జిల్లా ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరత

ABN , First Publish Date - 2022-05-14T07:23:04+05:30 IST

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు దాటినా.. నేటికీ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయలేదు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రధాన విభాగాలతోపాటు విలువైన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆ స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు.

జిల్లా ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరత

నేటికీ భర్తీకాని వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు    

వైద్య విద్యార్థులపై పెరుగుతున్న భారం 

సిబ్బంది కొరతతో రోగులకు అందని వైద్యం   

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

నిజామాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు దాటినా.. నేటికీ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయలేదు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రధాన విభాగాలతోపాటు విలువైన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆ స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. దీంతో జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు వైద్యులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రికి వేళ్లే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతున్నారు.

పట్టించుకోని అధికారులు..

కరోనా వ్యాప్తి సమయంలో రాష్ట్రస్థాయిలోనే పేరొందేవిధంగా వైద్యసేవలు అందించిన ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంలేదు. కొన్ని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పోస్టులను భర్తీచేసి వైద్యసేవలు అందిస్తున్నా.. ఉన్న సిబ్బందిపై మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. జూనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌తో పాటు పీజీ విద్యార్థులపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. కరోనాతో పాటు ప్రసవాలు, మోకాలిచిప్ప ఆపరేషన్‌లు, ఇతర వైద్యసేవల్లో ముందున్న ఆసుపత్రిలో సిబ్బందిని మొత్తం భర్తీచేస్తే వారిపై ఒత్తిడి తగ్గనుంది.

జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కీలకమైన వైద్యసేవలను అందిస్తున్నారు. కరోనా రెండు విడతల్లో వేలమందికి చికిత్స అందించారు. గాంధీ ఆస్పత్రి తర్వాత అత్యధిక రోగులకు ఇక్కడి ఆసుపత్రిలో వైద్య సేవలను అందించారు. వైద్య కళాశాల ఏర్పాటు చేసి ఎనిమిది ఏళ్లు దాటినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో స్టాఫ్‌ను భర్తీచేయలేదు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుచేసినపుడే అన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినా వివిధ కారణాలతో భర్తీకాలేదు. ఎంబీబీఎస్‌తో పాటు పీజీ కోర్సులను ప్రారంభించి విద్యార్థులను చేర్చుకుంటున్నా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌ క్యాడర్‌ వరకు ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయి. కీలకమైన గైనకాలజి, పిడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయి. మెడికల్‌ కళాశాలకు అనుగుణంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఏడు అంతస్తుల భవనం నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. బెడ్స్‌ సంఖ్యను పెంచారు. కరోనా సమయంలో 700 బెడ్స్‌ వరకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. వెంటిలేటర్స్‌ 150 వరకు పెంచారు. చిన్న పిల్లలకు అవసరమైన వెంటలేటర్స్‌ కూడా ఆసుపత్రిలో సమకూర్చారు. ఈ ఆసుపత్రిలో గైనకాలజి విభాగంలో ప్రతినెలా 600 నుంచి 700 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. కీలకమైన గైనకాలజి విభాగంలో ఆరుగురికిపైగా వైద్యులు ఉండాల్సి ఉండగా ముగ్గురు ఉన్నారు. మిగతా జూనియర్‌ రెసిడెన్స్‌, సీనియర్‌ రెసిడెన్స్‌, పీజీ గైనకాలజి చదివే విద్యార్థులను వినియోగిస్తునారు. చదువులో భాగంగా ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కొన్నిసార్లు డ్యూటీ వేయడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోంది. నర్సింగ్‌ విద్యార్థులను కూడా విధులకు వినియోగిస్తున్నారు. 

ఖాళీగా 109 పోస్టులు..

