శ్రావణ శోభ

ABN , First Publish Date - 2022-07-29T05:29:47+05:30 IST

శ్రావణ మాసం వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అమ్మవార్లకు ప్రీతికరమైన మాసం ఇది. అటు శుభకార్యాలు కూడా ప్రారంభం కానున్నాయి.

శ్రావణ శోభ
పూజా సామగ్రి కొనుగోలుదారులతో విజయనగరం మార్కెట్‌

 నేటి నుంచి మాసం ప్రారంభం
 వరలక్ష్మీ వ్రతాలకు సన్నద్ధం
 నెలంతా శుభ ముహూర్తాలే
విజయనగరం, జూలై 28
: శ్రావణ మాసం వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అమ్మవార్లకు ప్రీతికరమైన మాసం ఇది. అటు శుభకార్యాలు కూడా ప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా మెట్టినింటికి దూరంగా ఉన్న కొత్త కోడళ్లు అత్తారింటికి పయనం కానున్నారు. ఈ మాసమంతా మహిళలు ముక్కోటి దేవతార్చనలో తలమునకలవుతారు. శుక్ర, శని, సోమవారాల్లో ఇష్టదైవాలకు, కులదేవతలకు పూజలు చేస్తారు. వరలక్ష్మి, మంగళగౌరి, సంతోషిమాత, వైభవలక్ష్మి, దుర్గామాత, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. జంధ్యాల పౌర్ణమి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి, షిర్డీ సాయి బాబా, అయ్యప్పస్వాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణమాసంలో ప్రధానంగా రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఎక్కువమంది ఆచరిస్తారు. సోదర భావానికి ప్రతీకగా చెప్పుకునే రాఖీ పౌర్ణమి సైతం ఇదే మాసంలో జరుపుకొంటారు. ఈ  మాసంలో శుభ ముహూర్తాలు అధికం. ఆగస్టు 26 వరకూ వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతరత్రా శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. పురోహితులు, సన్నాయి మేళాలు, పెళ్లి మండపాలకు గిరాకీ పెరగనుంది.
 జిల్లాలోని అన్ని మార్కెట్లు గురువారం వినియోగదారులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవారం పూజలకు భక్తులంతా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పూజా సామగ్రి కొనుగోలుకు మార్కెట్‌కు బారులుతీరారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి.


Updated Date - 2022-07-29T05:29:47+05:30 IST