శ్రావణ శోభ

ABN , First Publish Date - 2022-07-29T07:51:13+05:30 IST

శ్రవణం నక్షత్రం రోజున వచ్చే పున్నమి కలిగిన మాసాన్ని ‘శ్రావణ మాసం’ అంటారు.

శ్రావణ శోభ

శ్రావణ మాసం సమృద్ధికి ఆలంబనం. ఆ సమృద్ధి భౌతికమైనదే కాదు, సాంస్కృతికమైనదీ, ధార్మికమైనదీ కూడా. అందుకే ఈ మాసాన్ని ‘నభోమాసం’ అని కూడా అంటారు. ‘హద్దులు లేని ఆకాశంలాంటిద’ని భావం.


శ్రవణం నక్షత్రం రోజున వచ్చే పున్నమి కలిగిన మాసాన్ని ‘శ్రావణ మాసం’ అంటారు. శ్రవణం నక్షత్రం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం. శ్రావణ మాసం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం. ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పాడ్యమి నుంచి అమావాస్య వరకూ ప్రతిరోజూ పర్వదినమే. మంగళవారాలు, శుక్రవారాలు... గౌరి, మహాలక్ష్మి ఆరాధనలతో, సోమవారాలు శివాభిషేకాలతో, మంగళ, శనివారాలు ఆంజనేయుడి అర్చనలతో పాటు... కృష్ణాష్టమి, దామోదర ద్వాదశి, ఏకాదశి రోజుల్లో... విష్ణు ఆరాధనతో ఆలయాలు కళకళలాడతాయి. నాగచతుర్థికీ, గరుడ పంచమికీ నాగేంద్రుడి సన్నిధిలో పూజలుంటాయి. వరాహ జయంతి, హయగ్రీవ జయంతులు వచ్చేది కూడా ఈ మాసంలోనే. 


ఇక శ్రావణ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది. ఉపనయనం అయిన వారి ఉపాకర్మ సంస్కారాలకూ, వేదాధ్యయనానికీ అనువైన రోజు. ‘జంథ్యాల పౌర్ణమి’గానూ ఇది ప్రసిద్ధం. అదే రోజున నిర్వహించే రక్షా బంధనం... మన సంస్కృతికి ప్రతీక. కుటుంబాలలోని సోదరీ సోదరుల ఆత్మీయానుబంధానికి సంకేతంగా... సోదరి రక్ష కట్టడం, ఆమెకు అన్ని వేళలా రక్షణగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేయడం దీనిలోని విశేషం. ‘రక్షబంధనోత్సవం’గా, ‘రాఖీ పున్నమి’గా దేశమంతటా నిర్వహించుకొనే వేడుక అది.


శ్రావణ మాసంలో ఆదిశక్తి రూపాలైన ఉమాదేవి (గౌరీదేవి), రమాదేవి (వరలక్ష్మి)లను మంగళ, శుక్రవారాలలో మహిళలు అర్చించడం ఆవశ్యకంగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసంలో మహిళలు, అవివాహితలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా నూతన వధువులతో పుట్టింటివారు ఈ వ్రతం చేయిస్తారు. అయిదేళ్ళ పాటు మంగళగౌరీ వ్రతం ఆచరించడం సంప్రదాయం. దీనికోసం పుట్టింటివారు ‘ఆషాఢపట్టి’ని సంప్రదాయానుసారం మెట్టినింటివారికి కానుకగా ఇచ్చి... తమ కుమార్తెను తీసుకువచ్చి, మంగళగౌరీ వ్రతం, అనంతరం  వరలక్ష్మీ వ్రతం చేయిస్తారు. శ్రావణమాసం పూర్తవగానే మెట్టినించివారు ‘శ్రావణపట్టి’ అనే ఆనవాయితీని అనుసరించి, వియ్యాలవారికి కానుకలిచ్చి, తమ కోడలిని తోడ్కొని వెళ్తారు. మంగళగౌరి సౌభాగ్యప్రదాయిని.


ఇక ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ దేవి ప్రతిరూపమైన వరలక్ష్మిని పూజించడం సంప్రదాయం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అనూచానంగా వస్తోంది. వరాలిచ్చే దేవత వరలక్ష్మిని పూజించడం వల్ల సిరిసంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని వ్రతకథా విధానం వివరంగా చెబుతోంది. వ్యక్తిగానైనా, సామూహికంగానైనా మహిళలు ఈ వ్రతం చేసుకోవచ్చు.


శ్రావణ బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య’ అంటారు. పూర్వ గ్రంథాలలో దీన్ని ‘కౌశి అమావాస్య’, ‘ఆలోక అమావాస్య’ అని ప్రస్తావించారు. ప్రధానంగా ఇది శక్తి పూజ. ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పూజా మంటపం మీద పోలాంబకు ప్రతీకగా కందమొక్కను ప్రతిష్టించి, పూజిస్తారు. తోరాలను కట్టి, వాటినీ అమ్మవారికి అర్పించి, తాము, ఇంట్లోని ఆడపిల్లలు కట్టుకుంటారు. పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని విశ్వాసం. నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి గో, వృషభ పూజను కూడా నిర్వహిస్తారు. ఇలా శ్రావణమాసంలోని ప్రతిరోజూ శోభాయమానమే.

ఎ. సీతారామారావు

(నేటి నుంచి శ్రావణమాసం)

Updated Date - 2022-07-29T07:51:13+05:30 IST