 ఈ ఆసుపత్రిలో అన్ని విభాగాలు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌ వరకు 284 మంది వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రెగ్యులర్‌ 91 మంది, కాంట్రాక్ట్‌ 84 మంది పనిచేస్తున్నారు. మొత్తం 175 మంది మాత్రమే పనిచేస్తుండగా 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మెడికల్‌ ఆఫీసర్‌లతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, ప్రొఫెసర్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రిలో మొత్తం 265 మంది స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు ఉండాల్సి ఉండగా రెగ్యులర్‌ 73, ఔట్‌ సోర్సింగ్‌లో 54, కాంట్రాక్ట్‌లో 94 మంది పనిచేస్తున్నారు. మొత్తం 221 మంది పనిచేస్తుండగా 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో పారమెడికల్‌ సిబ్బంది ల్యాబ్‌ టెక్నిషియన్‌ నుంచి ఎక్స్‌రే టెక్నిషియన్‌ 88 మంది ఉండాల్సి ఉండగా రెగ్యులర్‌ 10 మంది, డిప్యూటేషన్‌పై 9 మంది పనిచేస్తున్నారు. మొత్తం 19 మంది పనిచేస్తుండగా 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజి, పీజీ 2వ సంవత్సరం విద్యార్థిని మృతిచెందింది. ఆ విద్యార్థిని కరోనా టైంతో పాటు ప్రస్తుతం కూడా ఆ విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఆమెతో పాటు ఇతర పీజీ విద్యార్థులు కూడా వైద్య సేవలను ఆసుపత్రిలో అందిస్తున్నారు. రెగ్యులర్‌ వైద్యులు లేకపోవడం, ఖాళీలను భర్తీచేయకపోవడం వల్ల చదువుకునే వైద్య విద్యార్థులపై భారం పడుతోంది. అన్ని వసతులు కల్పించినా ఈ ఆసుపత్రిలో ఉన్న ఖాళీలన్నీ భర్తీచేస్తే వైద్య విద్యార్థులపై  భారం, ఒత్తిడి తగ్గడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది.

ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని మృతి

ఫ డాక్టర్‌ శ్వేత విధులు నిర్వర్తించి వార్డులోనే నిద్రలో మృతి  ఫ హార్ట్‌స్ర్టోక్‌గా అనుమానిస్తున్న వైద్యులు

నిజామాబాద్‌, మే 13 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి)/ పెద్దబజార్‌: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తూ గైనకాలజి విద్యార్థి డాక్టర్‌ శ్వేత మృతిచెందారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు గైనిక్‌వార్డులో విధుల్లో ఉన్న ఆమె తనరెస్ట్‌రూం లో పడుకుని నిద్రలోనే చనిపోవడంతో ఆసుపత్రిలో కలకలం రేపిం ది. తోటి విద్యార్థిని విధులు ముగించుకుని శ్వేతను లే పేందుకు ప్రయత్నించగా చనిపో యి ఉండడం తో సీనియర్‌ వైద్యులకు, సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టానికి తరలించారు.

ఫ రెండేళ్ల క్రితం జిల్లాకు..

కరీంనగర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ శ్వేతా తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. శ్వేతను కరీంనగర్‌లోనే ఎంబీబీఎస్‌ చదివించిన ఆయన పీజీ సీటు రావడంతో రెండేళ్ల క్రితం నిజామాబాద్‌కు పంపించారు. చదువులో చురుకుగా ఉండే శ్వేత ఓపెన్‌ కేటగిరిలో గైనకాలజి సీటును సా ధించారు. రెండుస్లారు కొవిడ్‌ వచ్చినా.. అది తగ్గగానే వార్డుల్లో విధులను నిర్వహించారు. విధుల్లో చురుగ్గా ఉండడంతో పాటు తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యే ఆమె అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

డాక్టర్‌ శ్వేతకు నివాళులు

డాక్టర్‌ శ్వేత మృతదేహానికి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌, మృతురాలి సోదరుడు కిరణ్‌కుమార్‌ నివాళులు అర్పించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆమె స్వగ్రామానికి తరలించారు. మృతురాలితో పాటు వైద్య కశాశాలలో చదువుతున్న తోటి జూనియర్‌ వైద్యులు ఆస్పత్రి ప్రధాన గేట్‌ వరకు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. 

Read more