షో మాస్టర్‌

ABN , First Publish Date - 2020-09-15T05:30:00+05:30 IST

ఒక ఈవెంట్‌ నిర్వహించాలంటే..? అదీ మాస్ర్టో ఇళయరాజా లాంటి లెజెండ్స్‌ షో అయితే..? స్టేజీ మీద

షో మాస్టర్‌

ఒక ఈవెంట్‌ నిర్వహించాలంటే..? అదీ మాస్ర్టో ఇళయరాజా లాంటి లెజెండ్స్‌ షో అయితే..? స్టేజీ మీద హోస్ట్‌లు... వందల్లో గెస్ట్‌లు... వేల మంది అభిమానులు... అందర్నీ సమన్వయం చేసుకొంటూ కార్యక్రమాన్ని రక్తి కట్టించడమంటే సామాన్యం కాదు! కానీ సందీప్‌ గుడి... ఈ రంగంలో అనుభవం లేకపోయినా ఎందరో సెలబ్రిటీలతో ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించాడు. ప్రస్తుత కరోనా సమయంలో మొట్టమొదటిసారి ‘సురభి’ కళాకారులతో డిజిటల్‌ షోకు ఏర్పాట్లు చేస్తున్న సందీప్‌ జర్నీ ‘యంగ్‌’కు ప్రత్యేకం. 


ఇది విపత్కాలం. కరోనా దెబ్బకు చాలా జీవితాలు తలకిందలయ్యాయి. వారిలో వంద ఏళ్లకు పైగా చరిత్ర గల ‘సురభి’ కళాకారులూ ఉన్నారు. ప్రస్తుతం ప్రదర్శనలు లేక... పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. నాకు చేతనైనంతలో వారికి నిత్యావసరాలు అందించాను. దాంతోపాటు వారి కోసం ప్రతిష్టాత్మకంగా డిజిటల్‌ షో ఒకటి నిర్వహించబోతున్నాం. షూటింగ్‌ పూర్తి కావొస్తుంది. అక్టోబర్‌లో దీన్ని వీక్షించవచ్చు.


‘సురభి’ నాటక సంస్థ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా రంగస్థలంపైనే ప్రదర్శనలు ఇచ్చింది. కానీ తొలిసారి కళాకారులు డిజిటల్‌ తెరపై కనిపించబోతున్నారు. అందు కోసం వారికి కొంత పారితోషికం ఇచ్చాము. ఇది లాభం చూసుకొని చేసే కార్యక్రమం కాదు... కళాకారులను ఆదుకోవాలనే చిన్న ప్రయత్నం. 




‘డిజిటల్‌ షో’... 

ఇక ప్రస్తుత కరోనా కాలంలో ఈవెంట్లకు అవకాశం లేదు. దీంతో తెలుగులో ఎవరూ చేయని సాహసం చేశాం. లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా, వినోదాన్ని పంచే ఉద్దేశంతో ఆగస్టు 1న ప్రముఖ గాయని చిన్మయితో డిజిటల్‌ షో నిర్వహించాం. దాన్ని ఉచితంగా యూట్యూబ్‌లో లైవ్‌ ఇచ్చాం. షో కోసం పూర్తి బ్యాండ్‌తో స్టూడియో సెటప్‌ ఒకటి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దానికీ వెనకాడలేదు. ప్రస్తుతం సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, గాయనీమణులు చిత్ర, ఉషతో మరో షోకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


అలా మొదలైంది...    

అసలు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లోకి ఎందుకొచ్చావని సన్నిహితులు అడుగుతుంటారు. మన జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. నా విషయంలో అది అనుభవపూర్వకంగా రుజువైంది. దాదాపు ఇరవై ఏళ్ల కిందట అనుకుంటాను... చెన్నైలో కంప్యూటర్స్‌లో ఇంజినీరింగ్‌ చేస్తున్నా. ఆ సమయంలో అక్కడ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గారి మ్యూజికల్‌ నైట్‌ జరుగుతోంది.


ఆయన సంగీతం కోసం తరలివచ్చిన సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు, లెక్కకు మించిన అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ‘ఇళయరాజా గారి ఈవెంట్‌ అంటే ఇంతమంది ఒక్కచోట చేరతారా’ అనిపించింది. అప్పుడు అనుకున్నా... జీవితంలో ఒక్కసారైనా ఇళయరాజా గారితో ఒక ఈవెంటైనా నిర్వహించాలని! 


అనుకోకుండా ఇటువైపు...  

అంత పెద్ద లెజెండ్‌తో షో చేయాలని ఆ సమయంలో అనుకున్నాను కానీ... నిజానికి అది నా వల్ల అవుతుందా అనిపించింది. ఎందు కంటే మాది సాధారణ నేపథ్యం ఉన్న కుటుంబం. నాన్నా వాళ్లది గుంటూరు జిల్లా అయినా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్‌ తరువాత సింగపూర్‌లో ఎంబీయే చేశాను. అయితే ఏదో రొటీన్‌ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు.

