ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల కొరత!

ABN , First Publish Date - 2022-01-23T08:46:28+05:30 IST

జోనల్‌ వ్యవస్థ పేరుతో ఇటీవల చేపట్టిన బదిలీల వల్ల రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల కొరత ఏర్పడింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కొన్ని ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగాయి.

ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల కొరత!

  • జోనల్‌ బదిలీలతో తలెత్తిన సమస్య
  • నిలోఫర్‌లో ఒకేసారి 130 మంది ట్రాన్స్‌ఫర్‌
  • ఉస్మానియా నుంచి 147 మంది..
  • అరకొర సిబ్బందితో వైద్య సేవల్లో జాప్యం


మంగళ్‌హాట్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జోనల్‌ వ్యవస్థ పేరుతో ఇటీవల చేపట్టిన బదిలీల వల్ల రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల కొరత ఏర్పడింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కొన్ని ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగాయి. ఆ స్థానాల్లో కొత్త వారు రాకపోవడంతో వైద్య సేవల అందుబాటులో సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలోనే పెద్దాసుపత్రులుగా పేరుగాంచిన నిలోఫర్‌, ఉస్మానియాలో కూడా ఈ సమస్య ఉంది. 1000 పడకల సామర్థ్యం ఉన్న నిలోఫర్‌ ఆస్పత్రిలో మొత్తం 200 మంది నర్సులు ఉండేవారు. జోనల్‌ బదిలీలో ఇందులో 130 మంది ఒకేసారి వేరే చోటికి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త వారు ఇంకా రాకపోగా, మిగిలిన 70 మందిలో 27 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం 43 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇదే ఆస్పత్రిలో 150 పడకల ఐసోలేషన్‌ వార్డు ఉండటంతో రోగులు, సిబ్బంది పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఉస్మానియా ఆస్పత్రిలో మొత్తం 1168 పడకలు ఉండగా 388 మంది నర్సింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించేవారు. వీరిలో 147 మంది ఒకేసారి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఓపీతోపాటు ఆపరేషన్‌ థియేటర్ల వద్ద పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నగరంలోని ఇతర ఆస్పత్రుల్లోనూ ఇదే తరహా సమస్యలున్నాయి. ఆరునెలల క్రితం టీఎ్‌సపీఎస్సీ ద్వారా ఎంపిక చేసిన మూడు వేల మంది నర్సింగ్‌ సిబ్బందిలో ఎక్కువ మందికి నగరంలోని ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. జోనల్‌ బదిలీల్లో వీళ్లలో 80 శాతం మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కొత్త వారు రాక ముందే పాత వారిని రిలీవ్‌ చేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు. నర్సుల కొరతతో ఆస్పత్రుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు అధికారులు డీఎంఈ రమేష్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. బదిలీపై వెళ్లిన వారిని డిప్యూటేషన్‌పై వెనక్కు రప్పిస్తామని, అప్పటిదాకా ఓపిక పట్టాలని ఆయన అధికారులకు సూచించినట్టు సమాచారం. 

Updated Date - 2022-01-23T08:46:28+05:30 IST