లక్ష్మీనృసింహుడి సన్నిధిలో శ్రావణ లక్ష్మీపూజలు

ABN , First Publish Date - 2022-08-13T06:00:28+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన.. స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవాపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.

లక్ష్మీనృసింహుడి సన్నిధిలో శ్రావణ లక్ష్మీపూజలు
తిరుకల్యాణపర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

 నేత్రపర్వంగా ఊంజల్‌ సేవ.. కోటి కుంకుమార్చన 

యాదగిరిగుట్ట, ఆగస్టు12: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన.. స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవాపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రధానాలయంలో ప్రతిష్ఠా అలంకారమూర్తులను సువర్ణ పుష్పాలతో కొలిచిన అర్చకులు స్వయంభువులు, అలంకారమూర్తులను అభిషేకించి అర్చించారు. ఆలయ ప్రాకార మండపంలో హోమం, నిత్యతికల్యాణపర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రంవేళ ఆండాళ్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి, ఊంజల్‌ సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం నిర్వహించారు. అనంతరం అష్టభుజి ప్రాకార మండపంలోని అద్దాల మండపంలోని ఊయలలో లాలిపాటలు, వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాలయ ఈశాన్య అష్టభుజి ప్రాకార మండపంలో ఉదయం అర్చకబృందం, రుత్వికులు కుంకుమార్చన పూజలు చేశారు. మహాలక్ష్మీ అమ్మవారిని పట్టువస్త్రాలు, వివిధ ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి మండపంలో ప్రత్యేకవేదికపై అధిష్ఠింపజేశారు. మండపంలో అమ్మవారి సహస్రనామాలను పఠిస్తూ కుంకుమలతో కోటికుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ మహాలక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ విశేషరీతిలో ఆరాధనలు జరిపిన ఆచార్యులు కోటి కుంకుమార్చన పూజలు చేశారు. ఈ విశేష పూజా కైంకర్యాలను దేవస్థాన అర్చకులు, రుత్వికులు నిర్వహించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం సంప్రదాయరీతిలో కొనసాగింది. కాగా పవిత్ర శ్రావణ మాసం పౌర్ణమి తిథి అయినా క్షేత్ర సందర్శనకు విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో స్వామివారి నిత్యాదాయం సైతం తగ్గుముఖం పట్టాంది. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.13,46,196 ఆదాయం సమకూరింది.   

Updated Date - 2022-08-13T06:00:28+05:30 IST