపకాలు  కళ్ల ముందు మెదులుతాయి. చాలా రోజుల తర్వాత ఇష్టమైన ప్రాంతానికి వెళ్తుంటే ఎంత ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుందో నాకూ అలాగే ఉంటుంది. కాకపోతే ఎక్కువ శాతం రికార్డింగ్స్‌ ముంబైలోనే జరుగుతాయి. కొన్ని పాటలకు మాత్రం హైదరాబాద్‌ వచ్చి పాడి వెళ్తాను. తెలుగులో నాకు హిట్‌ సాంగ్స్‌ ఎక్కువ. వాటిలో ప్రేక్షకాదరణ పొందిన ప్రతి పాటా  హైదరాబాద్‌ వచ్చి పాడినదే! ఇలాంటి మెమరీస్‌ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఓల్డ్‌ క్లాసిక్స్‌ వింటుంటా. లతా మంగేష్కర్‌గారి పాటలను ఎక్కువ ఇష్టపడతా. ఇటీవల నేను పాడిన పాటల్లో ‘సైరా’ టైటిల్‌ ట్రాక్‌, ‘సామజవరగమన’ పాటలు ఎంతో నచ్చాయి. 

నేహా (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి)

Updated Date - 2020-02-23T06:13:28+05:30 IST