కరుణ చూపండి..!

ABN , First Publish Date - 2021-11-27T06:15:06+05:30 IST

జిల్లాలోనే కాదు.. సరిహద్దున చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలకు పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు, మాండవ్య, కుందూ నదులు.. వాగులు, వంకలు వరదతో పోటెత్తాయి. ఊళ్లు..

కరుణ చూపండి..!
తోగూరుపేటలో రాళ్లకుప్పలుగా ఎస్సీ కాలనీ

అన్నమయ్య ప్రాజెక్టు వరదతో ఛిద్రమైన పల్లెసీమలు

కూడు.. గూడు.. గుడ్డ కోసం తల్లడిల్లుతున్న అభాగ్యులు

రాళ్ల కుప్పగా.. ఇసుక దిబ్బగా మారిన ఇళ్లు

వరద నష్టం అంచనాకు నేడు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన


వరద.. ఈ పదం వినగానే కడప గడపన పల్లెసీమలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. వరద మిగిల్చిన కష్టనష్టాలు అంచనాలకు అందనివి. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోవడంతో జరిగిన నష్టం అపారం. ఊళ్లు ఆనవాళ్లు కోల్పోయాయి. పొలాలు ఇసుక దిబ్బలుగా మారాయి. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయి ఛిద్రమైన పల్లెల్లోనే శరణార్థుల్లా ప్రభుత్వ చేయూత కోసం కన్నీటితో ఎదురు చూస్తున్నారు. నేడు చెయ్యేరు నదితీరంలో వరద ముంపు గ్రామాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం వస్తోంది. సర్వం కోల్పోయి కట్టబట్టలతో రోడ్డున పడిన అభాగ్యుల కష్టాలు.. కన్నీళ్లు కళ్లార చూసి.. పాలక పెద్దలు కరుణించేలా.. మళ్లీ ఈ పల్లెసీమలు కళకళలాడేలా నివేదిక ఇవ్వాలని విన్నవిస్తున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలోనే కాదు.. సరిహద్దున చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలకు పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు, మాండవ్య, కుందూ నదులు.. వాగులు, వంకలు వరదతో పోటెత్తాయి. ఊళ్లు.. పంట పొలాలు.. రహదారులను ఛిద్రం చేశాయి. 56,138.6 హెక్టార్లలో వరి, పత్తి, మినుము, వేరుశనగ, కంది.. వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 75-100 శాతం దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స మేరకు రూ.81.99 కోట్లు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే.. దిగుబడి రూపంలో హెక్టారుకు రూ.1.50 లక్షల ప్రకారమైతే రూ.850 కోట్లు, రూ.2 లక్షల ప్రకారమైతే రూ.1,110 కోట్లకు పైగా అన్నదాతలు నష్టపోయారు. పంట నష్టపరిహారం ఇవ్వడంతో పాటు బ్యాంకుల్లో చేసిన పంట రుణాలు రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్ర బృందం నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే.. ఉద్యాన పంటలు 17,704.80 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రూ.110.22 కోట్లు నష్టం జరిగిందని, పంట నష్ట పరిహారం (ఇనపుట్‌ సబ్సిడీ) రూ.30.03 కోట్లు అవసరం అని నివేదిక పంపారు.


పశు సంపదకు అపార నష్టం

రైతుకు జీవనాధారమైన పాడి పశు సంపదకు అపార నష్టం జరిగింది. పులపుత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గండ్లూరు, పాటూరు తదితర గ్రామాల్లో పాడి ఆవులు, గేదెలు, కాడెద్దులు 1,382, దూడలు, పడ్డలు, గొర్రెలు 2,532, కోళ్లు 9,638 వరదకు కొట్టుకుపోయాయి. 462 మంది రైతులు నష్టపోయారు. నష్టం విలువ రూ.1.48 కోట్లుగా అంచనా వేశారు. అయితే.. రైతుల లెక్క ప్రకారం రూ.25 కోట్లకు పైగానే ఉంటుంది. నష్టపరిహారం కాకుండా పాడి ఆవులు, గేదెలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్‌. ఆ దిశగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు.