దాంతో 2015లో వెబ్‌ డిజైనింగ్‌ సంస్థ ప్రారంభించాను. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ మీద ఉన్న మక్కువతో ‘11.2’ పేరుతో 2017లో ఒక సంస్థను ప్రారంభించాను. అనుకోకుండా ఒక రోజు ఫ్లయిట్‌లో వెళుతంటే పక్క సీటు ఆవిడతో మాట కలిసింది. ఇళయరాజా గారితో షో చేద్దామనుకుంటున్నాను అని మనసులో మాట ఆవిడకు చెప్పాను. ఆమెది సినిమా నేపథ్యం. దీంతో ఇళయరాజా మేనేజర్‌ కాంటాక్ట్‌ ఇచ్చారు. 


మొదటిదే మెగా ఈవెంట్‌... 

మేనేజర్‌ ద్వారా చెన్నై వెళ్లి ఇళయరాజాను కలిశాను. కొత్తవాడినే అయినా ఆయన నాపై నమ్మకం ఉంచి, షోకు ఓకే చెప్పారు. లెక్కలన్నీ వేస్తే షో కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు అవసరం. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? వెనక్కి తగ్గలేదు. బంధువులు, శ్రేయోభిలాషులు డబ్బు సమకూర్చారు. అది 2017 నవంబర్‌ 5. హైదరాబాద్‌. షో మొదలైంది. టెకెట్‌ కొన్నవారే వస్తారనుకున్నా.


కానీ ఇళయరాజా అనగానే సినీ ప్రముఖులు కూడా వచ్చారు. నేనసలు ఊహించలేదు. పూర్తి స్థాయిలో చేసిన మొదటి షో అది. మెగా హిట్‌ అయింది. కానీ అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం- ఇళయరాజా గారి మధ్యన చిన్న వివాదం తలెత్తింది. ఆ నేపథ్యంలో షోకు స్పాన్సర్లు రాలేదు. దాంతో నాకు లాభం రాలేదు. కానీ ఆ మెగా షో నా సంస్థకు ఒక పునిదిలా మారింది. 13 ఏళ్ల తరువాత ఇళయరాజా గారు చేసిన మొట్టమొదటి ఈవెంట్‌ కావడంతో మా సంస్థ పేరు మారుమోగింది.  



సెలబ్రిటీలతోనే అన్నీ... 

ఆ తరువాత ప్రముఖ నటి శోభనతో వరుసగా మూడు షోలు చేశాం. ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా గోశాల్‌, సునీతలతో కూడా ఈవెంట్లు పెట్టాం. గత ఏడాది నవంబర్‌లో గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, చిత్రలతో ‘లెజెండ్స్‌’ పేరుతో ఒక షో నిర్వహించాం. ఆ ముగ్గురినీ ఒకే వేదికపైకి తెచ్చి, షో ఏర్పాటు చేయడం అదే ప్రథమం. మొత్తం కలిపి ఇప్పటి వరకు ముప్ఫైకి పైగా ఈవెంట్లు మా సంస్థ ద్వారా దిగ్విజయంగా జరిపించామంటే నేనే నమ్మలేకపోతున్నాను. 


మనవారి తీరు మారాలి... 

ఈవెంట్‌ మేనేజర్‌గా ఇబ్బందులంటే చాలానే ఉంటాయి. తమిళంలో లాగా మన తెలుగులో గాయకులు, సంగీత దర్శకులు సహకరించరు. అందరి గురించీ నేను చెప్పడంలేదు. కొందరు అలా ఉన్నారు. ఈ తీరు మారాలి. ఓ షో కోసం పెద్దగా పేరు లేని ఓ చిన్న గాయకుడిని అడిగితే 2 లక్షలు డిమాండ్‌ చేశాడు. వద్దని చిత్ర గారిని సంప్రతిస్తే, అదే మొత్తానికి ఆమె ఓకే అన్నారు. అలాగే చిన్మయి!  


 హనుమా 



సామాజిక సేవ...

నాకున్న దాంట్లో ఎంతో కొంత లేనివారి కోసం ఇవ్వాలనుకొంటాను. ఆ ఆలోచనతోనే పన్నెండేళ్ల కిందట ‘వి-కేర్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. అందులో 250 మంది అనాథ పిల్లలు ఉన్నారు. వారి కోసం దిండిగల్‌లో క్యాంపస్‌ ఏర్పాటు చేశాను. ‘స్ఫూర్తి’ అనే మరో సంస్థతో కలిసి పనిచేస్తున్నాం.

కేరళ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిత్యావసరాలు అందిస్తున్నాం. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటాం. దీనికి తెలుగు నటులు రానా, సమంత, నవదీప్‌, అనసూయ, ప్రదీప్‌ సహకరిస్తుంటారు. నవదీప్‌, అనసూయ అయితే ప్రభావిత ప్రాంతాల్లో మాతో కలిసి పని చేస్తారు. డబ్బు సంపాదనే కాకుండా సమాజానికి కొంతైనా ఇవ్వగలుగుతున్నానన్న ఆలోచన నాకెంతో సంతృప్తినిస్తుంది. 




Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST