పంట కోతలకు కూలీల కొరత

ABN , First Publish Date - 2020-03-30T10:39:14+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కోతలు కూడా కోయలేని దుస్థితిలో రైతాంగం అల్లాడుతోంది.

పంట కోతలకు కూలీల కొరత

 జిల్లాలో 4 వేల హెక్టార్లలో కూరగాయల సాగు

లాక్‌డౌన్‌తో కన్నెత్తి చూడని వ్యాపారులు 

నిత్యావసరాలకూ రవాణా సడలింపులేవీ..? 

తాజాగా వ్యవసాయ పనులకు మినహాయింపు 

క్షేత్రస్థాయిలో అమలు చేయకపోతే రైతులకు నష్టమే


అనంతపురం వ్యవసాయం, మార్చి 29: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కోతలు కూడా కోయలేని దుస్థితిలో రైతాంగం అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్‌ 14 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిం దే. దీని ప్రభావం పంట కోతలపై తీవ్రంగా పడుతోంది. గతంలో తమకు అనుకూలమైన కూలీలను ఇతర గ్రామాల నుంచి రైతులు పిలిపించుకునేవారు. ప్ర స్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా ప్రభావంతో కూలీలెవరూ పనులకు వెళ్లడం లేదు. దీంతో పంట చేతికి వచ్చినా కోత కోసుకోలేని దుస్థితిలో రైతులున్నారు. 


జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తమ గ్రామంలోని కూలీలను ఎలాగోలా బ్రతిమలాడి  పనులకు పిలిపించుకుంటున్నారు. తెల్లవారుజామునే ఆటోలు, ట్రాక్టర్లలో పొలాలకు తీసుకువెళ్లి ఉదయం 11 గంటల్లోపే తిరిగి గ్రామంలో వదిలేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కూలి డబ్బులు ఎక్కువగా ఇస్తామన్నా కూలీలు పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. 


పొలాల్లో కూలి పనులు చేసే సమయంలో సహజంగానే సామాజిక దూరం పాటిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు ఒక మీటరు సామాజిక దూ రం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడంతోపాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ సూ చన మేరకు కూలీలకు సరైన అవగాహన కల్పించి కూలి పనులకు వచ్చేలా చేయాలని రైతులు కోరుతున్నారు. 


లాక్‌డౌన్‌తో కన్నెత్తి చూడని వ్యాపారులు 

జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 4 వేల హెక్టార్లలో వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేశారు. టమోటా, బెండ, బీర, కాకర, వంకాయ, మిరప తదితర కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం కోత దశలో అరటి, కళింగర, కర్బూజ పంటలున్నాయి. మరో వారం రోజుల్లో ద్రాక్ష, పక్షం రోజుల్లో చీనీ పంటలు కోత దశకు వస్తాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులెవరూ ముందుకు రావడంలేదు. 


దీంతో పలు ప్రాంతాల్లో పంటలు వదిలేయాల్సిన దుస్థితిలో రైతులున్నారు. కూలీలు దొరక్కపోవడం, ఒకవేళ పంట కోత కోసినా కొనేవారు లేకపోవడంతో ఏం చేయాలో తోచని అయోమయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు అనంతపురం నగరంతోపాటు ఇతర పట్టణాల్లో ప్రత్యేకంగా కూరగాయల మార్కె ట్లు ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా కూరగాయల పంట సాగు చేసిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించకపోతే పంట ఉత్పత్తులు చేతికి అం దడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు మునపటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం కూరగాయల ధరలు పెరిగాయి. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


తాజాగా వ్యవసాయ పనులకు మినహాయింపు 

లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి వ్యవసాయ సంబంధిత పనులకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. పంటకోత పనులు, మార్కెట్‌ యార్డులు, పంట సేకరణ సం స్థలు, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు తెరిచేందుకు, పంట ఉత్పత్తులను ఇతర రాష్ర్టాలకు తరలించేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే వ్యవసాయ కూలీలు, ఎరువులు, పురుగు మందులు, విత్తన తయారీ యూనిట్లలో పనిచేసే వారికీ మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కేంద్రప్రభుత్వ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయా వర్గాల్లో అవగాహన తీసుకురావడంతోపాటు  తగు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. మరి ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే. 


పంట కోతకు కూలీలు దొరకడం లేదు..  ఉమేష్‌, తాటిచెర్ల, అనంతపురం రూరల్‌ మండలం 

ఎకరా పొలంలో బెండ సాగు చేశా. రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌తో బెండ కోతకు కూలీలెవరూ రావడం లేదు. మా కుటుంబ సభ్యులమే కోత కోసుకుంటున్నాం. వారం రోజుల క్రితం వరకు వ్యాపారులు పొ లం వద్దకే వచ్చేవారు. కోతలో తక్కువ కేజీలు వచ్చిన రోజుల్లో గార్లదిన్నెలో అమ్మేవాడిని. ప్రస్తుతం వ్యాపారులెవరూ బెండ పంట కొనేందుకు రావడం లేదు. శనివారం తొమ్మిది బస్తాల (ఒక  బస్తా 80 కేజీలు) బెండ కాయలు కోశాం. నాలుగు మూటలు మాత్రమే గార్లదిన్నెలో వేసుకున్నారు. మిగిలిన నాలుగు బస్తాలు ఆవులకు మేతగా వేసేందుకు ఇచ్చాం. పెట్టుబడి ఖర్చులు కూడా వస్తాయో లేదో నని భయంగా ఉంది. 


పంట ఉత్పత్తుల రవాణాకు చర్యలు.. సుబ్బరాయుడు, డీడీ, ఉద్యానశాఖ 

జిల్లాలో ఉద్యాన పంటల ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం వ్యవసాయ పనులు, నిత్యావసర సరుకుల రవాణాకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఎక్కడైనా సమస్యలుంటే ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళితే సమస్యలు తలెత్తకుండా చూస్తాం. 


ముదిగుబ్బ మండలం సిరగారిపల్లి గ్రామానికి చెందిన రైతు కోన రవికుమార్‌ 14 ఎకరాలలో కలింగర పంట సాగు చేశాడు. దీనిపై రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కాపు బాగా కాసింది.  సంతోషించాడు. పంట అమ్మితే పెట్టుబడి పోను ఎంతో కొంత మిగులుతుందని ఆశించాడు. అయితే ఇంతలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇక అంతే వ్యాపారులు రావడంలేదు. ఎక్కడ అమ్ముకోవాలో అంతకంటే తెలియదు. పంటను ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. దీంతో ఆ రైతుకు ఆర్థికంగా  కోలుకోని దెబ్బతగిలింది. ఈ ఽపరిస్థితి ఈ ఒక్క రైతుదే కాదు.. జిల్లా వ్యాప్తంగా కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యానపంటలు సాగుచేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోతే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. 

Updated Date - 2020-03-30T10:39:14+05:30 IST