ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-10-20T07:09:26+05:30 IST

ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2021ని సంబంఽధిత శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

 కలెక్టర్‌ భారతి హోళికేరి


మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 19: ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2021ని సంబంఽధిత శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికారులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ 01.01.2021 నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండిన పౌరులను ఓటర్లుగా నమోదు చేయించాలని చెప్పారు. దీంతో పాటు ఓటరు జాబితా సంక్షిప్త సవరణ చేపట్టడం కోసం కార్యాచరణ రూపొందించామని తెలిపారు. దీన్ని సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల నాయకుల సమన్వయంతో కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఈ నెల 31లోగా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, పేరు మార్పు, పోలింగ్‌ కేంద్రాలను వేరే ప్రదేశానికి మార్చడానికి ప్రతిపాదనలను తయారు చేయాలని సూచించారు. 


నవంబరు 1 నుంచి 15వ తేదీ వరకు ఫార్మాట్‌ 1 నుంచి 8 తయారు చేయాలని చెప్పారు. సప్లిమెంట్స్‌, సమీకృత ఓటరు జాబితా తయారీ జరుగుతుందని అన్నారు. నవంబరు 16న సమీకృత ఓటర్ల ముసాయిదా ప్రచురించాలని సూచించారు. డిసెంబరు 15 వరకు జాబితాపై వాదనలు, అభ్యంతరాల నమోదు గడువు ఉంటుందని అన్నారు. ఈ గడువు సమయంలో రెండు శనివారాలు, రెండు ఆదివారాలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 5వ తేదీన క్లయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 14-01-2021న తుది జాబితా ప్రచురణకు ఎన్నికల సంఘం అనుమతి పొంది డాటాబేస్‌ను అప్‌డేట్‌ చేస్తామని అన్నారు. జనవరి 15న ఓటర్ల జాబితా ప్రచురించనున్నామని తెలిపారు. ఈనెల 23వ తేదీలోగా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, కేంద్రాల పేరు మార్పు తదితర విషయాలను వివిధ రాజకీయ పార్టీల నాయకులతో చర్చించనున్నామని తెలిపారు.


వారి సలహాలను స్వీకరించి తుది ప్రతిపాదనలను పంపిస్తామని చెప్పారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల పోలింగ్‌ కేంద్రాల పరిఽధిలో మొత్తంగా 726 పోలింగ్‌ కేంద్రాలున్నాయని అన్నారు. అందులో 5 లక్షల 87 వేల 14 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వీరిలో 2 లక్షల 96 వేల 241 మంది పురుషులు, లక్షా 24 వేల 892 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారన్నారు. ప్రతీ 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉంటుందని తెలిపారు.  కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు రమేష్‌, శ్యామలాదేవి, సి విభాగం పర్యవేక్షకులు రజని, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సంబంధితశాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-20T07:09:26+05:30 IST