రవాణాశాఖలో స్మార్ట్‌ కార్డుల కొరత

ABN , First Publish Date - 2022-01-23T06:11:11+05:30 IST

రవాణా శాఖలో తరచుగా వస్తున్న సమస్య లైసెన్స్‌, ఆర్సీ(రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) స్మార్ట్‌ కార్డుల కొరత మళ్లీ మొదలైంది.

రవాణాశాఖలో స్మార్ట్‌ కార్డుల కొరత
ఃకరీంనగర్‌ రవాణా శాఖ కార్యాలయం


- అక్టోబర్‌ నుంచి నిలిచిన లైసెన్స్‌, ఆర్సీ కార్డుల జారీ

- ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌నే నమ్ముకున్న వాహనదారులు


తిమ్మాపూర్‌, జనవరి 22 : రవాణా శాఖలో తరచుగా వస్తున్న సమస్య  లైసెన్స్‌, ఆర్సీ(రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) స్మార్ట్‌ కార్డుల కొరత మళ్లీ మొదలైంది. రవాణాశాఖలో పలు సేవల కోసం ధరఖాస్తు చేసుకున్న వాహనదారులు కార్డులు అందుబాటులో లేక పోవడంతో వాటి కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రవాణా శాఖ అధికారులు చెప్పిన సమయం వరకు కూడా పోస్టులో తమ కార్డు ఇంటికి రాకపోవడంతో నిత్యం అన్ని పనులు వదులుకొని రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరుగాల్సి వస్తోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు సేవల కోసం  ముందుగానే అన్ని ఫీజులు, పోస్టల్‌ ఛార్జీలు చెల్లించినా కార్టులు అందకపోవడంతో పోలీసుల తనిఖీల్లో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ కార్టుల కొరత రవాణాశాఖకు తలనొప్పిగా మారింది. కార్డు రాలేదంటూ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే వాహనదారులకు ఏదో ఒక సమాధానం చెప్పి కార్యాలయ సిబ్బంది పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 7,039 ఆర్సీకార్డులు, 3,592 డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు వాహన దారు లకు అందించాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్మార్ట్‌కార్డుల జారీ ప్రకియ వేగవంతం చేసి తమకు ఇబ్బంది కలగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. 


కార్డు కోసం రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం

 చెలిమల్ల రవీందర్‌, వాహనదారుడు, కరీంనగర్‌


ద్విచక్రవాహనం రిజిస్ర్టేషన్‌ పూర్తి చేసి సంవత్సరంపైనే అవుతోంది. ఆర్‌సి కార్డు పోస్ట్‌లో వస్తుందని చెప్పారు.   ఆర్‌సీ కార్డు ఇప్పటికీ అందలేదు. నెలలో రెండు, మూడు సార్లు రవాణాశాఖ కార్యాలయానికి వచ్చి కార్డు కోసం అడుగుతూనే ఉన్నా. ఆర్‌సీ కార్డు లేక పోలీసుల తనిఖీల్లో జారిమానా చెల్లించాల్సి వస్తోంది. 


ఎంవాలెట్‌ చేయించుకుంటే సరిపోతుంది

 మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, డీటీసీ, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 


కార్డులు వచ్చినట్లు ప్రింటింగ్‌ చేసుకుంటూ జారీ చేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా రవాణాశాఖకు సంబందించిన ఎంవాలెట్‌ ద్వారా ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు. మరో వారం, పది రోజుల్లో కార్డులు వస్తాయి, వచ్చిన తరువాత కార్డులను జారీచేస్తాం. త్వరలో కార్డుల సమస్య తీరుతుందని అనుకుంటున్నాం. 

Updated Date - 2022-01-23T06:11:11+05:30 IST