స్వేచ్ఛ ఉండాల్సిందేగానీ..

ABN , First Publish Date - 2020-02-29T09:22:17+05:30 IST

ఈ సృష్టిలో పశు, పక్ష్య, మృగాదులు పరిపూర్ణమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. మరి మానవులుగా జన్మించిన వారు స్వేచ్ఛా జీవితానికి అర్హులు కారా? తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని

స్వేచ్ఛ ఉండాల్సిందేగానీ..

ఈ సృష్టిలో పశు, పక్ష్య, మృగాదులు పరిపూర్ణమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. మరి మానవులుగా జన్మించిన వారు స్వేచ్ఛా జీవితానికి అర్హులు కారా? తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని గడపడం నేరమా? సమాజం అంగీకరించదా? అని చాలా మంది అంటుంటారు. సమాజంలో అందరూ ఆలోచించాల్సిన అంశమిది.


భగవంతుడు ఏర్పరచిన సృష్టి నియమాన్ననుసరించి ప్రతి జీవీ తనకు స్వాభావికమైన, బతుకు తెరువుకు అవసరమైన స్వేచ్ఛను అనుభవించవచ్చు. అయితే అన్ని జీవుల స్వేచ్ఛా ఒకే రకంగా ఉండదు. 84 లక్షల జీవులు వైవిధ్యభరితంగానే ఉన్నాయి గనుక ఆయా జీవుల స్వేచ్ఛా జీవితంలో కూడా వైవిధ్యం ఉంటుంది. ఒక జీవి స్వేచ్ఛను మరొక జీవి అనుసరించడం కుదరదు. ఆయా జీవరాశులకు అవసరమైనట్టుగా సృష్టి ధర్మం నిర్దేశించిన స్వేచ్ఛను మాత్రమే అనుభవించడానికి వీలవుతుంది. పశువులు పశు స్వేచ్ఛను, పక్షులు పక్షి స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. మానవులు మానవ స్వేచ్ఛను గాకుండా పశు స్వేచ్ఛను, మృగ స్వేచ్ఛను అనుభవించాలని ఆశించడంతోనే సమస్య వస్తోంది. ఇది అనైతికం, అధర్మం, సమాజానికి హానికరం అవుతుంది. రెండు రెక్కలు లేకపోతే పక్షి ఎగరలేదు. అలాగే నియమ, నిగ్రహాలు లేకపోతే మనిషి ఉన్నత స్థాయిని చేరుకోలేడు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తించడం ప్రారంభిస్తే సామాజిక జీవనం అల్లోకల్లోలమవుతుంది. పైగా మనం అనుకుంటున్నట్లు స్వేచ్ఛా జీవనం అనుభవిస్తున్నాయనుకున్న పశు పక్ష్యాదులు, మృగాలు కూడా ప్రకృతిసిద్ధంగా కొన్ని నియమనిబంధనలు, కట్టుబాట్లు పాటిస్తాయి.


అన్నీ తెలుసనుకునే మానవుల కంటే అధికంగా, మరొకరు చెప్పవలసిన అవసరం లేకుండా క్రమశిక్షణ పాటిస్తాయి. వృక్షజాతులు కూడా ప్రకృతి నియమాలను అనుసరిస్తూ.. ప్రకృతి నిర్దేశించిన రుతువులోనే పూతపూసి, కాయలు కాసి, సమాజానికి పలు రకాల పండ్లనందిస్తాయి. ఏ చెట్టూ ఎప్పుడుపడితే అప్పుడు కాపునివ్వదు. పుష్పజాతులు కూడా కొన్ని రుతువుల్లోనే బాగా పూస్తాయి. ఆకు రాలు కాలం రాగానే అన్ని చెట్లూ ఎవరో చెప్పినట్లుగా ఆకులు రాల్చి, మళ్లీ కొత్త చిగుళ్లను తొడుక్కుంటాయి. నీరు పల్లానికే ప్రవహిస్తుంది. అగ్ని పైకే జ్వలిస్తుంటుంది. మంచు తెల్లగా చల్లగానే ఉంటుంది. వాయువు చలిస్తుంటుంది. అందుకు భిన్నంగా అవి వ్యవహరించవు. ఇలా ప్రకృతిలో ప్రతిదీ నియమానుసారం వర్తిస్తున్నప్పుడు మానవులమైన మనం కూడా అలాగే వ్యవహరించాలి. ధర్మబద్ధమైన స్వేచ్ఛను అనుభవిస్తూనే.. సమాజానికి హితం చేకూర్చే నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే.. కారులో వేగాన్ని పెంచే యాక్సిలరేటర్‌ మాత్రమే ఉండి.. బ్రేక్‌ లేకపోతే ఎలా ఉంటుందో హద్దులు లేని స్వేచ్ఛ అలాగే ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను కోరుకునేవారి గతి అథోగతే అవుతుంది. 


మరి మనం పాటించవలసిన నియమనిష్టలు ఏమిటంటే.. మానవీయ విలువలను కలిగి ఉండడం. ప్రేమ, దయ, సహనం, క్షమ, పరోపకారం, సత్యనిరతి, శాంతి, అహింస వంటి సత్‌లక్షణాలను నిత్య జీవితంలో అనుక్షణం జ్ఞాపకముంచుకొని వర్తించడం. అన్ని ధర్మాలలో ప్రధానమైన ధర్మం.. ఇతరులకు బాధను, కష్టాన్ని, నష్టాన్ని కల్గించే పనులకు పూనుకోకపోవడం. చేతనైనంత మేర పరోపకారం చేయడం. ఈ ధర్మ చక్రానికి లోబడి, అందులో ఇమిడి జీవించగల్గితే మనం ఆనందంగా ఉంటాం. ఇతరులను ఆనందంగా ఉంచగల్గుతాం. తద్వారా సమాజమంతా ఆనందంగా ఉంటుంది. ఇంతకన్నా మానవజాతికి కావాల్సిందేముంటుంది!


మాదిరాజు రామచంద్రరావు, 93933 24940

Updated Date - 2020-02-29T09:22:17+05:30 IST