రాళ్ల కుప్ప.. ఇసుక దిబ్బగా పల్లెసీమలు

చెయ్యేరు వరద, భారీ వర్షాలకు జిల్లాలో 2,580 ఇళ్లు దెబ్బతిన్నాయి. పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లు 475, పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లు 114, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లు ఆరు, కచ్చా ఇళ్లు 16 దెబ్బతిన్నట్లు లెక్క వేశారు. రూ.5.81 కోట్లు నష్టపోయినట్లు అంచనా. వరద నీళ్లు చేరిన ఇళ్లు 9,049. వాస్తవంగా పూర్తిగా నివాసానికి పనికిరాకుండా పోయిన 475 ఇళ్లు పునర్మించుకోవాలంటే ఇంటికి రూ.10 లక్షలు లెక్కించినా రూ.47-50 కోట్లకు పైగా అవుతుందని బాధితులు అంటున్నారు.


చితికిన రోడ్ల మరమ్మతులు ఎప్పుడో..?

జిల్లాలో 207 రోడ్లు భవనాల శాఖ రోడ్లు వరదకు భారీగా దెబ్బతిన్నాయి. 583.91 కి.మీల రోడ్లు పాడైపోయినట్లు అంచనా. తాత్కాలిక మరమ్మతులకు రూ.47.75 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.490.30 కోట్లు కలిపి రూ.537.95 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిధులు ఇస్తేనే రోడ్లు బాగుపడుతాయి.


జిల్లాలో నష్టం వివరాలు

-----------------------------------------------------------------------

వివరాలు నష్టం అంచనా రూ.కోట్లల్లో

------------------------------------------------------------------------

పంట నష్టం 56,138.6 హెక్టార్లు రూ.81.99 కోట్లు

ఉద్యాన పంటలు 17,704.8 హెక్టార్లు రూ.110.22 కోట్లు

పక్కా ఇళ్లు 2,580 రూ.5.81 కోట్లు

పశువులు, కోళ్లు 13,602 రూ.1.48 కోట్లు

ఆర్‌ అండ్‌ బీ రోడ్లు 583.91 కి.మీలు రూ.537.95 కోట్లు


 సర్వం కోల్పోయాం

- శశికళ, పులపుత్తూరు 

మా ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి. 20 తులాల బంగారు, ఇంట్లో సామగ్రి, తిండి గింజలు.. సర్వం వరదకు కొట్టుకుపోయాయి. ఇళ్లు కుప్పకూలాయి. కట్టుబట్టలతో రోడ్డు పడ్డాం. ప్రభుత్వం రూ.5,800 ప్రకారం ఇచ్చింది. బురద తొలగించారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.. ఇంటిని కట్టించి ఇవ్వాలి. 


ఇల్లు కట్టించి ఇవ్వాలి

- రత్నమ్మ, పులపుత్తూరు 

రెక్కాడితేనే పూట గడిచే పేదరికం మాది. వరదతో ఇంటితో సహా అన్నీ పోయాయి. ఆ రోజు ఇంట్లో నేను కూతురు శశికళ ఇద్దరే ఉన్నాం. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నాం. కూలిపోయిన ఇంటిని ప్రభుత్వమే సురక్షిత ప్రాంతంలో కట్టించి ఇవ్వాలి.


రూ.5800తో కష్టాలు తీరుతాయా

- టంగుటూరు రవి, పులపుత్తూరు 

ఏటి ఒడ్డునే మా ఇల్లు ఉంది. వరదొచ్చినప్పుడు ఇంట్లో ఐదుగురు ఉన్నాం. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో ఇంత నష్టం జరిగింది. సర్కారోళ్లు రూ.5,800 ఇచ్చారు. అంతటితో కష్టాలు తీరుతాయా..? ప్రభుత్వం నష్టపరిహారం, పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలి.


ఏదీ మిగలలేదు

- మన్నూరు వెంకట సుబ్రమణ్యం, మందపల్లి 

వరద ముంచెత్తడంతో ఇంట్లో సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి మిద్దె ఎక్కాం. ధాన్యం, సామగ్రి, ఎలకి్ట్రకల్‌ వస్తువులు ఏదీ మిగలలేదు. అన్నీ మళ్లీ కొనుగోలు చేయాల్సిందే. రూ.5 లక్షల దాక నష్టం జరిగింది.



Updated Date - 2021-11-27T06:15:06+05:30 IST