‘వ్యయ’సాయం!

ABN , First Publish Date - 2022-08-16T05:21:07+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ రైతులను కూలీల కొరత వేధిస్తోంది. ఏటా ఈ సమస్య వారిని వెంటాడుతోంది. అసలే పెరిగిన పెట్టుబడి వ్యయానికి తోడు కూలీల ఖర్చు మరింత భారంగా మారుతోంది.

‘వ్యయ’సాయం!

వ్యవసాయ పనులకు కూలీల కొరత

కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేసేందుకు సుముఖత

అధిక మొత్తంలో డిమాండ్‌

రైతులపై అదనపు భారం

  (పాలకొండ)

జిల్లాలో ఖరీఫ్‌ రైతులను కూలీల కొరత వేధిస్తోంది. ఏటా ఈ సమస్య వారిని వెంటాడుతోంది. అసలే పెరిగిన పెట్టుబడి వ్యయానికి తోడు కూలీల ఖర్చు మరింత భారంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 75 వేల హెక్టార్లలో వరి సాగు చేపడుతున్నారు. అయితే కూలీల సమస్య అధిగమించేందుకు 30 శాతం రైతులు ఎద పద్ధతిలో  సాగు చేస్తున్నారు.  మిగిలిన 75 శాతం మంది నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతూ ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే వ్యవసాయ పనులు ముమ్మరమవుతున్న తరుణంలో జిల్లాలో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో కొంతమంది కూలీలు కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే పనులు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు.  రైతుల నుంచి వారు అధిక మొత్తాలను డిమాండ్‌ చేశారు.  వాస్తవానికి రెండేళ్ల  కిందట ఎకరా దమ్ము చేపట్టేందుకు గంటకు రూ.800 చొప్పున ట్రాక్టర్‌కు అద్దె ఉండేది. ప్రస్తుతం అదే అద్దె రూ.1200 పెరిగింది. అప్పట్లో దమ్ము చేసిన అనంతరం ఎకరా పొలాన్ని పశువులతో చదును చేసేందుకు (నొల్లతోలేందుకు) రూ.500 చెల్లించేవారు. ఇప్పుడు రూ.1000 వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఎకరా నారుమడి తీసేందుకు గతంలో  రూ.1200 చెల్లిస్తే..  ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎకరా పొలంలో నారును వేసేందుకు గతంలో రూ.500 వరకూ వసూలు చేస్తే.. ప్రస్తుతం రూ.1200 వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. రెండేళ్ల కిందట నాట్లు వేసేందుకు రూ.1500 చెల్లిస్తే.. ఇప్పుడు  రూ.3 వేలు వరకు డిమాండ్‌ చేస్తున్నారు. కలుపు తీసేందుకు గతంలో ఎకరాకు రూ.1200 వరకు ఇచ్చేవారు.  ప్రస్తుతం రూ.2 వేలు చెల్లించాల్సి వస్తోంది. పంట పొలంలో చీడపీడల నివారణకు వినియోగించే క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేందుకు గతంలో ఎకరాకు   రూ.200ను రైతులు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇవే కాకుండా పెరిగిన పురుగులు, క్రిమి సంహారక మందులు, ఎరువుల ధరలు రైతులకు మరింత భారంగా మారుతున్నాయి.  స్థానికంగా ఉపాధి దొరకని కారణంగా  జిల్లాకు చెందిన చాలామంది వ్యవసాయ కూలీలు  ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఒడిశా తదితర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భవన నిర్మాణం, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సముదాయాల్లో నెలవారి, రోజువారి పద్ధతిలో ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడే ఉండి పనులు చేపడుతున్నారు.  దీంతో జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. ఏటా రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ‘ఉపాధి’కి వ్యవసాయ పనులు అనుసంధానం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ 

రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మరిన్ని అందించేందుకు ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటికే అన్ని మండలాలకు సబ్సిడీ ధరలకు ట్రాక్టర్లను పంపిణీ చేశాం. 

 - రాబర్ట్‌ పాల్‌, జిల్లా వ్యవసాయశాఖాధికారి  

  

Updated Date - 2022-08-16T05:21:07+05:30 IST